నక్కపల్లికి ‘ఉక్కు’ ప్రతినిధులు
ABN , Publish Date - Mar 03 , 2026 | 01:38 AM
నక్కపల్లి మండలంలో ఏర్పాటు కానున్న ‘ఆర్సెలార్ మిట్టల్- నిప్పన్ స్టీల్’ (ఏఎంఎన్‌ఎస్)కు భూమిపూజ కార్యక్రమానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
స్టీల్ ప్లాంట్ భూమి పూజ ఏర్పాట్లు పరిశీలన
మౌలిక వసతుల పనులపై సంతృప్తి
అనకాపల్లిలో కలెక్టర్, జేసీలతో భేటీ
అనకాపల్లి/ నక్కపల్లి మార్చి 2 (ఆంధ్రజ్యోతి):
నక్కపల్లి మండలంలో ఏర్పాటు కానున్న ‘ఆర్సెలార్ మిట్టల్- నిప్పన్ స్టీల్’ (ఏఎంఎన్‌ఎస్)కు భూమిపూజ కార్యక్రమానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం ప్రభుత్వం .2,200 ఎకరాలను కేటాయించిన సంగతి తెలిసిందే. ఏఎంఎన్‌ఎస్ సీఈఓ దిలీప్‌ఓమెన్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం సోమవారం నక్కపల్లి మండలంలో కంపెనీకి కేటాయించిన భూములను, అక్కడ జరుగుతున్న మౌలిక వసతుల కల్పన పనులను పరిశీలించారు. అనంతరం అనకాపల్లి కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ శౌర్యమాన్ పటేల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్టీల్ ప్లాంట్ భూమి పూజకు జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. భూ సమీకరణ, రహదారుల నిర్మాణం, ప్రాజెక్టుకు అవసరమైన నీటి సరఫరా కోసం జరుగుతున్న పైపులైన్ ఏర్పాటు పనులు, పునరావస కాలనీల అభివృద్ధి, ప్రభావిత కుటుంబాల తరలింపుపై అధికారులతో చర్చించారు. శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీ లేదా సీఎం చంద్రబాబు వస్తారని, ఇందుకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టాలో కలెక్టర్ విజయ్‌కృష్ణన్ వారికి సూచించారు. ఏఎంఎన్‌ఎస్ ప్రతినిధుల బృందంలో ప్రాజెక్టు చీఫ్ కేఎల్ చౌదరి, హెచ్‌ఆర్ డైరెక్టర్ అశితోష్ తెలియాంగ్, అడ్మిన్ హెడ్ కెప్టెన్ దీపక్ పట్నాయక్, హెచ్‌ఆర్ అడ్మిన్ డీఎస్ వర్మ తదితరులు పాల్గొన్నారు.