Share News

అర్హులందరికీ పెట్టుబడి సాయం

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:20 AM

అర్హులైన రైతులందరికీ ‘అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ యోజన’ కింద పెట్టుబడి సాయం అందించడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఈ పథకం కింద ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రూ.20 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం వాటా రూ.6 వేలు వుంటాయి.

అర్హులందరికీ పెట్టుబడి సాయం
రోలుగుంట మండలం జె.నాయుడుపాలెం ఆర్‌ఎస్‌కేలో రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్న వ్యవసాయాధికారి

‘అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ యోజన’ కోసం

ఈ-కేవైసీ, ఆధార్‌, బ్యాంకు ఖాతాలు అనుసంధానం

ఎన్‌పీసీఐతో మ్యాపింగ్‌

గ్రామాల్లో స్పెషల్‌ డ్రైవ్‌

ఇంతవరకు 2,44,542 మంది ఈ-కేవైసీ పూర్తి

4,244 దరఖాస్తులు తిరస్కరణ

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

అర్హులైన రైతులందరికీ ‘అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ యోజన’ కింద పెట్టుబడి సాయం అందించడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఈ పథకం కింద ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రూ.20 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం వాటా రూ.6 వేలు వుంటాయి. అర్హులైన పలువురు రైతులకు గత ఏడాది వివిధ కారణాల వద్ద పెట్టుబడి సాయం అందలేదు. ఈసారి అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందేలా చేయడానికి ప్రభుత్వం నూతన విధానాన్ని అమలుచేస్తున్నది. రైతుల బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ నంబర్‌ అనుసంధానమైతే చాలు అర్హులుగా పరిగణించాలని ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేసిన వెంటనే ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. ఈసారి లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఈ-కేవైసీ, ఆధార్‌, బ్యాంకు ఖాతా నంబర్ల అనుసంధానం, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) మ్యాపింగ్‌ ప్రక్రియలను నిర్వహిస్తున్నారు. బోగస్‌ లబ్ధిదారులను నివారించి, అర్హులైన రైతులకు ఈ పథకం కింద సాయం అందించాలనే ఉద్దేశంతో అధికారులు గ్రామాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తునారు. బ్యాంకు ఖాతాకు, ఆధార్‌ నంబర్‌ లింకు కాని రైతులు 1బీ అడంగల్‌, ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబర్‌తో స్థానిక స్వర్ణ పంచాయతీ/ స్వర్ణ వార్డులో (సచివాలయాలు) దరఖాస్తు చేసుకోవాలి. వీఆర్‌ఓ, తహశీల్దారు నిర్ధారించిన తరువాత అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది.

జిల్లాలో ఇప్పటి వరకు 2,44,542 మంది రైతులు ఈ-కేవైసీ పూర్తి చేయగా, ఇంకా 236 మంది రైతులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నారు. ఇప్పటివరకు అందిన వాటిలో 4,244 దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరించారు. అయితే ఆయా రైతులు తగిన ఆధారాలతో మళ్లీ దరఖాస్తు వేసుకుంటే పునఃపరిశీలించి అర్హులకు పెట్టుబడి సాయం అందేలా చర్యలు చేపట్టినట్టు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పెట్టుబడి సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమకానుండడంతో ఎన్‌పీసీఐ అనుసంధాన ప్రక్రియపైనా దృష్టి సారించారు. ప్రస్తుతం 944 ఖాతాలు ఇనాక్టివ్‌గా ఉన్నాయి. మరో 1,268 ఖతాలకు సంబంధించిన డేటా అందుబాటులో లేదని గుర్తించారు. వీటిని సరిచేసేందుకు బ్యాంకులు, వ్యవసాయ శాఖ, స్వర్ణ పంచాయతీ సబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 2వ తేదీ అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ యోజన మొదటి విడత సాయం నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఈ ఏడాది ఇంకా ముందుగానే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. పెండింగ్‌లో ఉన్న ఈ-కేవైసీ, ఎన్‌పీసీఐ సమస్యలను త్వరగా పరిష్కరించి అర్హుల తుది జాబితాను ఖరారు చేయనున్నట్టు జిల్లా వ్యవసాయాధికారి ఆశాదేవి తెలిపారు.

Updated Date - Jun 13 , 2026 | 12:20 AM