మనుగడ ప్రశ్నార్థకం?
ABN , Publish Date - Apr 20 , 2026 | 01:15 AM
జిల్లా పరిషత్, మునిసిపల్ ఉన్నత పాఠశాలల్లో అందిస్తున్న హైస్కూలు ప్లస్ (ఇంటర్మీడియట్) కోర్సుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.
హైస్కూలు ప్లస్ ఇంటర్‌లో పేలవమైన ఫలితాలు
29.39 శాతమే ఉత్తీర్ణత
మొత్తం విద్యార్థులు : 364, పాసైన వారు 107 మంది
వచ్చే విద్యాసంవత్సరంలో రెండు చోట్ల కోర్సుల ఎత్తివేత
విశాఖపట్నం, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి):
జిల్లా పరిషత్, మునిసిపల్ ఉన్నత పాఠశాలల్లో అందిస్తున్న హైస్కూలు ప్లస్ (ఇంటర్మీడియట్) కోర్సుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. మూడేళ్ల క్రితం ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ కోర్సులు ప్రారంభం నుంచే పేలవమైన పనితీరు కనబరుస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మొత్తం 364మంది విద్యార్థులకు 107 మంది (29.39 శాతం) మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ ఏడాదిలో 185 మందికి 51మంది (27.56శాతం), ద్వితీయ ఏడాదిలో 179మందికి 56 మంది (31.28 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
జిల్లాలోని గాజువాక, గోపాలపట్నం, రాంపురం, గంగవరం, మల్కాపురం, రెడ్డిపల్లి ఉన్నత పాఠశాలల్లో హైస్కూలు ప్లస్ సెక్షన్‌లలో ఇంటర్ తరగతులు బోధిస్తున్నారు. విద్యార్థులు చేరకపోవడంతో మల్కాపురం, రెడ్డిపల్లిలో కేవలం ద్వితీయ ఏడాది తరగతులు నిర్వహించారు. గాజువాక, గోపాలపట్నం, సీతమ్మధారలోని టీపీటీ కాలనీలో రెండెంకల సంఖ్యలో విద్యార్థులుండగా గంగవరం, రాంపురం, మల్కాపురం, రెడ్డిపల్లిలో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యీరు. మల్కాపురంలో ఒక పీజీటీ ఉండగా మిగిలిన చోట్ల ఐదు నుంచి ఆరుగురు పీజీటీలు పనిచేస్తున్నారు. గత ఏడాది 17.5 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది మరో 12శాతం పెరిగిందని చెప్పుకుంటున్నప్పటికీ ఎక్కువ మంది ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రథమ ఏడాది ఏంపీసీలో గాజువాక నుంచి 26మందికి ఎనిమిది, సీతమ్మధార టీపీటీకాలనీలో పది మందికి ఐదుగురు, గోపాలపట్నంలో 39మందికి 13మంది, గంగవరంలో ఇద్దరికి ఒక్కరు, రాంపురంలో ఒకే ఒక్కరు, బైపీసీలో గాజువాకలో 39కి 11మంది, టీపీటీ కాలనీలో 10కి ఒక్కరు, గోపాలపట్నంలో 42కి ఎనిమిది, గంగవరంలో 13కి ముగ్గురు ఉత్తీర్ణ సాధించగా రాంపురంలో ముగ్గురికి ఒక్కరు కూడా పాస్‌కాలేదు.
ద్వితీయ ఏడాది ఎంపీసీలో గాజువాకలో 20కి ఐదుగురు, టీపీటీకాలనీలో 16కి 13 మంది, గోపాలపట్నంలో 21కి ఐదుగురు, గంగవరంలో ఐదుగురికి ఇద్దరు, రాంపురంలో ఇద్దరికి ఒక్కరు, రెడ్డిపల్లిలో ఆరుగురికి ఒక్కరు ఉత్తర్ణత సాధించగా మల్కాపురంలో పరీక్ష రాసిన ఎనిమిదిమంది ఫెయిల్ అయ్యారు. బైపీసీ కోర్సులో గాజువాకలో 23 మందికి నలుగురు, టీపీటీ కాలనీలో 14మందికి ఎనిమిది, గోపాలపట్నంలో 16కి ఆరుగురు, గంగవరంలో 21మందికి ఆరుగురు, రాంపురంలో ముగ్గురికి ఇద్దరు ఉత్తీర్ణత సాధించగా మల్కాపురంలో ఆరుగురూ ఫెయిల్ అయ్యారు. ద్వితీయ ఏడాది సీఈసీలో రెడ్డిపల్లిలో 18మందికి ముగ్గురు పాసయ్యారు. ఈ రెండు చోట్ల గత ఏడాది ప్రవేశాలు కల్పించలేదు. వచ్చే విద్యాసంవత్సరానికి కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మల్కాపురంలో ద్వితీయ ఏడాది ఎంపీపీ, బైపీసీ కోర్సుల్లో 14మందికి ఒక్కరు కూడా ఉత్తీర్ణత కాలేదు. కెమిస్ట్రీ తప్ప మిగిలిన సబ్జెక్టులలో పీజీటీలు లేకపోవడం, నిర్వాహకులు చొరవ తీసుకోకపోవడంతో తరగతులు నిర్వహణ సరిగా జరగలేదు. హైస్కూలు ప్లస్ ప్రారంభం నుంచి అక్కడ తరగతుల నిర్వహణ ఆశాజనకంగా లేదు. బాలికల్లో డ్రాపౌట్స్ రేటు తగ్గించడానికి నగరంలో హైస్కూలు ప్లస్ ప్రారంభించామని విద్యాశాఖ చెబుతున్నా.. సీనియర్ స్కూలు అసిస్టెంట్లకు పునరావాస కేంద్రాలుగా మారాయన్న ఆరోపణలున్నాయి. విద్యాశాఖ కూడా వీటిపై దృష్టి సారించలేదనే విమర్శలున్నాయి.
కాగా సింగిల్ డిజిట్ విద్యార్థులున్నచోట కోర్సులు ఎత్తివేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. హైస్కూలు ప్లస్‌లో ఫలితాలపై డీఈవో ఎన్.ప్రేమకుమార్ వద్ద ప్రస్తావించగా అక్కడ పనిచేసే పీజీటీలతో సమీక్షిస్తానన్నారు. ఫలితాలు తక్కువగా రావడానికి కారణాలపై షోకాజ్ నోటీసులు జారీచేస్తానన్నారు.