Share News

రాచపల్లిలోనే బ్లాక్‌స్టోన్‌ కంపెనీ?

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:54 AM

మండలంలోని రాచపల్లి రెవెన్యూ 737 సర్వే నంబరులో ఉన్న భూముల్లోనే బ్లాక్‌స్టోన్‌ కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీఐఐసీ అధికారులు చెబుతున్నారు. దీని కోసం మరో 200 ఎకరాల భూ సేకరణ చేస్తున్నట్టు ఇక్కడ ప్రచారం జరుగుతోంది.

రాచపల్లిలోనే బ్లాక్‌స్టోన్‌ కంపెనీ?
రాచపల్లి 737 సర్వే నంబరులో ఉన్న భూములు

- మరో 200 ఎకరాల భూ సేకరణకు రంగం సిద్ధం

మాకవరపాలెం, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రాచపల్లి రెవెన్యూ 737 సర్వే నంబరులో ఉన్న భూముల్లోనే బ్లాక్‌స్టోన్‌ కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీఐఐసీ అధికారులు చెబుతున్నారు. దీని కోసం మరో 200 ఎకరాల భూ సేకరణ చేస్తున్నట్టు ఇక్కడ ప్రచారం జరుగుతోంది.

మండలంలోని రాచపల్లి 737 సర్వే నంబరులో పరిశ్రమల ఏర్పాటు కోసం ఎరకన్నపాలెం, చినరాచపల్లి, వెంకయ్యపాలెం, రామన్నపాలెం గ్రామాలకు చెందిన 406 ఎకరాల ప్రభుత్వ కొండపోరంబోకు భూమిని ప్రభుత్వం తీసుకుంది. ఈ భూమిలో 150 ఎకరాలను డోజ్కో కంపెనీ తీసుకుంది. ఈ భూమికి పరిహారం కూడా ఏపీఐఐసీ అధికారులకు చెల్లించింది. అయితే పైడిపాల, పెద్దిపాలెం, పాపయ్యపాలెం, బూరుగుపాలెం గ్రామాల్లో ల్యాండ్‌ బ్యాంకు కింద ప్రభుత్వం 4,250 ఎకరాల భూమిని గుర్తించింది. ఈ భూమిని మే 19వ తేదీన బ్లాక్‌స్టోన్‌ కంపెనీ ప్రతినిధులు పరిశీలించారు. అక్కడ ఉన్న భూమికి సాగునీటి వనరులతో పాటు రహదారి దూరం కావడంతో రాచపల్లి 737 సర్వే నంబరులో 450 ఎకరాల భూమి కావాలని ఏపీఐఐసీ అధికారులను కోరారు. దీంతో 737లో మిగులు ఉన్న 250 ఎకరాల భూమితో పాటు మరో 200 ఎకరాల భూ సేకరణ చేసి బ్లాక్‌స్టోన్‌ కంపెనీకి ఇచ్చేందుకు ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రోడ్డు మ్యాప్‌ కూడా మార్చివేశారు. ప్రసుత్తం 100 అడుగుల రోడ్డు నిర్మాణం కోసం ఇప్పటికే 85 ఎకరాల భూమికి సర్వే పూర్తిచేశారు. మరో 200 ఎకరాల భూ సేకరణ కోసం రెండు రోజుల క్రితం జిల్లా సర్వే అధికారులు వచ్చి వెళ్లారు. కాగా 737 సర్వే నంబరులో డోజ్కో కంపెనీకి 150 ఎకరాలు, బ్లాక్‌స్టోన్‌ కంపెనీకి 450 ఎకరాలు ఇచ్చేందుకు ఏపీఐఐసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో జిరాయితీ, డీపట్టా భూములతో పాటు కొండపోరంబోకు భూమిని గుట్టుగా రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు.

Updated Date - Jun 14 , 2026 | 12:54 AM