Share News

జడ్పీ పదోన్నతుల్లో అక్రమాలు

ABN , Publish Date - Feb 03 , 2026 | 01:29 AM

జిల్లా పరిషత్‌ పదోన్నతుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని, అస్మదీయులకు కోరుకున్న చోట పోస్టింగ్‌ ఇచేందుకు రంగం సిద్ధమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జడ్పీ పదోన్నతుల్లో అక్రమాలు

  • ఒకసారి పదోన్నతి తిరస్కరించిన ఉద్యోగికి ఆ ఏడాదిలో మరోసారి అవకాశం కల్పించకూడదని నిబంధన

  • దానిని ఉల్లంఘించి జాబితా సిద్ధం

  • చక్రం తిప్పిన ఉద్యోగుల సంఘ నేత, ఒక అధికారి, సీనియర్‌ ఉద్యోగి

  • అస్మదీయులకు కోరుకున్నచోట పోస్టింగ్‌

  • డబ్బులు వసూలు చేశారనే ప్రచారం

  • నేడు అనకాపల్లి వస్తున్న కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని పలువురి నిర్ణయం

విశాఖపట్నం/పెందుర్తి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి):

జిల్లా పరిషత్‌ పదోన్నతుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని, అస్మదీయులకు కోరుకున్న చోట పోస్టింగ్‌ ఇచేందుకు రంగం సిద్ధమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఉద్యోగుల సంఘ నేత, ఒక అధికారి, సీనియర్‌ ఉద్యోగి చక్రం తిప్పారని, ఇందుకోసం పలువురి నుంచి సొమ్ములు వసూలు చేశారనే ప్రచారం సాగుతుంది. ఒకసారి పదోన్నతి తిరస్కరించిన ఉద్యోగి...ఆ ఏడాదిలో తిరిగి పదోన్నతి పొందేందుకు అర్హుడు కాదు. అయితే గతంలో ఇచ్చిన జీవోకు అనుగుణంగా తాజాగా పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన వివరణను జడ్పీలో కొందరు అధికారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ శాఖల పరిధిలో ప్రతి ఏడాదీ ఖాళీల మేరకు అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేందుకు జాబితాలు సిద్ధం చేస్తారు. ఇందుకు సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఆగస్టు 31 వరకు ఉన్న ఏడాది కాలాన్ని ప్యానల్‌ ఇయర్‌గా పరిగణిస్తారు. ఒకవేళ పదోన్నతి తీసుకునేందుకు ఏ ఉద్యోగి అయినా విముఖత చూపితే, అతని నుంచి లిఖితపూర్వకంగా పత్రం తీసుకుని, జాబితాలో ఆ తరువాత ఉన్న వారికి అవకాశం ఇస్తారు. అయితే ఒకసారి పదోన్నతి వద్దనుకునే ఉద్యోగి ఏడాది వరకూ అందుకు అర్హులు కారు. 2024-25 ప్యానల్‌ ఇయర్‌లో జడ్పీలో సీనియర్‌ అసిస్టెంట్‌ పదోన్నతుల కోసం 18 మందితో జాబితా రూపొందించారు. అప్పట్లో సీనియర్‌ అసిస్టెంట్‌ ఖాళీలు ఎక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. ఏజెన్సీకి వెళ్లాల్సి ఉంటుందని జాబితాలో 17 మంది పదోన్నతి వద్దనుకున్నారు. ఒకరు మాత్రం సుముఖత వ్యక్తంచేయగా ఏజెన్సీలో పోస్టింగ్‌ వచ్చింది.

ఇదిలావుండగా పంచాయతీరాజ్‌ శాఖలో భారీగా పదోన్నతులకు పవన్‌కల్యాణ్‌ చొరవ తీసుకోవడంతో జడ్పీలో సుమారు 30 వరకు సీనియర్‌ అసిస్టెంట్లు డిప్యూటీ ఎంపీడీవోలుగా వెళ్లారు. ఆ ఖాళీల భర్తీకి అధికారులు సీనియర్లతో జాబితా రూపొందించారు. ఒకేసారి 30 ఖాళీలు ఏర్పడడంతో ఏజెన్సీతోపాటు మైదానం, నగర పరిసరాల్లో పలుచోట్ల సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అవకాశం వచ్చింది. దీనికి అనుగుణంగా జూనియర్‌ అసిస్టెంట్లతో పదోన్నతులకు ఒక జాబితా సిద్ధం చేశారు. గతంలో అంటే 2024-25 ప్యానల్‌ ఇయర్‌లో పదోన్నతులు తిరస్కరించిన ఉద్యోగుల పేర్లు కూడా ఉన్నాయి. దీనిపై తాజాగా పదోన్నతులకు అర్హత సాధించిన జూనియర్‌ అసిస్టెంట్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. గతంలో పదోన్నతులు వద్దనుకునే వారికి 2026-27 ప్యానల్‌ ఇయర్‌లో తయారుచేసే జాబితాలో పెట్టాలి తప్ప 2025-26 సంవత్సరానికి అర్హులు కారంటూ జడ్పీ సీఈవోకి, పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నుంచి వచ్చిన ఆదేశాలను జడ్పీలో కొంతమంది అధికారులు తమకు అనుకూలంగా మలచుకున్నారు. అప్పట్లో ఏజెన్సీలో పనిచేయడానికి ఇష్టపడని వారికి ఇప్పుడు నగరం, మైదానంలో పోస్టింగ్‌ దక్కేలా జడ్పీలో ఉద్యోగ సంఘ నేత ఒకరు చక్రం తిప్పారు. ఒక అధికారి, సీనియర్‌ ఉద్యోగిని సంఘ నేత తప్పుదోవ పట్టించారనే ప్రచారం సాగుతుంది. పదోన్నతుల జాబితాపై ఒకపక్క అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నా పట్టించుకోకుండా పోస్టింగ్స్‌కు రంగం సిద్ధం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన సంఘ నేత, కూటమి ప్రభుత్వంలోనూ తన మాటే చెల్లుబాటు అయ్యేలా అందరికీ మేనేజ్‌ చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. అదేవిధంగా మంగళవారం అనకాపల్లి జిల్లా పర్యటనకు వస్తున్న పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజను స్వయంగా కలిసి ఫిర్యాదు చేయనున్నారు. పదోన్నతుల వ్యవహారంపై జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి వద్ద ప్రస్తావించగా నిబంధనల మేరకే పదోన్నతులు ఇస్తున్నామని పేర్కొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 01:29 AM