శివారు రిసార్టుల్లో బస భద్రమేనా?
ABN , Publish Date - Mar 26 , 2026 | 11:08 PM
అరకులోయ శివారు ప్రాంతాల్లో ప్రైవేటు రిసార్టులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఊరికి దూరంగా నిర్మానుష్య ప్రదేశాల్లో ఇవి వెలిశాయి.
నిర్మానుష్య ప్రాంతాల్లో ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చిన ప్రైవేటు రిసార్టులు
కనీస రక్షణ చర్యలు శూన్యం
రూపా రిసార్ట్స్ వద్ద యువకుడి హత్య నేపథ్యంలో పర్యాటకుల్లో గుబులు
అరకులోయ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): అరకులోయ శివారు ప్రాంతాల్లో ప్రైవేటు రిసార్టులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఊరికి దూరంగా నిర్మానుష్య ప్రదేశాల్లో ఇవి వెలిశాయి. ఇక్కడ పర్యాటకులకు కనీస భద్రతా ఏర్పాట్లు లేవనే చెప్పాలి. బుధవారం అరకులోయ- లోతేరు రోడ్డులోని రూపా రిసార్ట్స్‌లో బస చేసిన వ్యక్తి దారుణ హత్యకు గురైన నేపథ్యంలో పర్యాటకుల్లో ఆందోళన మొదలైంది. శివారు ప్రాంతాల్లోని రిసార్టుల్లో బస చేయడం ఎంత వరకు శ్రేయస్కరమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
పర్యాటకంగా జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతోంది. దేశ, విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడి వస్తున్నారు. సహజసిద్ధ ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు కుటుంబ సమేతంగా వస్తుంటారు. పర్యాటక సీజన్‌లో అరకులోయలోని పర్యాటక శాఖ రిసార్టులు, ప్రైవేటు రిసార్టులు, హోటళ్లు, లాడ్జిలు ముందుగానే బుక్ అయిపోతుంటాయి. దీంతో శివారు ప్రాంతాల్లోని రిసార్టులను బుక్ చేసుకుంటుంటారు. అరకులోయ- లోతేరు రోడ్డులో నిర్మానుష్య ప్రాంతంలో మూడు ప్రైవేటు రిసార్టులు ఉన్నాయి. అలాగే అనంతగిరికి లోపు ఆరు ప్రైవేటు రిసార్టులు ఉన్నాయి. అయితే ఈ రిసార్టుల్లో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేది ప్రశ్నార్థకమే. వీటికి అధికారులు ఏ విధంగా అనుమతులు ఇచ్చారో కూడా తెలియదు. రిసార్టుల యజమానులు సిబ్బందికి అప్పగించేసి దూర ప్రాంతాల్లో ఉండడం, వీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. దీంతో సిబ్బందిదే ఇష్టారాజ్యంగా ఉంటోంది. పోలీసుల నిఘా లేకపోవడంతో మాదక ద్రవ్యాలు కూడా రిసార్టులకు చేరుతున్నాయని, సిబ్బంది కూడా వాటిని తీసుకుని మత్తులో వీరంగం సృష్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. శివారు ప్రాంతాల రిసార్టుల్లోని సిబ్బందిలో ఎక్కువ మంది మైనర్లేనని తెలిసింది. గతంలో రణజల్లెడలోని రిసార్టు వద్ద కూడా గొడవలు జరిగాయి. పోలీసులు తనిఖీలు చేయకపోవడంతో అక్కడ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయిందని స్థానికులు అంటున్నారు. కొన్ని రిసార్టుల్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు లేకపోవడంతో అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియని పరిస్థితి ఉంది. పర్యాటకుల భద్రత దృష్ట్యా కలెక్టర్ స్పందించి శివారు ప్రాంతాల్లోని రిసార్టులపై నిరంతరం నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.