Share News

ముగిసిన మావోయిస్టుల శకం?

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:30 AM

దేశంలో మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ గడువు ఈ నెల 31తో ముగియనుండగా, అనుకున్న మేర లక్ష్యాన్ని చేరుకుంది.

ముగిసిన మావోయిస్టుల శకం?
లొంగిపోయిన మావోయిస్టులతో ఎస్పీ అమిత్‌బర్దార్‌ (ఫైల్‌ ఫొటో)

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌తో ఏరివేత

నేటితో ముగియనున్న గడువు

ఏవోబీ కేంద్రంగా ఎగసి‘పడిన విప్లవ ఉద్యమం’

ఎదురుకాల్పులు, లొంగుబాట్లతో కనుమరుగు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

దేశంలో మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ గడువు ఈ నెల 31తో ముగియనుండగా, అనుకున్న మేర లక్ష్యాన్ని చేరుకుంది. ఎదురుకాల్పుల్లో చాలా మంది మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందగా, మరికొందరు క్యాడర్‌తో సహా లొంగిపోయారు. దీంతో సుమారు ఆరు దశాబ్దాలుగా సాగిన విప్లవ పోరు దాదాపు ముగిసింది. దేశంలో మావోయిస్టుల చరిత్రలో ఆంధ్ర, ఒడిశా సరిహద్దుకు ప్రత్యేక స్థానం ఉంది. భౌగోళికంగా ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, తమను ఆదరించే గిరిజనులున్న ప్రాంతం కావడంతో మావోయిస్టులకు ఏవోబీ అడ్డాగా ఉండేది. అందుకే ఇక్కడ నుంచే కార్యకలాపాలు నిర్వహించేవారు.

ఏవోబీ కేంద్రంగా ఎగసి‘పడిన ఉద్యమం’

దేశంలో ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఒడిశా, ఆంధ్రా, తెలంగాణ వంటి ఆరు రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండేది. దీంతో దీనిని రెడ్‌ కారిడార్‌గా అటు మావోయిస్టులు, ఇటు పోలీసులు పేర్కొనేవారు. ఈ క్రమంలో దట్టమైన, క్లిష్టమైన అటవీ ప్రాంతమున్న ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి, కొరాపుట్‌ జిల్లాల్లో మావోయిస్టు ప్రభావం అధికంగా ఉండడం, రెండు జిల్లాలకు సరిహద్దున ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలుండడంతో ఈ నాలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు ముమ్మరంగా సాగాయి. దీంతో చత్తీస్‌గఢ్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న మావోయిస్టు పార్టీ ఆంధ్ర, ఒడిశా సరిహద్దు, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో స్పెషల్‌ జోనల్‌ కమిటీలను ఏర్పాటు చేసి తమ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు స్పెషల్‌ జోనల్‌ కమిటీని ఏర్పాటు చేసి ఇరు రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న అటవీ ప్రాంతం (కటాఫ్‌ ఏరియా)వేదికగా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో మావోయిస్టులు తమ కార్యకలాపాలను ఉధృతం చేశారు. దీంతో దేశంలో ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ ప్రాంతానికి ఒక ప్రత్యేకత లభించింది. అలాగే అక్కడ మావోయిస్టులున్నారనే సమాచారం తెలిసినప్పటికీ, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో పోలీసు సాయుధ బలగాలు అక్కడికి చేరుకోలేని పరిస్థితి ఉండేది. దీంతో ఏవోబీలో మావోయిస్టులదే పైచేయిగా ఉండేది. 2008లో ఏవోబీలో మావోయిస్టుల ఏరివేతలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రేహౌండ్స్‌ బలగాలు ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతం నుంచి ఒడిశాలో గాలింపులు చేపట్టి తిరిగి స్లీమర్‌పై వస్తున్న క్రమంలో మావోయిస్టులు జరిపిన దాడిలో 38 మంది గ్రేహౌండ్స్‌ పోలీసులు హతమయ్యారు. ఇదే క్రమంలో పోలీసుల సాయుధ బలగాల గాలింపులు తగ్గుముఖం పట్టాయి. ఇదే అదనుగా మావోయిస్టులు తమ కార్యకాలపాలను మరింత ఉధృతం చేశారు.

