ఆతిథ్య రంగంలో పెట్టుబడుల వెల్లువ
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:57 AM
ఆతిథ్య రంగంలో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి.
జిల్లాలో 15 స్టార్ హోటళ్ల నిర్మాణం
జాబితాలో ఒబెరాయ్, ఐటీసీ, హయత్, హిల్టన్, లెమన్ ట్రీ...
అన్నీ పూర్తయితే కొత్తగా 2,532 రూమ్‌లు అందుబాటులోకి
పర్యాటక రంగానికి ఊపు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఆతిథ్య రంగంలో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో పరిశ్రమలు పెద్దఎత్తున ఏర్పాటవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. వాటి వ్యాపార అవసరాలను తీర్చేందుకు, ఇక్కడికి వచ్చే పర్యాటకులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రముఖ సంస్థలు స్టార్ హోటళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. దాదాపు 15 కొత్త స్టార్ హోటళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. కొన్ని ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకోగా, మరికొన్ని సగం పనులు పూర్తయ్యాయి. ఇంకొన్ని శంకుస్థాపనలు చేసుకున్నాయి. ఇవన్నీ పూర్తయితే కొత్తగా 2,532 అత్యాధునిక వసతులు కలిగిన రూమ్‌లు అందుబాటులోకి వస్తాయి.
విశాఖలోని స్టార్ హోటళ్లలో ప్రస్తుతం 1,800 రూమ్‌లు ఉన్నాయి. ఆ తరువాత స్థాయి హోటళ్లను కూడా కలుపుకుంటే మొత్తం 2,500 రూమ్‌లు అందుబాటులో ఉన సాధారణ రోజుల్లో 68 నుంచి 70 శాతం ఆక్యుపెన్సీ ఉంటోంది. అదే పెళ్లిళ్ల సీజన్, సీఐఐ పెట్టుబడిదారుల సదస్సు, నేవీ కార్యక్రమాలు వంటివి జరిగినప్పుడు వీవీఐపీలకు కూడా రూమ్‌లు లభించడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యాటకం అభివృద్ధి చెందేలా కొత్త హోటళ్ల నిర్మాణం జరగాలని, పెట్టుబడిదారులను ఆకర్షించాలని అధికారులకు ఆదేశించారు. దాంతో పరిశ్రమల శాఖాధికారులు, జిల్లా కలెక్టర్, వీఎంఆర్‌డీఏ కలిసి వ్యాపారవేత్తలకు అనుకూలమైన భూములు చూపించారు. ప్రభుత్వం రాయితీలు ఇవ్వడానికి అంగీకరించింది. దాంతో చాలామంది ఒప్పందాలు చేసుకున్నారు.
- ఆర్కే బీచ్‌రోడ్డులో గల తాజ్ హోటల్‌ను వరుణ్ గ్రూపు తీసుకుని అక్కడ రూ.900 కోట్లతో స్టార్ హోటల్‌తో పాటు సర్వీస్ అపార్టుమెంట్ నిర్మాణం చేపట్టింది. ఇక్కడ ఐటీ సంస్థలకు కూడా ఆఫీస్ స్పేస్ లభిస్తుంది.
- భోగాపురం విమానాశ్రయంలోనే తాజ్ వివంతా హోటల్ నిర్మాణం దాదాపు పూర్తయ్యిది. మొత్తం 156 రూమ్‌లు ఉన్నాయి. ఇది అక్టోబరులో ప్రారంభం కానుంది. విమానాశ్రయంలో దిగిన వారు విశాఖ వరకు రాకుండా అక్కడే బస చేయొచ్చు.
- ఒబెరాయ్ గ్రూపు భీమిలి మండలం అన్నవరంలో 42 ఎకరాల్లో రూ.350 కోట్ల పెట్టుబడితో 300 లగ్జరీ విల్లాలు నిర్మిస్తోంది. ఇది బీచ్ రిసార్ట్‌గా రూపుదిద్దుకుంటోంది.
- వెస్టిన్ హోటళ్లతో లైలా గ్రూపు ఒప్పందం చేసుకొని రుషికొండ ఐటీ పార్కు సమీపాన రూ.405 కోట్లతో 716 రూమ్‌లతో స్టార్ హోటల్ నిర్మిస్తోంది. ఇందులో మొదటి దశలో 300 రూమ్‌లు అందుబాటులోకి వస్తాయి.
- భీమిలి మండలం అన్నవరంలోనే మేఫెయిర్ సంస్థ రూ.400 కోట్లతో 40 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్, హోటల్ నిర్మిస్తోంది.
- విశాఖ నగర నడిబొడ్డున సిరిపురం జంక్షన్‌లో ఐటీసీ కంపెనీ రూ.328 కోట్లతో ఏడు నక్షత్రాల హోటల్ నిర్మిస్తోంది. అందులో 200 రూమ్‌లు ఉంటాయి.
- రాడీసన్ హోటల్ యాజమాన్యం పెదగంట్యాడలో ఏపీ మెడ్‌టెక్ జోన్‌లో రూ.100 కోట్లతో స్టార్ హోటల్ నిర్మిస్తోంది.
- భీమిలి సమీపాన కొత్తవలసలో శారదాపీఠం నుంచి వెనక్కి తీసుకున్న భూమిని ప్రభుత్వం మైరా గ్రూపునకు అప్పగించింది. అందులో రూ.196 కోట్లతో స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టారు.
- మధురవాడలో హిల్టన్ గార్డెన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ సంస్థ 250 రూమ్‌లతో స్టార్ హోటల్ నిర్మిస్తోంది.
- ఎండాడ ప్రాంతంలో హయత్ సెంట్రిక్ 200 రూమ్‌లతో స్టార్ హోటల్ నిర్మిస్తోంది.
- వీ హోటల్ గ్రూపు లెమన్ ట్రీతో ఒప్పందం చేసుకొని రుషికొండలో 100 రూమ్‌లతో స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టనుంది.
- రుషికొండలో క్రౌన్ ప్లాజా 152 రూమ్‌లతో స్టార్ హోటల్ నిర్మాణానికి అనుమతులు తీసుకుంది.