Share News

లోతేరు-పాచిపెంట రోడ్డుకు పాతరేనా?

ABN , Publish Date - May 30 , 2026 | 11:29 PM

మండలంలోని లోతేరు నుంచి పాచిపెంట రహదారి కలగా మిగిలింది. రోడ్డు పనులు ప్రారంభమైన తర్వాత నాలుగు ప్రభుత్వాలు మారినా నేటికీ పూర్తికాలేదు. ఈ రోడ్డు పూర్తయితే మన్యం, అల్లూరి జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని గిరిజనం విమర్శిస్తోంది.

లోతేరు-పాచిపెంట రోడ్డుకు పాతరేనా?
లోతేరు-పాచిపెంట రోడ్డు ఇదే.

రోడ్డు నిర్మాణానికి 2010లో రూ.5.3 కోట్లు మంజూరు

పనులు ప్రారంభమైన తర్వాత అటవీ శాఖ కొర్రీలు

నిలిపోయిన రోడ్డు పనులు

నాలుగు ప్రభుత్వాలు మారినా.. రూపు మారలేదు..

ఈ రోడ్డు పూర్తయితే మన్యం, అల్లూరి జిల్లాల గిరిజనులకు ఎంతో మేలు

అరకులోయ, మే 30 (ఆంధ్రజ్యోతి): మన్యం, అల్లూరి జిల్లాలకు చెందిన శివారు గ్రామాలను కలుపుతూ లోతేరు-పాచిపెంట రహదారి నిర్మాణానికి 2010వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.5.3 కోట్లు మంజూరు చేసింది. ఈ రోడ్డు నిర్మాణానికి 2011 జూలై 16వ తేదీన అప్పటి కేంద్ర, పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి కిశోర్‌చంద్రదేవ్‌, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పసుపులేటి బాలరాజు శంకుస్థాపన చేశారు. లోతేరు నుంచి ఆలేరు వరకు 18 కిలోమీటర్ల మేర తారురోడ్డు నిర్మించేందుకు కాంట్రాక్టర్‌ మట్టి పనులు ప్రారంభించారు. నాలుగుచోట్ల పైపు కల్వర్టులను నిర్మించారు. ఈ పనులు జోరుగా జరుగుతున్న సమయంలో తమ అనుమతులు లేకుండా పనులు ఎలా చేపడతారని అటవీ శాఖ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అనుమతులు లేవంటూ పనులు నిలిపివేసింది. అప్పటి నుంచి నేటి వరకు పనులైతే పునఃప్రారంభం కాలేదు. అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అటవీ శాఖ అనుమతులు వచ్చాయి. అయితే రోడ్డు నిర్మాణానికి మంజూరైన నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. తర్వాత రోడ్డు నిర్మాణ అంచనా వ్యయం పెరిగిపోవడంతో పనులు నిలిచిపోయాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా లోతేరు-పాచిపెంట రహదారి గురించి ఎటువంటి కదలిక లేదు. ప్రస్తుతం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు. అంతేకాకుండా అల్లూరి జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. మంత్రి సంధ్యారాణి ప్రత్యేక దృష్టి సారిస్తే లోతేరు-పాచిపెంట రోడ్డుకు మోక్షం కలుగుతుందని గిరిజనులు, గిరిజన సంఘాలు, టీడీపీ, వైసీపీ నాయకులు అంటున్నారు. ఈ రోడ్డు పూర్తయితే సాలూరు మండలంలోని సగం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని వారంటున్నారు. మంత్రి సంధ్యారాణి దృష్టి సారించి లోతేరు-పాచిపెంట రహదారికి నిధులు మంజూరు చేస్తే మారుమూల గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం సాలూరు వెళ్లాలంటే అనంతగిరి, బోడ్డవర, విజయనగరం, గజపతినగరం మీదుగా వెళ్లాల్సి వస్తోంది. అదే లోతేరు-పాచిపెట రహదారి పూర్తయితే సగం దూరం తగ్గుతుందని వారంటున్నారు. ఇందుకోసం కూటమి నేతలు, వైసీపీ ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.

ఆర్‌అండ్‌బీపై కాంట్రాక్టర్‌ కేసు

లోతేరు-పాచిపెంట పనులు నిలిపివేయడంతో తాను తీవ్రంగా నష్టపోయానంటూ కాంట్రాక్టర్‌ రోడ్డు, భవనాల శాఖపై కాంట్రాక్టర్‌ కేసు వేశారు. అన్ని అనుమతులు తీసుకోకుండా ఆర్‌అండ్‌బీ శాఖ టెండర్లు పిలవడంతో తాను నష్టపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. కోర్టులో ఉన్న కేసును ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు పరిష్కరించుకొని, లోతేరు-పాచిపెంట రోడ్డు పనులు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - May 30 , 2026 | 11:29 PM