ఉపాధి పనుల్లో అక్రమాలు
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:42 AM
ఉపాధి పనుల్లో అక్రమాలు
17జీకేవీ1:
- కొలతల్లో తేడాలు, ఒకే పనికి రెండు సార్లు నగదు చెల్లింపులు
- చనిపోయిన వ్యక్తులకు పింఛన్ పంపిణీ
- ప్రజా వేదికలో బట్టబయలు
గూడెంకొత్తవీధి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): మండలంలో గతంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో పలు అక్రమాలు జరిగినట్టు బయటపడింది. కొలతల్లో తేడాలు, ఒకే పనికి రెండుసార్లు నగదు చెల్లింపులు జరిగాయని, చనిపోయిన వ్యక్తులకు రెండు, మూడు నెలలు పింఛన్ పంపిణీ చేసినట్టు తేలింది. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వేదికలో అక్రమాల వివరాలను సామాజిక తనిఖీ బృందం బహిర్గతం చేసింది. మండలంలోని 16 పంచాయతీల పరిధిలో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు రూ.32 కోట్ల నిధులతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జరిగాయి. ఈ పనులను ఫిబ్రవరి 9 నుంచి మార్చి 12 వరకు క్షేత్ర స్థాయిలో సామాజిక తనిఖీ బృందం తనిఖీ చేసింది. సామాజిక తనిఖీలపై డ్వామా పీడీ డాక్టర్ డీవీ విద్యాసాగర్ అధ్యక్షతన ప్రజా వేదిక నిర్వహించారు. ఇందులో పలు పంచాయతీల పరిధిలో జరిగిన అక్రమాల వివరాలను సామాజిక తనిఖీ బృందం వెల్లడించింది. ప్రధానంగా దామనాపల్లి పంచాయతీ పరిధిలో పని పుస్తకాలకు సంబంధించిన నిధులు రూ.8,400ను రెండుసార్లు తీసుకున్నారు. రైతులు భూమి చదును చేసిన పనుల రికార్డు లేనట్టుగా గుర్తించారు. మొండిగెడ్డ పంచాయతీలో ఉద్యాన మొక్కలు, నర్సరీల నిర్వహణ, సేంద్రీయ ఎరువులకు సంబంధించి రూ.80 వేల నిధులు రెండుసార్లు చెల్లించినట్టు గుర్తించారు. వంచుల పంచాయతీలో సుమారు రూ.2.3 కోట్ల నిధులతో నిర్వహించిన పనుల మస్తర్లలో సంతకాలు లేకుండా కూలీలకు వేతనాలు చెల్లించినట్టు గుర్తించారు. మట్టి గట్లు నిర్మాణాల కొలతల్లో తేడాలు ఉండడం వల్ల అదనంగా రూ.60 వేలు ఖర్చు చేసినట్టు నిర్ధారించారు. ఉద్యాన పంటలు, డ్రాగన్ ఫ్రూట్ సాగు ప్రోత్సాహకాల్లోనూ అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. సంకాడలో జరిగిన ఉపాధి పనులకు సంబంధించి రికార్డు, ఫొటోలు తనిఖీ బృందానికి అందజేయలేదు. దీంతో పంచాయతీ పరిధిలో ఏ మేరకు పనులు జరిగాయి?, ఏ మేరకు జరగలేదనే అంశాలను గుర్తించలేదని బృందం సభ్యులు తెలిపారు. వృద్ధురాలు జర్తా అచ్చియమ్మ చనిపోయిన తరువాత మూడు నెలలు, వితంతువు ముమ్మిడి సత్యవతి చనిపోయిన తరువాత రెండు నెలలు పింఛన్ నగదును డ్రా చేశారని, ఉపాధి పనులకు సంబంధించి నేమ్ బోర్డు ఏర్పాటు చేయాల్సి వున్నప్పటికి ఎక్కడా ఏర్పాటు చేయకుండా నిధులు రూ.వేలల్లో కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి జమచేసినట్టు గుర్తించారు. నెల రోజుల్లో ఉపాధి పనులు జరిగిన ప్రాంతాల్లో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలని డ్వామా పీడీ ఆదేశించారు. ప్రజా వేదికలో రుజువైన ప్రతి అంశాన్ని రికార్డు చేస్తున్నామని, నిధుల అక్రమాలకు పాల్పడిన వ్యక్తుల నుంచి రికవరీ చేస్తామని పీడీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోయిన కుమారి, ఎంపీడీవో రమణబాబు, ఎస్‌ఆర్‌పీలు అచ్యుత్, చిరంజీవిరావు, ఏపీవో రాంప్రసాద్, గిరిజన సంక్షేమశాఖ డీఈఈ రఘునాథరావునాయుడు, టీడీపీ మండలాధ్యక్షుడు కొండలరావు, బీజేపీ నాయకుడు కాకూరు శేఖర్, మండల ఉపాధ్యక్షుడు ఆనందరావు, పలు పంచాయతీల సర్పంచులు పాల్గొన్నారు.