టెండర్లలో గోల్‌మాల్?
ABN , Publish Date - Jun 11 , 2026 | 01:11 AM
జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం నిర్వహిస్తున్న టెండర్ల ప్రక్రియలో పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా అభివృద్ధి పనికి అధికారులు టెండర్ పిలిస్తే 30 శాతానికిపైగా తక్కువకు బిడ్‌లు వేసి కాంట్రాక్టర్లు పనులు దక్కించుకుంటున్నారు. తక్కువకు బిడ్ వేసి నిర్దేశించిన ప్రమాణాలతో పనులు ఎలా పూర్తి చేయగలుగుతున్నారనే దానికి అధికారులు సైతం సమాధానం చెప్పలేకపోతున్నారు. అయితే అధికారులు అంచనాలను తయారుచేయడంలో తప్పు చేస్తున్నారా?, లేకపోతే కాంట్రాక్టర్లు టెండర్ నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసినా అధికారులు బిల్లులు చెల్లించేస్తున్నారా?...అనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
30 శాతానికి పైగా తక్కువకు బిడ్‌లు వేస్తున్న జీవీఎంసీ కాంట్రాక్టర్లు
ఎలా గిట్టుబాటు అవుతుందని సర్వత్రా సందేహాలు
ఇంజనీరింగ్ అధికారులు అంచనాలను
భారీగా పెంచేస్తున్నారని అనుమానాలు
కొన్నింటిలో నాణ్యతా ప్రమాణాలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు
చర్చనీయాంశంగా ఇంజనీరింగ్ అధికారుల తీరు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం నిర్వహిస్తున్న టెండర్ల ప్రక్రియలో పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా అభివృద్ధి పనికి అధికారులు టెండర్ పిలిస్తే 30 శాతానికిపైగా తక్కువకు బిడ్‌లు వేసి కాంట్రాక్టర్లు పనులు దక్కించుకుంటున్నారు. తక్కువకు బిడ్ వేసి నిర్దేశించిన ప్రమాణాలతో పనులు ఎలా పూర్తి చేయగలుగుతున్నారనే దానికి అధికారులు సైతం సమాధానం చెప్పలేకపోతున్నారు. అయితే అధికారులు అంచనాలను తయారుచేయడంలో తప్పు చేస్తున్నారా?, లేకపోతే కాంట్రాక్టర్లు టెండర్ నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసినా అధికారులు బిల్లులు చెల్లించేస్తున్నారా?...అనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
నగర పరిధిలో ఏదైనా రోడ్డు, డ్రైనేజీ, భవనం, కల్వర్టులు నిర్మించాలంటే ఇంజనీరింగ్ అధికారులు టెండరు పిలిచి అర్హత కలిగిన కాంట్రాక్టర్‌తో పనులు పూర్తి చేయించాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా ఏదైనా అభివృద్ధి పని చేయాలనుకుంటే ఆ పనికి అవసరమయ్యే మెటీరియల్ ఏమిటి?, అవి ఎక్కడ అందుబాటులో ఉంటాయి?, వాటి ధర ఎంత?, రవాణా ఖర్చు ఎంత?, ఎంత మంది పనిచేయాల్సి ఉంటుంది?, ఏదైనా యంత్రాన్ని వాడాల్సి వస్తే దానికి ఎంత ఖర్చవుతుంది?, కాంట్రాక్టర్ లాభం, ఈఎండీ, ఆదాయపన్ను మినహాయింపు వంటివన్నీ లెక్కించి ప్రతిపాదనలు తయారుచేస్తారు. ప్రతిపాదనల్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆ పని పూర్తిచేయడానికి ఎంత ఖర్చవుతుందనేదానిపై ఉన్నతాధికారుల నుంచి సమ్మతి తీసుకున్న తర్వాత టెండర్ పిలుస్తారు. టెండర్ షెడ్యూల్‌లో ఆ పనికి సంబంధించిన నాణ్యత, ఇతర నిబంధనలను స్పష్టంగా పేర్కొంటారు. టెండర్ షెడ్యూల్‌ను పరిశీలించిన తర్వాత కాంట్రాక్టర్లు ఆసక్తి ఉంటే ఆయా పనులను తాము ఎంత మొత్తానికి పూర్తిచేయగలమో తెలుపుతూ ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా బిడ్ వేస్తారు. కొన్ని రకాల యంత్రాలు, ఇతర సామగ్రి అందుబాటులో ఉన్న కాంట్రాక్టర్లు మాత్రం అధికారులు టెండర్‌లో పేర్కొన్న మొత్తానికి ఐదు శాతం ఎక్కువ, లేదా తక్కువకు బిడ్ వేస్తారు. ఆ మొత్తానికి పని పూర్తి చేస్తేనే కాంట్రాక్టర్‌కు ఎంతో కొంత మిగులుతుంది. కానీ జీవీఎంసీ పరిధిలో ఇటీవల కాలంలో ఇంజనీరింగ్ అధికారులు పిలిచే టెండర్లలో సగటున 32 శాతం తక్కువకు బిడ్‌లు వేసి పనులు దక్కించుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇటీవల వేపగుంట నుంచి జుత్తాడ వరకు జీవీఎంసీ నిర్మిస్తున్న రోడ్డులో ఐదుచోట్ల బాక్స్ కల్వర్టులు నిర్మించాల్సి ఉందని అధికారులు గుర్తించారు. దీనికోసం జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు టెండర్లు పిలిచారు. పలువురు కాంట్రాక్టర్లు పోటీ పడ్డారు. బిడ్‌లను గత నెల 28న అధికారులు తెరవగా, ఒకే కాంట్రాక్టర్ ఐదు పనులను 32 శాతానికిపైగా తక్కువకు వేసి దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయా పనులకు పోటీపడిన మిగిలిన కాంట్రాక్టర్లు గరిష్ఠంగా 15 శాతం లోపే తక్కువకు బిడ్‌లు వేయగా, సదరు కాంట్రాక్టర్ మాత్రం 32 శాతం నుంచి 33 శాతం మధ్య తక్కువకు బిడ్ వేయడం విశేషం. హార్టికల్చర్ విభాగంలో కూడా ఈ ఏడాది మార్చి వరకు గ్రీనరీ నిర్వహణకు పిలిచిన టెండర్లను 40 శాతం వరకు తక్కువకు బిడ్ వేసి కాంట్రాక్టులు దక్కించుకున్నవారు ఉన్నారు. యూజీడీ విభాగంలో అయితే ఎప్పుడూ 30 శాతం కంటే తక్కువకు బిడ్‌లు పడవని కాంట్రాక్టర్లే చెబుతున్నారు.
అంచనాల తయారీలో తప్పిదమా?, పనులు నాణ్యతలో తేడానా?..
అధికారులు ఒక పనికి అయ్యే ఖర్చును అంచనా వేసి టెండర్ పిలిస్తే అందులో 30 నుంచి 35 శాతం తక్కువ మొత్తానికి పనులు చేస్తామంటూ కాంట్రాక్టర్లు ముందుకురావడంలో ఏమిటి ఆంతర్యమేమిటనే దానిపై చర్చ జరుగుతోంది. అధికారులు కావాలనే అంచనాలను భారీగా పెంచేసి టెండరు పిలుస్తున్నారని ఇంజనీరింగ్ విభాగంలోని సిబ్బంది, కొందరు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. మరికొందరు మాత్రం కాంట్రాక్టర్లు అధికారులతో ముందుగానే అవగాహన కుదుర్చుకుని భారీ లెస్‌లకు పనులు దక్కించుకుని, మొక్కుబడిగా పనులు చేసి సక్రమంగా పనులు చేసినట్టు అదే అధికారులతో బిల్ తయారుచేయించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దీనివల్ల మిగిలిన కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 శాతం కంటే ఎక్కువ లెస్‌లకు టెండరు వేసిన పనులపై జీవీఎంసీ కమిషనర్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఇంజనీరింగ్ సిబ్బంది, కాంట్రాక్టర్లు కోరుతున్నారు.