చెత్త తరలింపులో అక్రమాలు
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:38 AM
జీవీఎంసీ పరిధిలో గల గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల (జీటీఎస్) నుంచి కాపులుప్పాడ డంపింగ్‌యార్డుకు చెత్త తరలింపులో అక్రమాలు చోటుచేసుకోవడం వాస్తవమేనని అధికారులు నిర్ధారించారు.
జీవీఎంసీ అధికారుల నిర్ధారణ
‘రాసా’ నుంచి రూ.89 లక్షలు రికవరీ
బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల్సిన సంస్థకు మళ్లీ కొత్తగా రెండు ప్రాజెక్టులు కేటాయింపు
ఆమోదిస్తూ కమిషనర్ ఉత్తర్వులు
అధికారుల తీరుపై విమర్శలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ పరిధిలో గల గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల (జీటీఎస్) నుంచి కాపులుప్పాడ డంపింగ్‌యార్డుకు చెత్త తరలింపులో అక్రమాలు చోటుచేసుకోవడం వాస్తవమేనని అధికారులు నిర్ధారించారు. మూడు జోన్లలో క్లోజ్డ్ కాంపాక్టర్ సిస్టమ్ (సీసీఎస్) ప్రాజెక్టుల నిర్వహణ చూస్తున్న ‘రాసా’ సంస్థ నుంచి ఎట్టకేలకు రూ.89 లక్షలు రికవరీ చేశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ సంస్థ మళ్లీ టెండర్లలో పాల్గొనకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల్సిన అధికారులు, అందుకు విరుద్ధంగా కొత్తగా రెండు జోన్లలో సీసీఎస్ ప్రాజెక్టుల నిర్వహణను కట్టబెట్టడం చర్చనీయాంశంగా మారింది.
‘రాసా’ బాధ్యతారాహిత్యం
టౌన్‌కొత్తరోడ్డు, గాజువాక, చీమలాపల్లిలోని సీసీఎస్ ప్రాజెక్టుల నిర్వహణను చాలాకాలంగా ‘రాసా’ సంస్థ చూస్తోంది. ఆ సంస్థ యంత్రాల్లో చెత్తను వేసి కంప్రెస్ చేసిన తర్వాత హుక్‌లోడర్ల ద్వారా కాపులుప్పాడ తరలించాలి. కానీ క్లాప్ వాహనాల ద్వారా వచ్చే చెత్తను జీటీఎస్ కేంద్రాల్లో కుప్పగా పోయించి, జేసీబీలతో ఓపెన్ టిప్పర్లలోకి లోడింగ్ చేయించి టెండర్ నిబంధనలకు విరుద్ధంగా కాపులుప్పాడ తరలిస్తోంది. దీనివల్ల సీసీఎస్ ప్రాజెక్టు, హుక్‌లోడర్ల నిర్వహణ, మరమ్మతులు వంటి ఖర్చులు కాంట్రాక్టర్‌కు ఉండవు. కానీ జీవీఎంసీ నుంచి సీసీఎస్ ప్రాజెక్టు, హుక్‌లోడర్ల నిర్వహణ పేరిట బిల్లును మాత్రం డ్రా చేసుకుంటున్నారు. బిల్లులో కొంత మొత్తాన్ని అధికారులకు వాటాగా ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని తమ జేబులో వేసుకుంటున్నారు. చెత్తను ఓపెన్ టిప్పర్లతో యార్డుకు తరలించడం వల్ల కాలుష్య సమస్య తలెత్తుతోంది. దుర్వాసన వెదజల్లుతోంది. అంతేకాకుండా జీటీఎస్ కేంద్రాల్లో బహిరంగంగా చెత్తను రోజుల తరబడి నిల్వ ఉంచడంతో పరిసర ప్రాంతాల వాసులు ఇబ్బందిపడుతున్నారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో పలుమార్లు కథనాలు ప్రచురితం కావడంతో జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ కొన్నాళ్ల కిందట సీసీఎస్ ప్రాజెక్టులను తనిఖీ చేశారు. నిర్వహణ సరిగా లేదని, అయినా బిల్లు మాత్రం యథావిధిగా తీసుకుంటున్నారని గుర్తించారు. దీనిపై లోతుగా విచారణ జరిపి కాంట్రాక్టర్ల నుంచి అక్రమంగా పొందిన డీజిల్‌ను రికవరీ చేయాలని ఆదేశించారు.
రూ.89 లక్షలు రికవరీ
కమిషనర్ ఆదేశాలతో మెకానికల్ అధికారులు విచారణ జరిపారు. టౌన్‌కొత్తరోడ్డు సీసీఎస్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.17 లక్షలు, చీమలాపల్లి ప్రాజెక్టులో రూ.14 లక్షలు, గాజువాక ప్రాజెక్టులో రూ.58 లక్షలు విలువైన డీజిల్‌ను కాంట్రాక్టర్ డ్రా చేసినట్టు తేల్చి ఆ మేరకు రికవరీకి ప్రతిపాదించగా కమిషనర్ కూడా అంగీకరిస్తూ ఎంబుక్‌పై సంతకాలు చేశారు. దీంతో రెండు రోజుల కిందట ఆ కాంట్రాక్టర్ నుంచి రూ.89 లక్షలు రికవరీ చేస్తూ తయారుచేసిన ఫైల్‌ను కమిషనర్ ఆమోదించారు. కాంట్రాక్టర్ తప్పిదాన్ని అంగీకరించడంతోపాటు అతడి నుంచి భారీగా రికవరీ చేసినందున మరొక టెండర్‌లో పాల్గొనడానికి వీల్లేకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి. కానీ, అధికారులు ఆ పనిచేయలేదు. తాజాగా టౌన్‌కొత్తరోడ్డు, చీమలాపల్లి సీసీఎస్ ప్రాజెక్టుల నిర్వహణకు టెండర్లు ఆహ్వానిస్తే ‘రాసా’ సంస్థ అర్హత పొందినట్టు కమిషనర్‌కు ఫైల్ పెట్టారు. కమిషనర్ కూడా ఎలాంటి అభ్యంతరం తెలపకుండా ఆమోదం తెలపడం జీవీఎంసీలో చర్చనీయాంశంగా మారింది. కొందరు అధికారులతోపాటు కౌన్సిల్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలను సదరు కాంట్రాక్టర్ ప్రసన్నం చేసుకోవడంతో ఆ సంస్థకు టెండర్లు దక్కేలా తమవంతు సహకారం అందించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.