వరి సాగు కష్టమేనా?
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:47 AM
ఖరీఫ్ సీజన్‌లో వరినాట్లు వేసే దశ అత్యంత కీలకం. ఏటా ప్రస్తుత సమయానికి జిల్లాలో జోరుగా దమ్ము, వరినాట్లు పనులు జరుగుతుంటాయి. ఆగస్టు మొదటి వారంనాటికి దాదాపు సగం విస్తీర్ణంలో వరినాట్లు పూర్తవుతాయి. కానీ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో గత రెండు నెలల్లో సాధారణ వర్షపాతంలో సగం కూడా కురవలేదు. ఇంతవరకు వరినాట్లు ఒక్క శాతానికి కూడా మించలేదు.
జిల్లాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు
జూన్ నుంచి ఇంతవరకు సాధారణ వర్షపాతం 324.9 మి.మీ.
ఈ ఏడాది కురిసింది 189.5 మి.మీ.
41.7 శాతం లోటు
నీరు లేక మడుల్లో ఎండిపోతున్న వరినారు
బీడును తలపిస్తున్న పొలాలు
లక్ష్యంలో ఒక్క శాతం విస్తీర్ణంలో కూడా పూర్తికాని వరినాట్లు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
ఖరీఫ్ సీజన్‌లో వరినాట్లు వేసే దశ అత్యంత కీలకం. ఏటా ప్రస్తుత సమయానికి జిల్లాలో జోరుగా దమ్ము, వరినాట్లు పనులు జరుగుతుంటాయి. ఆగస్టు మొదటి వారంనాటికి దాదాపు సగం విస్తీర్ణంలో వరినాట్లు పూర్తవుతాయి. కానీ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో గత రెండు నెలల్లో సాధారణ వర్షపాతంలో సగం కూడా కురవలేదు. ఇంతవరకు వరినాట్లు ఒక్క శాతానికి కూడా మించలేదు.
జిల్లాలో నెలకొన్ని తీవ్రవర్షాభావ పరిస్థితులు అన్నదాతలను.. ముఖ్యంగా వరి సాగు చేసే రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. జూన్, జూలై నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయ పనులు మందగించాయి. అడపాదడపా కురుస్తున్న జల్లులతో కొంతమంది రైతులు ఆకుమడులను సిద్ధం చేసుకొని వరి విత్తనాలు చల్లారు. అవి మొలకెత్తినప్పటికీ సరిపడ నీరు (వర్షం) లేకపోవడంతో ఎదుగుదల లేక మొక్కలు ఎండిపోతున్నాయి. మరోవైపు పొలాల్లో కనీసం దుక్కులు కూడా దున్నలేదు. జిల్లాలో జూన్ ఒకటినుంచి ఆగస్టు 7వ తేదీ వరకు సాధారణ వర్షపాతం 324.9 మి.మీ. నమోదు కావాల్సి ఉండగా, 189.5 మి.మీ. మాత్రమే కురిసింది. దీంతో 41.7 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌లో 123.2 మి.మీ.లకుగాను 97.5 మి.మీ. (20.9 శాతం) మాత్రమే కురిసింది. జూలైలో పరిస్థితి అత్యంతగా దారుణంగా వుంది. సాధారణ వర్షపాతం 175.9. మి.మీ.కాగా 45.4 మి.మీ. (74.2 శాతం లోటు) మాత్రమే కురిసింది. ఈ నెల మొదటి నుంచి ఒకింత ఆశాజనకంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ.. చెరువుల్లో నీరు చేరే పరిస్థితి లేదు. అంతేకాక వరినాట్లు కోసం పొలాలను దమ్ము చేయడానికి అవసరమైన మేర వర్షాలు పడడంలేదు.
జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 56,329 హెక్టార్లలో వరి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తీవ్రవర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు 336 హెక్టార్లలో మాత్రమే వరినాట్లు వేశారు. ఇవి కూడా కాలువలు, బోర్లు వున్న ప్రాంతాల్లో మాత్రమే వేశారు. అనకాపల్లి, కశింకోట, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల మండలాల్లో వరి నారుమళ్లుకు సైతం నీరు అందుబాటులో లేదు.
వర్షంతో చిగురించిన ఆశలు
జిల్లాలో గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం ఉదయం వరకు 20.6 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పరవాడ మండలంలో 78.2 మి.మీ. వర్షం కురిసింది. కె.కోటపాడులో 69.8 మి.మీ., సబ్బవరంలో 62.6, రోలుగుంటలో 44.6, మునగపాకలో 40.8, అచ్యుతాపురం 32.6 మి.మీ. వర్షం కురిసింది. కశింకోట, దేవరాపల్లి, చీడికాడ, చోడవరం, అనకాపల్లి, రావికమతం, మాడుగుల, ఎలమంచిలి మండలాల్లో మోస్తరు వాన, నాతవరం, రాంబిల్లి బుచ్చెయ్యపేట, ఎస్.రాయవరం, నర్సీపట్నం, మాకవరపాలెం, గొలుగొండ మండలాల్లో చిరు జల్లులు పడ్డాయి. అయితే శుక్రవారం ఉదయం తరువాత వర్షం కురిసిన దాఖలాలు లేవు.
ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన
జిల్లా వ్యవసాయాధికారి ఎం.ఆశాదేవి
అనకాపల్లి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహస్తున్నట్టు జిల్లా వ్యవసాయాధికారి ఎం.ఆశాదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని వ్యవసాయ డివిజన్‌లలో ఎల్‌నినో ప్రభావ ఉపశమన కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. మండల వ్యవసాయాధికారులు, ఆర్‌ఎస్‌కే సహాయకులు గ్రామాల్లో సభలు నిర్వహించి వాతావరణంలో మార్పులు, నీటి నిర్వహణ, తక్కువ నీటితో పంటల సాగు, తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. వీరితోపాటు నీటి సంఘాల సభ్యులు, వీఏవోలు, వీఆర్వోలు బృందాలుగా ఏర్పడి కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకునే, తక్కువ నీటితో పండే పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తారని ఆమె వెల్లడించారు.