Share News

ఉద్యాన మొక్కల పంపిణీలో అక్రమాలు

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:18 PM

గంజాయికి ప్రత్యామ్నాయంగా గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉద్యానవన మొక్కల పంపిణీలో వీబీ జీరామ్‌జీ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నాసిరకం, చనిపోయిన మొక్కలను పంపిణీ చేస్తున్నారు. ఈ విషయాన్ని రైతులు ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలను అధికారులు ఇస్తున్నారు

ఉద్యాన మొక్కల పంపిణీలో అక్రమాలు
చనిపోయిన సిల్వర్‌ ఓక్‌ మొక్కలను చూపిస్తున్న తాజా మాజీ సర్పంచ్‌ రామకృష్ణ

చనిపోయిన సిల్వర్‌ ఓక్‌ మొక్కలను సరఫరా చేసిన జీరామ్‌జీ అధికారులు

నిబంధనలకు అధికారుల తూట్లు

ప్రశ్నించిన రైతులకు పొంతన లేని సమాధానాలు

గూడెంకొత్తవీధి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): గంజాయికి ప్రత్యామ్నాయంగా గిరిజన రైతులకు అధిక ఆదాయం సమకూర్చే ఉద్యాన పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం వీబీ జీరామ్‌జీ పథకం ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. గిరిజన రైతులకు అవకాడో, డ్రాగన్‌ ఫ్రూట్‌, చింత, నారింజ, ఉసిరి, నిమ్మ, జాఫ్రా, సిల్వర్‌ ఓక్‌ మొక్కలను పంపిణీ చేస్తున్నది. ఈ మొక్కలను గోతులు తీసి నాట్లు వేసుకున్న నాటి నుంచి మూడేళ్లపాటు సాగుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలుచేయాల్సిన వీబీ జీరామ్‌జీ అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు.

నిబంధనలు పాటించిన అధికారులు

ఉద్యాన పంటల మొక్కల పంపిణీలో వీబీ జీరామ్‌జీ అధికారులు నిబంధనలను కనీసం పాటించడం లేదు. పంపిణీ చేసిన మొక్కలు ఎక్కడ కొనుగోలు చేశారు? ఆ నర్సరీలకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా? మొక్కల నాణ్యతను శాస్త్రవేత్తలు, అధికారులు పరిశీలించి సిఫారసు చేశారా? వంటి అంశాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతున్నారు. నిబంధనల ప్రకారం వీబీ జీరామ్‌జీ అధికారులు మొక్కలు సరఫరా చేయక ముందే చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, జిల్లా ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలి. వారు సిఫారసు చేసిన నర్సరీల్లో మాత్రమే మొక్కలను కొనుగోలు చేయాలి. ఈ నిబంధనలను కనీసం పాటించకుండా జీరామ్‌జీ ఉద్యోగులు కమిషన్‌ అధికంగా ఇచ్చే నర్సరీల నుంచి నాసిరకం మొక్కలు దిగుమతి చేసి నేరుగా రైతులకు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చనిపోయిన మొక్కలు పంపిణీ

మండలంలోని వీబీ జీరామ్‌జీలో తొలివిడతగా అధికారులు సిల్వర్‌ ఓక్‌ మొక్కలను పంపిణీ చేస్తున్నారు. పలు గ్రామాల రైతులకు పంపిణీ చేసిన సిల్వర్‌ ఓక్‌ మొక్కల్లో 30 నుంచి 40శాతం మొక్కలు తరలింపు, నాట్లు దశలోనే చనిపోయాయని రైతులు చెబుతున్నారు. నాలుగు, ఐదు గ్రామాలకు చెందిన మొక్కలను ఒక ప్రాంతంలో దించడంతో రైతులు స్వగ్రామాలకు తీసుకొని వెళ్లేందుకు అదనపు రవాణ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందన్నారు. దామనాపల్లి, లింగవరం, కట్టుపల్లి, సిగినాపల్లి గ్రామాల గిరిజనులకు జీరామ్‌జీ ద్వారా పంపిణీ చేసిన మొక్కలు చనిపోవడంతో తాజా మాజీ సర్పంచ్‌ కుందరి రామకృష్ణ, రైతులు ప్రశ్నించగా.. ఉద్యోగులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Sep 12 , 2026 | 11:18 PM