2009లో ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌తో పతనం మొదలు

ఏవోబీలో మావోయిస్టుల కార్యకాలాపాలు ఉధృతంగా ఉండడంతో పాటు ఏవోబీలో స్పెషల్‌ జోనల్‌ కమిటీ కేంద్రంగా ఒడిశా, ఆంధ్రాలో డివిజన్‌, ఏరియా కమిటీలు, వాటి కింద లోకల్‌ గెరిల్లా స్క్వాడ్‌ పేరిట స్థానిక దళాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఛత్తీస్‌గఢ్‌ వైపు చూసేందుకు, ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో అడుగు పెట్టేందుకు సైతం పోలీసులు భయపడే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ను ప్రారంభించి, మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల మధ్య సయోధ్య, సమన్వయం చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల సాయుధ పోలీసు బలగాలు జాయింట్‌ ఆపరేషన్‌లకు శ్రీకారం చుట్టారు. దీంతో ఛత్తీస్‌గఢ్‌ మొదలుకొని ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో సైతం మావోయిస్టుల ఏరివేతకు గ్రీన్‌ హంట్‌లో భాగంగా జాయింట్‌ ఆపరేషన్‌లు కొనసాగించారు. ఈ నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో ఎన్‌కౌంటర్లు, లోంగుబాట్లు ఉధృతమయ్యాయి. క్రమంగా మావోయిస్టు కార్యకలాపాలపై పోలీసు బలగాలు పట్టు సాధించాయి. దీంతో మావోయిస్టులకు కంచుకోటగా ఉండే ఏవోబీ కటాఫ్‌ ఏరియాపై దృష్టి సారించారు. మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలో రామ్‌గుడలో అధిక సంఖ్యలో మావోయిస్టులున్నారని సమాచారం అందుకున్న పోలీసులు, 2016 అక్టోబరు 23న ఉదయం జరిపిన కాల్పుల్లో నాలుగు రాష్ట్రాలకు చెందిన 31 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అది మొదలు క్రమంగా ఏవోబీలో మావోయిస్టుల ఉనికి క్షీణించింది. అయినప్పటికీ 2018 సెప్టెంబరు 23న డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద అప్పటి అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను పట్టపగలు కాల్చి హతమార్చారు. దీంతో పోలీసులు ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ను మరింత సీరియస్‌గా తీసుకుని ఏవోబీలో ఏరివేతను వేగవంతం చేశారు. 2024 నాటికే ఏపీలో అరకొరగా మావోయిస్టులుండగా సరిహద్దున ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఇక్కడికి రాకపోకలు సాగిస్తుండేవారు.

‘ఆపరేషన్‌ కగార్‌’తో పూర్తిగా కనుమరుగు

మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో బలంగా, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో అరకొరగా ఉండే పరిస్థితిని ఆపరేషన్‌ కగార్‌ పూర్తిగా కనుమరుగు చేసింది. 2025లో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ పేరిట మావోయిస్టుల ఏరివేతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీంతో 2026 మార్చి నెలాఖరుకు మావోయిస్టులుండకూడదనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏరివేతను మరింత వేగవంతం చేసింది. మావోయిస్టులకు కేంద్ర బిందువుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌పై ఫోకస్‌ పెట్టి భారీ స్థాయిలో సాయుధ బలగాలతో గాలింపులు, కాల్పులతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, రవాణా వ్యవస్థలను మెరుగుపరిచింది. అలాగే ఆయా ప్రాంతాల్లో అధిక సంఖ్యలో సెల్‌ టవర్ల నిర్మాణం చేపట్టి మారుమూల పల్లెల్లో సైతం సెల్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో అత్యంత మారుమూల ప్రాంతాల్లోని మావోయిస్టుల కదలికలు సైతం క్షణాల్లో సాయుధ పోలీసు బలంగాలకు సమాచారం అందేలా హ్యూమన్‌ ఇంటెలిజెన్స్‌ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పోలీసుల కనుసన్నల నుంచి తప్పించుకోలేని దుస్థితిలో మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌ కావడం లేదా లొంగిపోవడం మినహా మరో దారి కనిపించని పరిస్థితిని పాలకులు కల్పించారు. ఆపరేషన్‌ కగార్‌ ఫలితంగా ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు పూర్తిగా కనుమరుగయ్యారు.

Updated Date - Mar 31 , 2026 | 12:30 AM