Share News

డీఈవో పోస్టు భర్తీ కానట్టేనా?

ABN , Publish Date - Jul 18 , 2026 | 11:08 PM

ఈ ఏడాదికి జిల్లా విద్యాశాఖాధికారి పోస్టు భర్తీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గత నాలుగేళ్లుగా ఎక్కువగా ఇన్‌చార్జిలతోనే డీఈవో పోస్టు కొనసాగింది. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖాధికారి పోస్టు ఖాళీగా ఉంది. దీంతో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పీబీకే.పరిమళ పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వాస్తవానికి ఈనెల 12వ తేదీలోపు డీఈవో పోస్టు భర్తీ అవుతుందని విద్యాఖాధికారులు, ఉపాధ్యాయులు భావించారు. అయితే అధికారుల బదిలీలు, నియామకాలకు అవకాశం లేకపోవడంతో ఈ ఏడాదికి డీఈవో పోస్టు భర్తీ అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు.

డీఈవో పోస్టు భర్తీ కానట్టేనా?
పాడేరులో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం

నాలుగేళ్లలో ఎక్కువగా ఇన్‌చార్జిలతోనే కొనసాగింపు

జిల్లాలో మెరుగుపడని విద్యా వ్యవస్థ

ఈఏడాది తగ్గిన టెన్త్‌ ఉత్తీర్ణత

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లా ఏర్పడిన నాటి నుంచి జిల్లా విద్యాశాఖాధికారి పోస్టు వ్యవహారం సమస్యగానే కొనసాగుతున్నది. గతంలో ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం, చింతూరు, పాడేరు రెవెన్యూ డివిజన్లలోని 22 మండలాలుండడంతోపాటు ఆయా ప్రాంతాలు జిల్లా కేంద్రానికి దూరం కావడంతో ఇక్కడ డీఈవోగా పనిచేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. జిల్లా ఏర్పడిన 2022లో పి.రమేశ్‌ను డీఈవోగా నియమించారు. ఆయన ఏడాది పనిచేసిన తర్వాత బదిలీ చేసి శ్యామూల్‌ అనే అఽధికారిని నియమిస్తే, ఆయన విధుల్లో చేరలేదు. దీంతో మరో అధికారి సలీమ్‌భాషాను నియమించారు. ఆయన సుమారు ఆరు నెలలు పనిచేసిన తర్వాత బదిలీపై వెళ్లిపోయారు. దీంతో చేసేది లేక పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యాశాఖలో ఏడీగా పనిచేస్తున్న బ్రహ్మాజీరావుకు ఏజెన్సీ డీఈవోగా బాధ్యతలు అప్పగించారు. ఆయన సుమారు ఏడాదిన్నర పనిచేసి బదిలీ కావడంతో, విజయనగరం డైట్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న రామకృష్ణారావుకు డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన ఎనిమిది నెలలు విధులు నిర్వహించినా, పని భారం కారణంగా ఆయన డీఈవో బాధ్యతల నుంచి రిలీవ్‌ కాడడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. దీంతో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పీబీకే.పరిమిళకు డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి టీడబ్ల్యూ డీడీగానే ఆమెకు విపరీతమైన పనిభారం ఉంటుంది. ఐటీడీఏ పరిధిలో పీవో తర్వాత అదే స్థాయిలో పని భారం ఉండే పోస్టు టీడబ్ల్యూ డీడీదే. ఈ తరుణంలో ఆమె సైతం డీఈవో పోస్టుకు న్యాయం చేయలేని పరిస్థితి కొనసాగుతున్నది. అయితే ఈనెల 12వ తేదీలోపు డీఈవో పోస్టు భర్తీ చేస్తారని అందరూ భావించినప్పటికీ అది జరగలేదు. ఇక్కడ పని చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని టీచర్లు అంటున్నారు. గత రెండేళ్లుగా డీఈవో పోస్టు భర్తీ కాకపోవడంతో జిల్లాలో విద్యావ్యవస్థ సైతం అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. డీఈవోగా శాశ్వత అధికారి కాకుండా ఇతర పోస్టుల్లో ఉన్న అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించడంతో పర్యవేక్షణ లేకపోవడంతో విద్యావ్యవస్థ కుంటుపడుతున్నదని పలువురు అంటున్నారు. ఈకారణంగానే గత రెండేళ్లుగా పదో తరగతిలో సైతం ప్రభుత్వ విద్యాలయాల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు.

షైనింగ్‌ స్టార్‌లో ప్రభుత్వ విద్యార్థులు ఏడుగురే..

జిల్లా విద్యావ్యవస్థ ఆశించిన స్థాయిలో మెరుగుపడకపోవడంతో ఈఏడాది టెన్త్‌ ఫలితాలు నిరాశాజనకంగా వచ్చాయి. ఫలితంగా టెన్త్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులను సత్కరించే షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులకు ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు కేవలం ఏడుగురు మాత్రమే ఎంపికయ్యారు. జిల్లా వ్యాప్తంగా 27 మంది విద్యార్థులు షైనింగ్‌ స్టార్స్‌ అవార్డులకు ఎంపికకాగా వారిలో ప్రైవేటు విద్యాలయాలకు చెందిన వారు 20 మంది ఉన్నారు. ఇది జిల్లాలో విద్యావ్యవస్థ తీరును స్పష్టం చేస్తున్నది. ఇకనైనా ఉన్నతాధికారులు జిల్లాలో విద్యాభివృద్ధికి పటిష్ట చర్యలు చేపట్టాలని మన్యం వాసులు కోరుతున్నారు.

Updated Date - Jul 18 , 2026 | 11:08 PM