రూ.2,977 కోట్లతో ఐరన్‌ఓర్ బ్లెండింగ్ ప్లాంటు
ABN , Publish Date - Jun 21 , 2026 | 01:04 AM
స్టీల్‌ప్లాంటు భూముల్లో ‘నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ (ఎన్‌ఎండీసీ) ఐరన్‌ఓర్ బ్లెండింగ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది.
స్టీల్‌ప్లాంటు భూముల్లో ఏర్పాటుచేయనున్న ఎన్‌ఎండీసీ
1,167 ఎకరాలు...33 ఏళ్లకు లీజు
ఏడాదికి రూ.70 కోట్లు చెల్లింపు
పెల్లెట్లు తయారుచేసి గంగవరం పోర్టు ద్వారా ఎగుమతి
కాలుష్యంపై పరిసర ప్రాంతాల ప్రజల ఆందోళన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
స్టీల్‌ప్లాంటు భూముల్లో ‘నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ (ఎన్‌ఎండీసీ) ఐరన్‌ఓర్ బ్లెండింగ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. బఫర్ స్టాక్‌యార్డుగా పేర్కొంటున్న దీని నిర్మాణ బాధ్యతలను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్)కు అప్పగించింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.2,977 కోట్లు. దీనికి అవసరమైన 1,167 ఎకరాలను స్టీల్‌ప్లాంటు నుంచి ఎన్‌ఎండీసీ 33 ఏళ్లకు లీజుకు తీసుకుంది.
స్టీల్‌ప్లాంటు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎన్‌ఎండీసీ కొంత ఆర్థిక సాయం చేసింది. నగర్‌నార్‌లో ఎన్‌ఎండీసీ స్టీల్‌ప్లాంటు ఏర్పాటుచేయగా, దానికి అవసరమైన సాంకేతిక సహకారం విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు యాజమాన్యమే అందించింది. ఇక్కడ స్టీల్ తయారీకి అవసరమైన ఐరన్‌ఓర్‌ను కొన్ని దశాబ్దాలుగా ఎన్‌ఎండీసీనే సరఫరా చేస్తోంది. రెండు సంస్థల మధ్య అనుబంధం ఉండడంతో ఎన్‌ఎండీసీ బ్లెండింగ్ ప్లాంటుకు కోరినన్ని భూములు స్టీల్‌ప్లాంటు ఇచ్చింది. ఈ భూములు అదానీ గంగవరం పోర్టుకు, స్టీల్‌ప్లాంటుకు మధ్యన ఉండడం గమనార్హం. ఏడాదికి రూ.70 కోట్లు వరకు లీజు మొత్తం నిర్ణయించినట్టు సమాచారం. 2023లోనే దీనిపై ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. అందులో ఐరన్‌ఓర్ డస్ట్‌తో పెల్లెట్లు తయారుచేసే ప్లాంటు పెట్టాలనేది ఆలోచన. ఈ పెల్లెట్లను స్టీల్‌ప్లాంటు ఉపయోగిస్తాయి. ఇక్కడ తయారైన పెల్లెట్లను విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుతో పాటు అనకాపల్లి జిల్లాలో కొత్తగా ఏర్పాటుచేయబోయే ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌కు కూడా అందిస్తారని అప్పట్లో ప్రకటించారు.
అదానీ గంగవరం పోర్టు మరో ఒప్పందం
ఎన్‌ఎండీసీ ఇక్కడ తయారుచేసే పెల్లెట్లను ఎగుమతి చేయడానికి అదానీ గంగవరం పోర్టు బ్రెజిల్‌కు చెందిన వేల్ ఎస్.ఏ.కంపెనీతో ఈ ఏడాది మొదట్లోనే ఒప్పందం చేసుకుంది. ఐరన్ డస్ట్‌ను ఇతర ప్రాంతాల నుంచి కూడా తీసుకువచ్చి, ఇక్కడ బ్లెండింగ్ చేసి, వాటిని భారీ నౌకల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తామని, ఇదంతా గంగవరం పోర్టు ద్వారా జరుగుతుందని ఎన్‌ఎండీసీ వెల్లడించింది.
కాలుష్యం పరిస్థితి ఏమిటి?
విశాఖపట్నం, గంగవరం పోర్టులకు భారీఎత్తున వస్తున్న ఐరన్‌ఓర్ వల్ల ఇప్పటికే విశాఖపట్నం ప్రజలు తీవ్రమైన కాలుష్యం ఎదుర్కొంటున్నారు. దీనిని బల్క్ కార్గోగా వ్యవహరిస్తారు. ఈ కాలుష్యం తగ్గించడానికి బల్క్ కార్గోను శ్రీకాకుళం జిల్లాలో నిర్మిస్తున్న మూలపేట పోర్టుకు తరలిస్తారని, దీనివల్ల విశాఖకు కాలుష్యం ఉండదని ఇటీవలె విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రకటించారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి కూడా ఐరన్‌ఓర్ డస్ట్ (కాలుష్యానికి మూలకారణం...గాలికి ఎగిరేది) తీసుకువచ్చి బ్లెండింగ్ చేస్తామని ప్రతిపాదనను ఇప్పటికే ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించకుండా ప్రాజెక్టు ఎలా చేపడతారని పెదగంట్యాడ, గాజువాక, గంగరం తదితర గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.