Share News

అటవీ శాఖలో అక్రమాలు

ABN , Publish Date - Jun 27 , 2026 | 12:44 AM

కశింకోట మండలం బయ్యవరం పరిధిలో అటవీ శాఖకు చెందిన శారదా వనంలో జీడిమామిడి తోటల ఫలసాయం విక్రయాల వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వినిస్తున్నాయి. ఫలసాయం సేకరణకు టెండర్లు పిలవకుండా, అస్మదీయులకు నామమాత్రం ధరకు కట్టబెట్టినట్టు తెలిసింది. దీంతో అటవీ శాఖ లక్షలాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయినట్టు చెబుతున్నారు.

అటవీ శాఖలో అక్రమాలు
శారదా వనంలో జీడిమామిడి చెట్లు

టెండర్లు పిలవకుండానే తోటల ఫలసాయం విక్రయం

బయ్యవరం ‘శారదా వనం’లో 50 ఎకరాల్లో జీడిమామిడి తోటలు

ఫలసాయం ద్వారా రూ.15 లక్షలకుపైగా ఆదాయం వచ్చే అవకాశం

రూ.2.5 లక్షలు మాత్రమే అటవీ శాఖ ఖాతాలో జమ

ఆదాయాన్ని పక్కదారి పట్టించినట్టు ఆరోపణలు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

కశింకోట మండలం బయ్యవరం పరిధిలో అటవీ శాఖకు చెందిన శారదా వనంలో జీడిమామిడి తోటల ఫలసాయం విక్రయాల వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వినిస్తున్నాయి. ఫలసాయం సేకరణకు టెండర్లు పిలవకుండా, అస్మదీయులకు నామమాత్రం ధరకు కట్టబెట్టినట్టు తెలిసింది. దీంతో అటవీ శాఖ లక్షలాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయినట్టు చెబుతున్నారు.

జిల్లాలో అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం, చోడవరం, కృష్ణాదేవిపేటల్లో అటవీ రేంజ్‌ కార్యాలయాలు వున్నాయి. వీటి పరిధిలో వేలాది ఎకరాల్లో మామిడి, జీడిమామిడి, సపోటా వంటి తోటలు వున్నాయి. వీటిల్లో ఫలసాయం సేకరణకు అటవీ శాఖ అధికారులు ఏటా టెండర్లు/ వేలం పాటలు నిర్వహించి, ఎవరు ఎక్కువ చెల్లించడానికి ముందుకువస్తే ఫలసాయాన్ని వారికి అప్పగిస్తుంటారు. ఇదిలావుండగా అనకాపల్లి అటవీ రేంజి పరిధిలోని కశింకోట మండలం బయ్యవరంలో అటవీ శాఖకు చెందిన భూముల్లో ‘శారదా వనం’ పేరుతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో జీడిమామిడి తోటలు ఉన్నాయి. అటవీ శాఖ నిబంధనల జీడిమామిడి పిక్కలను సేకరించి విక్రయించుకోవడానికి టెండర్లు పిలవాలి. కానీ శారదా వనం అధికారులు టెండర్లు పిలవకుండా మునగపాక మండలానికి చెందిన ఒక వ్యక్తి జీడి పిక్కలను కొనుగోలు చేసినట్టు రికార్డుల్లో చూపించి, లక్షలాది రూపాయలను పక్కదారి పట్టించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఎకరా జీడిమామిడి తోట ద్వారా రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వస్తుంది. ఈ లెక్కన శారదా వనంలో 50 ఎకరాల జీడిమామిడి తోటల నుంచి కనీసం రూ.15 లక్షల ఆదాయం రావాలి. కానీ రూ.2.5 లక్షలు మాత్రమే అటవీ శాఖ ఖాతాలో జమ అయినట్టు తెలిసింది. శారదా వనం 70 ఎకరాల్లో విస్తరించి ఉండగా ఇందులో 50 ఎకరాల్లో జీడిమామిడి తోటలు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం 300 చెట్లు మాత్రమే వున్నాయని, వీటి నుంచి 220 కిలోల జీడిపిక్కల దిగుబడి వచ్చిందని చెబుతుండడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

శారదా వనంలోని జీడి మామిడి తోటల ఫలసాయాన్ని టెండర్లు పిలవకుండా విక్రయించడంపై రేంజి అధికారి జ్యోతిర్మయిని వివరణ కోరగా... తమ శాఖ ఉన్నతాధికారుల అనుమతితోనే టెండర్లు లేకుండా జీడి పిక్కలను విక్రయించామని చెప్పారు. చెట్లు వయసుమీరినవి కావడంతో దిగుబడి అంతగా రాలేదని తెలిపారు.

Updated Date - Jun 27 , 2026 | 12:44 AM