రైల్వే నీరు సురక్షితమేనా?
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:43 AM
రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు అందిస్తున్నతాగునీరు పరిశుభ్రంగా లేదని, అందులో ఈ-కోలి బాక్టీరియా ఉందని పది రోజుల క్రితం కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) నివేదించడంతో రైల్వే మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది.
ప్రయాణికులకు అందిస్తున్న నీటిలో ఈ-కోలి బాక్టీరియా ఉన్నట్టు ‘కాగ్’ వెల్లడించడంతో మంత్రిత్వ శాఖ అప్రమత్తం
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో పది రోజులుగా తనిఖీలు
లోపాలు గుర్తించి, సవరించడానికి కార్యాచరణ ప్రణాళిక
గత ఆరు నెలల నిర్వహణపై సంబంధిత అధికారులతో జీఎం సమీక్ష
ఇకపై ప్రతి 15 రోజులకొకసారి సమీక్షిస్తానని వెల్లడి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు అందిస్తున్నతాగునీరు పరిశుభ్రంగా లేదని, అందులో ఈ-కోలి బాక్టీరియా ఉందని పది రోజుల క్రితం కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) నివేదించడంతో రైల్వే మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. హైదరాబాద్, ముంబై వంటి రద్దీ కలిగిన స్టేషన్లలో కూడా ఇదే రకమైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొనడంతో తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. దీంతో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో గత పది రోజులుగా రైల్వే స్టేషన్లు, క్వార్టర్లు, నీటి సరఫరా వ్యవస్థలన్నింటినీ తనిఖీ చేస్తున్నారు. ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి, సవరించడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు.
విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే దక్షిణ కోస్తా రైల్వేజోన్‌లో నాలుగు డివిజన్లు, వాటి పరిధిలో 385 స్టేషన్లు ఉన్నాయి. రైల్వే ఉద్యోగులకు ఎక్కడికక్కడ క్వార్టర్లు, వాటికి నీటిని అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. జోన్‌లో మొత్తం ఆరు వేల ట్యాంకుల ద్వారా రోజుకు 485 లక్షల గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నారు. జోన్ పరిధిలో ఉన్న గోదావరి, కృష్ణా వంటి నదులతో పాటు భూగర్భ జలాలను కూడా ఇందుకు ఉపయోగించుకుంటున్నారు. వీటి ద్వారా సరఫరా అయ్యే తాగునీరు పరిశుభ్రంగా ఉందని నిర్ధారించడానికి హెల్త్ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు స్థాయిల వారీగా ఉన్నారు. నీటి ట్యాంకులు, సరఫరా చేసే కూలర్లు, ఆర్‌ఓ ప్లాంట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడానికి నిర్ణీత సమయాలు కూడా ఉన్నాయి. ఆయా అధికారులు గత ఆరు నెలలుగా నిర్వహించిన సమీక్షలు, చేపట్టిన తనిఖీలు, తీసుకున్న చర్యలను దక్షిణ కోస్తా జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ సమీక్షించారు. గుర్తించిన లోపాలు, చేపట్టాల్సిన చర్యలపై నాలుగు డివిజన్ల మేనేజర్లతో చర్చించారు. ఇకపై ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తానే సమీక్షిస్తానని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈసారి నిర్వహించే ఆకస్మిక తనిఖీలలో తాగునీటి వనరుల పరిశీలన కూడా ఉందని, ఇది స్టేషన్ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు కొనసాగాలని స్పష్టంచేశారు. సరఫరా చేస్తున్న తాగునీరు ప్రమాణాలకు అనుగుణంగా ఉందా?, లేదా?, ఆయా పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా?, లేదా?...అనేది పరిశీలించాలన్నారు. అదే విధంగా ప్రతి స్టేషన్, క్వార్టర్ నుంచి నిర్ణీత సమయాల్లో తాగునీటిని సేకరించి లేబొరేటరీలకు పంపించి పరీక్షలు చేయించాలని, ఆయా నివేదికలు జోనల్ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. ఆయనే స్వయంగా కొన్ని స్టేషన్లలో తనిఖీలు కూడా నిర్వహించారు.
విశాఖ స్టేషన్‌లో జనరల్ బోగీలకు పరిమితం
విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు ఉచితంగా అందిస్తున్న తాగునీటిని జనరల్ బోగీలలో ప్రయాణించేవారు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. స్లీపర్ క్లాసులో వెళ్లేవారు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆర్‌ఓ కౌంటర్లలో వాటర్ బాటిళ్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ రెండు చోట్ల లభించే నీరు ఒకేలా లేకపోవడం గమనార్హం. ప్లాట్‌ఫారాలపై ఉన్న కొళాయిల ద్వారా వస్తున్న నీరు కొంచెం పసుపు రంగులో ఉండడం గమనార్హం.