Share News

షుగర్‌ ఫ్యాక్టరీల మనుగడ ప్రశ్నార్థకం?

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:53 AM

జిల్లాలోని షుగర్‌ ఫ్యాక్టరీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో మూతపడిన తాండవ, ఏటికొప్పాక ఫ్యాక్టరీలకు పూర్వ వైభవం వస్తుందని ఆయా కర్మాగారాల ఉద్యోగులు, చెరకు రైతులు ఆశించినప్పటికి ఆ పరిస్థితులు కనిపించడం లేదు. మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీల ఆస్తులు, భూములను ఏపీఐఐసీకి అప్పగించి ఫ్యాక్టరీల అప్పులను తీర్చాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించడంతో ఉద్యోగ, కార్మిక వర్గాలు, రైతుల్లో ఆందోళన నెలకొంది.

షుగర్‌ ఫ్యాక్టరీల మనుగడ ప్రశ్నార్థకం?
తాండవ షుగర్‌ ఫ్యాక్టరీ

- తాండవ, ఏటికొప్పాక కర్మాగారాల ఆస్తులు, భూములు ఏపీఐఐసీకి అప్పగించాలని సర్కారు నిర్ణయం

- ఆధునికీకరణ ఆశలు ఆవిరి

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని షుగర్‌ ఫ్యాక్టరీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో మూతపడిన తాండవ, ఏటికొప్పాక ఫ్యాక్టరీలకు పూర్వ వైభవం వస్తుందని ఆయా కర్మాగారాల ఉద్యోగులు, చెరకు రైతులు ఆశించినప్పటికి ఆ పరిస్థితులు కనిపించడం లేదు. మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీల ఆస్తులు, భూములను ఏపీఐఐసీకి అప్పగించి ఫ్యాక్టరీల అప్పులను తీర్చాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించడంతో ఉద్యోగ, కార్మిక వర్గాలు, రైతుల్లో ఆందోళన నెలకొంది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో మూతపడిన షుగర్‌ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మూత పడిన తుమ్మపాల వీవీ రమణ షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి అప్పట్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ తరువాత ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి, 2023లో తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీని లిక్విడేట్‌ చేసేందుకు విఫలయత్నం చేయడం విమర్శలకు తావిచ్చింది. అప్పట్లో సహకార చక్కెర కర్మాగారాన్ని లిక్విడేట్‌ (తొలగింపు) చేయడం నిబంధనలకు విరుద్ధమని ఫ్యాక్టరీ ఉద్యోగులు, సహకార సంఘ నాయకులు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంతో ప్రక్రియ ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తుమ్మపాల, ఏటికొప్పాక, తాండవ కర్మాగారాలకు పూర్వవైభవం వస్తుందని రైతులు, ఉద్యోగులు ఆశించారు. అయితే రెండేళ్లు గడిచినా పునరుద్ధరణపై స్పష్టమైన కార్యాచరణ అమలు చేయకపోవడం వారిలో నిరాశ కలిగించింది. కాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉండడంతో మూతపడిన చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభించేందుకు భారీగా పెట్టుబడులు అవసరం కావడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. జిల్లాలో ఏటికొప్పాక, తాండవ షుగర్‌ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు రూ.4 వేల కోట్లకు పైగా నిధులు అవసరమని అంచనా వేశారు. పాత యంత్రాలు, బకాయిలు, నిర్వహణ వ్యయం, ఆధునికీకరణ వంటి అంశాలను పరిష్కరించాల్సి ఉంది. అయితే రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ రంగంలోనే లేదా సహకార విధానంలో పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

చక్కెర కర్మాగారాల చరిత్ర ఇక గతమేనా?

తాండవ సహకార చక్కెర కర్మాగారం 1983-84లో 1,250 టన్నుల చెరకు క్రషింగ్‌ సామర్థ్యంతో ప్రారంభమై 2000-01 నుంచి రోజుకు 1,600 టన్నుల క్రషింగ్‌ సామర్థ్యానికి చేరింది. ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలోని తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని 14 మండలాలకు చెందిన 11,581 మంది షేరు హోల్డర్లతో వేల మంది చెరకు రైతులకు జీవనాధారంగా, వందలాది కార్మికులకు ఉపాధి కల్పిస్తూ విశిష్ఠసేవలందించింది. అయితే ఫ్యాక్టరీలో పంచదార ఉత్పత్తికయ్యే ఖర్చు కంటే మార్కెట్‌లో పంచదార ధర తక్కువ ఉండడంతో అప్పట్లో నష్టాల్లోకి వెళ్లింది. 2018-19, 2019-20 క్రషింగ్‌ సీజన్లలో చెరకు సరఫరా చేసిన రైతులకు ఎన్‌సీడీసీ, రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సాయంతో పేమెంట్లు చేయాల్సి వచ్చింది. అప్పటి వైసీపీ ప్రభుత్వం సహకార చక్కెర కర్మాగారాలను అధ్యయనం చేసేందుకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వేసి చేతులు దులిపేసుకుందే తప్ప ఎటువంటి సాయం అందజేయలేదు. దీంతో 2020-21 క్రషింగ్‌ సీజన్‌లో ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.10.65 కోట్లు, కార్మికులకు జీతాల బకాయిలు సుమారు రూ.10 కోట్లు యాజమాన్యం చెల్లించలేని స్థితికి చేరుకుంది. 2022లో ఫ్యాక్టరీ రైతులకు ఇవ్వాల్సిన నిధులు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసి కార్మికుల జీతాల బకాయిలు చెల్లించలేదు. దీంతో తాండవ ఫ్యాక్టరీ నిర్వహణకు కూడా నిధుల్లేక 2021-22లో క్రషింగ్‌ నిలిచిపోయింది. సుమారు 300 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.

తొలి సహకార చక్కెర పరిశ్రమ ’ఏటికొప్పాక’

జిల్లాలో ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీ ఆసియా ఖండంలోనే సహకార రంగంలో ఏర్పాటైన తొలి పంచదార పరిశ్రమలలో ఒకటిగా చారిత్రక ప్రాధాన్యం కలిగి వుంది. 1932-1933 సంవత్సరంలో ఏటికొప్పాక సహకార చక్కెర కర్మాగారం ప్రారంభమైంది. తొలుత కేవలం 20 మంది సభ్యులతో మొదలై 2004 నాటికి 5,600 మంది సభ్యులతో విస్తరించింది. చెరకు క్రషింగ్‌ సామర్థ్యం పెరిగి, వార్షిక ఉత్పత్తి 2.84 లక్షల టన్నులకు చేరింది. ఆ తరువాత రైతులకు ప్రోత్సాహం లేకపోవడం, చెరకు సాగు క్రమంగా తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఉత్పత్తి పడిపోవడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులతో ఫ్యాక్టరీ మూతపడింది. కార్మికులు, రైతులకు అందాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా జిల్లాలో మూత పడిన షుగర్‌ ఫ్యాక్టరీల భూములను ఏపీఐఐసీకి అప్పగించి అప్పులు తీర్చేందుకు, ఇతర అవసరాలకు వినియోగిస్తే ప్రాంతీయంగా కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు రావచ్చన్న వాదన ఒక వైపు వినిపిస్తుండగా, ఇప్పటికే ఉన్న చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు ఉన్న అవకాశాలు పూర్తిగా మూసుకుపోతాయన్న ఆందోళన మరోవైపు వ్యక్తమవుతోంది.

Updated Date - Aug 09 , 2026 | 12:53 AM