శరవేగంగా సాగునీటి వనరుల పనులు
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:38 AM
జిల్లా ప్రస్తుతం జరుగుతున్న నీటిపారుదల కాలువల్లో పూడికతీత, కట్టడాల మరమ్మతులు/ పునర్నిర్మాణ పనులను ఆగస్టు 14వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయకృష్ణ, జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు.
వచ్చే నెల 14వ తేదీనాటికి పూర్తికావాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
అనకాపల్లి కలెక్టరేట్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రస్తుతం జరుగుతున్న నీటిపారుదల కాలువల్లో పూడికతీత, కట్టడాల మరమ్మతులు/ పునర్నిర్మాణ పనులను ఆగస్టు 14వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయకృష్ణ, జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె.. కాలువల్లో పూడికతీత, సిమెంట్ లైనింగ్, స్ట్రక్చర్ల పురోగతి, వివిధ ప్యాకేజీల వారీగా జరుగుతున్న పనుల గురించి గణాంకాలతో సహా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాలువల తవ్వకం, పూడికతీతకు సంబంధించి అత్యధిక పనులు పూర్తయినందున మిగిలిన పనులను వచ్చే నెల 10వ తేదీలోగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. కల్వర్టులు, అప్రోచ్ రోడ్లు, సీలింగ్ వర్కులను వేగవంతం చేయాలని, ముఖ్యమైన స్ట్రక్చర్ల పనులను వచ్చే గురువారం నాటికి పూర్తి చేసి నివేదించాలని ఆదేశించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువను, ఏలేరు కాలువతో అనుసంధానం చేసే ప్రదేశం వద్ద పూడికతీత పనులను వేగవంతం చేయాలన్నారు. వచ్చే నెల 14వ తేదీన పోలవరం ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి, సీఎం చంద్రబాబునాయుడు అనకాపల్లి జిల్లాలో జలహారతి నిర్వహిస్తారని, అంతకన్నా ముందే కాలువను సిద్ధం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పాయకరావుపేట నుంచి తాళ్లపాలెం వరకు కాలువలో పెండింగ్ పనులను శరవేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.