Share News

భోజనం బాగుంటుందా?

ABN , Publish Date - Feb 04 , 2026 | 12:59 AM

సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది.

భోజనం బాగుంటుందా?

  • తాగునీరు ఉందా?

  • టాయిలెట్స్‌ నిర్వహణ ఎలా ఉంటోంది?

  • వార్డెన్‌ అందుబాటులో ఉంటున్నారా?

  • సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలపై ప్రభుత్వం ఆరా

  • విద్యార్థుల తల్లిదండ్రులకు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌

  • ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా గత నెల రాష్ట్ర స్థాయిలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖకు రెండో స్థానం

  • బీసీ సంక్షేమ శాఖ హాస్టళ్లకు 18వ స్థానం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా హాస్టళ్లలో అందుతున్న సేవల గురించి విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చే ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా వసతి గృహాలను మెరుగుపరచాలని భావిస్తోంది. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌లో ప్రధానంగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా?, భోజనంలో నాణ్యత ఉంటుందా?, వార్డెన్‌ అందుబాటులో ఉంటున్నారా?, తాగునీరు ఉందా?, టాయిలెట్స్‌ ఉన్నాయా?, శానిటేషన్‌ ఎలా ఉందన్న ప్రశ్నలను అడుగుతున్నారు. గత నెలలో ఇదే తరహాలో ఫోన్లు రాగా, ఈ నెలలోనూ మళ్లీ ప్రారంభమైనట్టు పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు చెబుతున్నారు.

మార్కుల కేటాయింపు

ఆయా ప్రశ్నలకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చే సమాధానాలు (సంతృప్తి)ను బట్టి ప్రభుత్వం మార్కులను కేటాయిస్తోంది. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖకు 23 హాస్టల్స్‌ ఉండగా, సుమారు రెండు వేల మంది విద్యార్థులు ఉన్నారు. బీసీ సంక్షేమ శాఖకు 28 హాస్టళ్లు ఉండగా, మూడు వేల మంది విద్యార్థులు ఉంటున్నారు. జనవరిలో వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ రెండో స్థానంలో నిలిచింది. ఐవీఆర్‌ఎస్‌లో అడిగిన ప్రశ్నలకు విద్యార్థుల తల్లిదండ్రులు 80 శాతం మేర సంతృప్తిని వ్యక్తంచేయడంతో మెరుగైన స్థానాన్ని దక్కించుకుంది. ఇక, బీసీ సంక్షేమ శాఖ హాస్టళ్లలో తాగునీటి ఇబ్బందులు, శానిటేషన్‌పై విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తిని వ్యక్తం చేయడంతో 75 శాతం సంతృప్తి స్థాయితో రాష్ట్ర స్థాయిలో జిల్లా 18వ స్థానంలో నిలిచింది. దీంతో ఉన్నతాధికారులు పరిస్థితులను మెరుగుపరుచుకోవాలని అధికారులకు సూచించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి దీనికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణను ఆమె ప్రారంభించారు. వాటర్‌ ఫిల్టర్స్‌ను మార్చడంతోపాటు శానిటేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇదిలావుంటే సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో పరిస్థితుల పట్ల తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేయడంపై సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కె.రామారావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మిగిలిన 20 శాతం సంతృప్తిని పొందేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించినట్టు తెలిపారు.

నిరంతర ప్రక్రియ..

వసతి గృహాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఈ ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిరంతర కొనసాగుతుందని తెలుస్తోంది. జనవరిలో సర్వే పూర్తి కాగా, ఫిబ్రవరి నెలకు సంబంధించిన సర్వే మళ్లీ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు వచ్చినట్టు చెబుతున్నారు. దీంతో హాస్టల్‌ వార్డెన్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. విద్యార్థులకు హాస్టల్‌ వార్డెన్లు అందుబాటులో ఉండాలని అధికారులు సూచించారు. విద్యార్థులు తల్లిదండ్రులు చెబుతున్న సమస్యలతో ప్రధానమైనది వార్డెన్లు అందుబాటులో ఉండడం లేదు. దీనిపై జిల్లా అధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలిసింది.

Updated Date - Feb 04 , 2026 | 12:59 AM