Share News

వేసవిలో బడి భద్రమేనా?

ABN , Publish Date - May 02 , 2026 | 11:39 PM

వేసవి సెలవుల నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. తిరిగి వచ్చే నెల 12న అవి తెరుచుకోనున్నాయి.

వేసవిలో బడి భద్రమేనా?
వాచ్‌మన్‌ లేని అనకాపల్లి మండలంలోని మారేడుపూడి ఎంపీపీ పాఠశాల

జిల్లాలో 1,446 ప్రభుత్వ పాఠశాలలు

కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ఆధునిక వసతులు

కేవలం 278 స్కూళ్లకే నైట్‌ వాచ్‌మన్లు

మిగతా బడుల్లోని ఆస్తుల రక్షణ ప్రశ్నార్థకం

అనకాపల్లి రూరల్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవుల నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. తిరిగి వచ్చే నెల 12న అవి తెరుచుకోనున్నాయి. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా సర్కారు బడుల్లో ఆధునిక వసతులు కల్పించిన క్రమంలో వీటి భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే జిల్లాలో 1,446 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, కేవలం 278 స్కూళ్లకు మాత్రమే నైట్‌ వాచ్‌మన్లు ఉన్నారు. దీంతో మిగతా పాఠశాలల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

జిల్లాలో 1,046 ప్రాథమిక, 122 ప్రాథమికోన్నత, 278 జిల్లా పరిషత్‌ పాఠశాలలతో కలిపి మొత్తం 1,446 ఉన్నాయి. ఇందులో 278 పాఠశాలలకు మాత్రమే నైట్‌ వాచ్‌మన్లు ఉన్నారు. మిగిలిన 1,168 పాఠశాలలకు వాచ్‌మన్లు లేరు. నైట్‌ వాచ్‌మన్లు ఉన్న సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు పాఠశాలల వద్ద కాపలా కాస్తారు. పాఠశాలల్లోని ఆస్తులకు రక్షణగా ఉంటారు.

విలువైన ఆస్తులెన్నో..

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌/ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో నాడు- నేడు, మన బడి- మన భవిష్యత్తు పేరిట ప్రభుత్వాలు బ్రిటన్‌ గ్రాంట్లు, సాల్ట్‌ స్కీం, సీఎస్‌ఆర్‌ నిధులతో ఆధునిక హంగులతో తీర్చిదిద్దాయి. ఈ క్రమంలో తరగతి గదికి 4 సీలింగ్‌ ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, విద్యార్థుల సంఖ్యకు సరిపడా డ్యూయల్‌ డెస్క్‌లు అమర్చాయి. వీటితో పాటు డిజిటల్‌ విధానంలో పాఠ్యాంశాల భోధనకు అత్యాధునిక ఐఎఫ్‌పీ(ఇంక్రాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌)లు హైస్కూళ్లలో తరగతి గది/సెక్షన్‌కు ఒకటి చొప్పున, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక స్మార్ట్‌ టీవీ వంతున అందజేశారు. ఇవిగాక శుద్ధి చేసిన తాగునీటిని విద్యార్థులకు సరఫరా చేసేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆర్వో ప్లాంట్లను అమర్చారు. ప్రతి హైస్కూలు, ప్రాథమికోన్నత పాఠశాలలో విలువైన కంప్యూటర్లతో కూడిన ల్యాబ్‌లున్నాయి. వీటితోపాటు విద్యా సంబంధిత విలువైన రికార్డులు ఎలాగూ ఉంటాయి. సాధారణంగా స్కూల్‌ పనిదినాల్లో పాఠశాల ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలు, మద్యపానం, పేకాటరాయుళ్లతో పాటు ఆకతాయిలు స్కూలు ఆస్తులను ధ్వంసం చేస్తుండడంపై పలువురు హెచ్‌ఎంలు ఫిర్యాదుల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల భద్రత పరిస్థితి ఏమిటన్న సందేహం వ్యక్తమవుతున్నది. దీనిపై డీఈవో అప్పారావునాయుడు వివరణ కోరగా, ప్రభుత్వం హైస్కూళ్లకు మాత్రమే నైట్‌ వాచ్‌మన్లను నియమించిందని, మిగతా పాఠశాలల్లో భద్రతా బాధ్యతలను స్కూల్‌ హెచ్‌ఎంలే స్వచ్ఛందంగా తీసుకోవాలన్నారు. ఇందుకు స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ, పేరెంట్స్‌ కమిటీల సహకారాన్ని కోరాలన్నారు. మన బడి- మన ఆస్తి అనే భావన అందరిలో ఉండాలని ఆయన కోరారు.

Updated Date - May 02 , 2026 | 11:39 PM