Share News

...ఇంత ఘోరమా!?

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:34 AM

తాగునీటి సరఫరా విషయంలో జీవీఎంసీ అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

...ఇంత ఘోరమా!?

డ్రైనేజీలో మంచినీటి పైప్‌లైన్‌

ప్రజల ప్రాణాలతో జీవీఎంసీ చెలగాటం

ఎండాడ నుంచి కొమ్మాది వరకూ మురుగునీటిలోనే...

ఏమాత్రం చిన్న రంధ్రం పడినా తాగునీటిలో మురుగునీరు కలిసే ప్రమాదం

దాదాపు మూడు లక్షల మందికి ముప్పు

శ్రీకాకుళం ఉదంతం నేపథ్యంలోనైనా మేల్కొనని అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

తాగునీటి సరఫరా విషయంలో జీవీఎంసీ అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మురుగునీటి కాలువ లోపల నుంచి తాగునీటి పైప్‌లైన్లు వేస్తున్నారు. ఆ పైప్‌లైన్‌కు ఏమాత్రం లీకేజీ ఏర్పడినా మురుగునీరు కలిసి లక్షలాది మంది అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. అయినప్పటికీ అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు.

ఎండాడ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి మధురవాడ, పీఎం పాలెం, కొమ్మాది, బొట్టవానిపాలెం, సాయిరాం కాలనీ, తిమ్మాపురం, రుషికొండ, ఐటీ హిల్స్‌, సాయిరాం కాలనీ వంటి ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతుంది. ఇందుకోసం జీవీఎంసీ అధికారులు రిజర్వాయర్‌ నుంచి జాతీయ రహదారిని ఆనుకుని కొమ్మాది వరకు పైప్‌లైన్‌ నిర్మించారు. ఈ పైప్‌లైన్‌ మురుగనీటి కాల్వలో ఉంది.

జాతీయ రహదారి నిర్మాణ సమయంలో రోడ్డుకు ఒకవైపున రెండు డెక్ట్‌లు ఉండేలా డ్రైనేజీ నిర్మించారు. రోడ్డును ఆనుకుని ఉండే డెక్ట్‌లో జాతీయ రహదారిపై పడే వర్షం నీరు, దానికి ఆనుకుని ఉన్న మరొక డెక్ట్‌లో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు. అయితే మురుగునీరు ప్రవహరించే డెక్ట్‌ లోపల నుంచి ఎండాడ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి తాగునీరు సరఫరా అవుతున్న పైప్‌లైన్‌ను వేశారు. ప్రస్తుతం పీఎం పాలెం, మధురవాడ, కొమ్మాది వంటి ప్రాంతాల్లో జనాభా పెరగడంతో మురుగునీటి ఉత్పత్తి పెరిగింది. దీని ప్రభావం తాగునీటి కోసం పైప్‌లైన్‌ వేసిన డెక్ట్‌పై పడింది. దీంతో చాలాచోట్ల మురుగునీటిలో నీటి సరఫరా పైప్‌లైన్‌ మునిగిపోయింది. పొరపాటున పైప్‌లైన్‌కు రంధ్రం పడినా, జాయింట్‌ల వద్ద లీకేజీ ఏర్పడినా సరే మురుగునీరు చేరే ప్రమాదం ఉంది. ఈ విషయం తెలిసినప్పటికీ జీవీఎంసీ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దాదాపు మూడు లక్షల మంది ఆరోగ్యానికి పొంచి వున్న పెనుముప్పు

ఎండాడ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి నిత్యం 500 కిలోలీటర్లు నీరు సరఫరా అవుతుందని అధికారులు చెబుతున్నారు. అంటే సుమారు మూడు లక్షల మంది అవసరాలను తీరుస్తోంది. మురుగునీరు పొరపాటున పైప్‌లైన్‌లోకి చేరితే వారందరి ఆరోగ్యంపై ప్రభావం పడడం ఖాయమని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల శ్రీకాకుళంలో కలుషిత నీటిని తాగడం వల్ల వందలాది మంది డయేరియాకు గురై ఆస్పత్రిపాలయ్యారు. ప్రభుత్వం తక్షణం స్పందించి సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. పొరపాటున అలాంటిదేమైనా ఎండాడ పైప్‌లైన్‌ విషయంలో జరిగితే ఒకేసారి లక్షలాది మంది అనారోగ్యం పాలవ్వడం ఖాయం. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైప్‌లైన్‌ను సురక్షిత ప్రాంతానికి మార్చాలి. దీనిపై జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగంలోని అధికారి వద్ద ప్రస్తావించగా, పైప్‌లైన్‌ మురుగునీటి కాలువలో ఉండడం వాస్తవమేనని, ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు మంజూరయ్యాయని, మూడు నెలల్లో పైప్‌లైన్‌ను వేరొకచోటకు మార్చేస్తామని వివరించారు.

Updated Date - Mar 11 , 2026 | 12:34 AM