పంట కాలువలు అధ్వానం
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:25 AM
మరికొద్ది రోజుల్లో శారదా నది గ్రోయిన్ల నుంచి కాలువల ద్వారా పొలాలకు నీరు అందించాల్సి వుంది. కానీ పలు పంట కాలువల్లో పూడికతీత పనులు చేపట్టలేదు. పూడికతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారం పేరుకుపోయి డ్రైనేజీ కాలువలను తలపిస్తున్నాయి. అనకాపల్లి మండడలం తుమ్మపాల వద్ద శారదా నదిపై వున్న గ్రోయిన్ ఆధారంగా చెర్లోపలి కాలువ, నడిమి కాలువ, దీపాల కాలువల కింద మార్టూరు, తుమ్మపాల, శంకరం, రేబాక, ఆవఖండం ప్రాంతంలో సుమారు 4,500 ఎకరాల ఆయకట్టు వుంది.
పేరుకుపోయిన పూడిక, ప్లాస్టిక్ వ్యర్థాలు
మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ సాగు పనులు ప్రారంభం
ఆయకట్టుకు నీరు సరఫరా కాదని రైతుల ఆందోళన
తుమ్మపాల, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): మరికొద్ది రోజుల్లో శారదా నది గ్రోయిన్ల నుంచి కాలువల ద్వారా పొలాలకు నీరు అందించాల్సి వుంది. కానీ పలు పంట కాలువల్లో పూడికతీత పనులు చేపట్టలేదు. పూడికతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారం పేరుకుపోయి డ్రైనేజీ కాలువలను తలపిస్తున్నాయి.
అనకాపల్లి మండడలం తుమ్మపాల వద్ద శారదా నదిపై వున్న గ్రోయిన్ ఆధారంగా చెర్లోపలి కాలువ, నడిమి కాలువ, దీపాల కాలువల కింద మార్టూరు, తుమ్మపాల, శంకరం, రేబాక, ఆవఖండం ప్రాంతంలో సుమారు 4,500 ఎకరాల ఆయకట్టు వుంది. ఈ కాలువలన్నీ తుమ్మపాలలో నివాసాల మధ్య నుంచి వెళుతుంటాయి. దీంతో పంట కాలువలు పూడిక, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయాయి. గ్రోయిన్ నుంచి నీటిని విడుదల చేసినప్పటికీ కాలువల్లో ప్రవహించే పరిస్థితి లేదు. ఖరీఫ్ వరి సాగుకు రైతులు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెలాఖరు నుంచి వరి నారుమళ్లు పోస్తుంటారు. కానీ పూడిక పేరుకుపోయిన కాలువలను చూసి రైతులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో వేసవి కాలంలో కాలువల్లో పూడికలు తీయించే ఇరిగేషన్, పంచాయతీ అధికారులు... ఈసారి ఒక్క అడుగు కూడా పూడిక తీయించలేదు. మరోవైపు కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వస్తున్నది. దోమల బెడద కూడా పెరిగిపోయింది. దీంతో కాలువల పక్కన నివాసం వుంటున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా తుమ్మపాల మెయిన్‌రోడ్డు, గవరపేట వీధి, కొత్తపేట వీధి, కొణతాల దిబ్బ, ఇందిరా కాలనీల్లో ఈ సమస్య అధికంగా వుంది.
వెంటనే పూడికలు తీయించాలి
వెలగా నరసింగరావు, రైతు, తుమ్మపాల (14ఎకెపి-టీఎంపీ-5)
తుమ్మపాల మీదుగా ప్రవహిస్తున్న పంట కాలువల్లో పూడిక విపరీతంగా పెరిగిపోయింది. ఇరిగేషన్ అధికారులు వీటిని పరిశీలించారా? లేదా? అన్న అనుమానం కలుగుతున్నది. మరికొద్ది రోజుల్లో ఆయకట్టుకు నీటిని విడుదల చేయాల్సి వుంది. ఇంతవరకు పూడిక తొలగించకపోతే కాలువల ద్వారా పొలాలకు నీళ్లు ఎలా వస్తాయి? అధికారులు వెంటనే స్పందించి యంత్రాలతో యుద్ధప్రాతిపదికన పూడికలు తీయించాలి.