Share News

కానరాని పార్కింగ్‌ జోన్‌లు!

ABN , Publish Date - Apr 04 , 2026 | 01:20 AM

ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలపై నగరవాసుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

కానరాని పార్కింగ్‌ జోన్‌లు!

గత్యంతరం లేక రోడ్ల పక్కన వాహనాలు నిలపాల్సిన పరిస్థితి

నో పార్కింగ్‌ ప్రాంతంలో నిలిపారంటూ వెయ్యేసి రూపాయలు

జరిమానా విధిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు

పోలీసుల తీరుపై నగరవాసుల అభ్యంతరం

వాణిజ్య ప్రాంతాల్లో విచ్చలవిడిగా సెల్లార్ల ఆక్రమణలు

వాటిని పార్కింగ్‌కు కేటాయించేలా చూడాలని డిమాండ్‌

ఆ తరువాత జరిమానాలు విధించాలని సూచన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలపై నగరవాసుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. పార్కింగ్‌ స్థలాలను చూపించకుండా నో పార్కింగ్‌ జోన్‌లో వాహనాలను నిలిపారంటూ జరిమానాలు విధిస్తుండడాన్ని తప్పుబడుతున్నారు. నగరంలో నిత్యం రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతాల్లో పార్కింగ్‌కు వినియోగించాల్సిన సెల్లార్లను ఇతర అవసరాలకు వినియోగిస్తున్న భవన యజమానులపై చర్యలు తీసుకోవాల్సిన జీవీఎంసీ, పోలీస్‌ అధికారులు ఆ బాధ్యతను విస్మరించి ప్రజలను ఇబ్బందికి గురిచేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణ పేరుతో ట్రాఫిక్‌ పోలీసులు ఇటీవల కొన్ని చర్యలు తీసుకున్నారు. రోడ్ల పక్కన, నో పార్కింగ్‌ జోన్‌లో వాహనం నిలిపితే రూ.వెయ్యి జరిమానా విధిస్తూ ఈ చలాన్‌ జారీచేస్తున్నారు. గత నాలుగు రోజులుగా వాహనాల యజమానులకు ఎడాపెడా ఈ-చలాన్‌లను పంపిస్తున్నారు. వాస్తవానికి నగరంలో వాణిజ్య సముదాయాలు, షాపింగ్‌ మాల్స్‌లో వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్థలం కేటాయించాలి. ఆయా దుకాణాలకు వచ్చేవారు తమ వాహనాలను సంబంధిత భవనంలో కేటాయించినచోట పార్కింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సౌకర్యం ఉన్నప్పుడు రోడ్లపై వాహనాలను పార్కింగ్‌ చేయాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. నగరంలో వాణిజ్య ప్రాంతాలైన ద్వారకానగర్‌, రామాటాకీస్‌ రోడ్డు, డాబా గార్డెన్స్‌, జగదాంబ జంక్షన్‌, డైమండ్‌ పార్కు ఏరియా, దొండపర్తి వంటి ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, దుకాణాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో రోడ్లు నిత్యం రద్దీగా కనిపిస్తాయి. ఆ ప్రాంతాల్లో దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌, సంస్థలు/కార్యాలయాలు ఉన్న భవనాల్లో సెల్లార్‌లను పార్కింగ్‌కు కాకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. సెల్లార్లను భవన యజమానులు ఆదాయం సమకూరుతుందని ఆశతో అద్దెకు ఇచ్చుకుంటున్నారు. దీనివల్ల వాహనదారులు మరోమార్గంలేక రోడ్ల పక్కనే పార్కింగ్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పార్కింగ్‌ స్థలాలు చూపించి జరిమానా విధించాలని డిమాండ్‌

రోడ్ల పక్కన నిలిపే వాహనాలకు జరిమానా విధించడానికి ముందు పార్కింగ్‌ చేసుకోవడానికి జీవీఎంసీ, పోలీస్‌ అధికారులు స్థలాలు చూపించాలని నగరవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. జగదాంబ కూడలిలో జీవీఎంసీ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా మల్టీలెవెల్‌ కారు పార్కింగ్‌ అందుబాటులోకి తెచ్చింది. అక్కడ వంద కార్లు పార్కింగ్‌ చేసుకునే వీలుంది. అలాగే డైమండ్‌ పార్క్‌ వద్ద జీవీఎంసీ ఆధ్వర్యంలో పెయిడ్‌ పార్కింగ్‌ అందుబాటులో ఉంది. అక్కడ 20 కార్లు, 50 వరకు బైక్‌లు పార్కింగ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఇవికాకుండా సిరిపురం జంక్షన్‌లో కేవలం పార్కింగ్‌ కోసమేనంటూ వీఎంఆర్‌డీఏ ఒక బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మించింది. తర్వాత దీనిని వాణిజ్య అవసరాలకు కేటాయించి కేవలం రెండు అంతస్థులు మాత్రమే పార్కింగ్‌కు కేటాయించారు. అయితే సిరిపురం ప్రాంతంలో పార్కింగ్‌కు డిమాండ్‌ పెద్దగా లేదు కాబట్టి దీనిపై అభ్యంతరాలు వ్యక్తంకాలేదు. వాహన చోదకులకు జరిమానా విధించడానికి ముందు ట్రాఫిక్‌ పోలీసులు ద్వారకా నగర్‌, డాబాగార్డెన్స్‌, రామాటాకీస్‌ సెంటర్‌, జగదాంబ జంక్షన్‌, డైమండ్‌పార్క్‌, దొండపర్తి వంటి ప్రాంతాల్లో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, కార్యాలయాలు/సంస్థలు ఉన్న భవనాల్లో సెల్లార్లను ఖాళీ చేయించి పార్కింగ్‌కు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

Updated Date - Apr 04 , 2026 | 01:20 AM