Share News

పెట్టుబడుల జాతర

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:57 AM

ఆనందపురం మండలం గంభీరంలో గల ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లో బుధవారం సీఐఐ, ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన ఉత్తరాంధ్ర ప్రాంతీయ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కళకళలాడింది.

పెట్టుబడుల జాతర

  • రూ.21,498 కోట్ల పెట్టుబడులతో 31 ఎంవోయూలు

  • 33 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

  • 56,945 మందికి ఉపాధి అవకాశాలు

  • శ్రీకాకుళంలో విమానాశ్రయానికి లైన్‌ క్లియర్‌

  • అనకాపల్లిలో మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌

  • భోగాపురంలో 800 ఎకరాల్లో ఏరో సిటీ

  • విశాఖలో భారీ కన్వెన్షన్‌ సెంటర్‌

  • విశాఖ రీజియన్‌ నుంచే 50 శాతం పర్యాటక ఆదాయం

  • ప్రాంతీయ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సులో వక్తలు

విశాఖపట్నం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి):

ఆనందపురం మండలం గంభీరంలో గల ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లో బుధవారం సీఐఐ, ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన ఉత్తరాంధ్ర ప్రాంతీయ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కళకళలాడింది. ఇందులో 31 సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటి ద్వారా రూ.21,498 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 56,945 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే గతంలో చేసుకున్న ఒప్పందాల్లో 33 ప్రాజెక్టులకు రూ.3,518.73 కోట్లతో ఇదే ప్రాంగణంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, టీజీ భరత్‌, బీసీ జనార్దన్‌రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటి ద్వారా 9,449 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇది నవంబరులో జరిగే ప్రధాన పెట్టుబడిదారుల సదస్సుకు తొలి అడుగుగా నిలిచింది.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు సదస్సుకు హాజరై కొత్త కబురు వినిపించారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేయబోయే విమానాశ్రయానికి అవసరమైన భూమికి ప్రభుత్వం క్లియరెన్స్‌ ఇచ్చిందని వెల్లడించారు. విమానాశ్రయాలు కేవలం రాకపోకలకు కనెక్టివిటీ అందించడమే కాకుండా ఆ ప్రాంతం మినీ ఎకానమీ సిటీగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడతాయన్నారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల శాఖా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, విశాఖలో సరకు రవాణాకు అవసరమైన మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌లు రెండు ఉండగా అనకాపల్లిలో మరొకటి ఏర్పాటుచేయడానికి అధ్యయనం జరుగుతోందని ప్రకటించారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న అనకాపల్లికి ఇది మరో కొత్త వరం కానుందన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ ప్రసంగిస్తూ భోగాపురంలో 800 ఎకరాల్లో జీఎంఆర్‌ ఏరో సిటీ అభివృద్ధి చేస్తున్నారని, దీనివల్ల మరిన్ని ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ అందుబాటులోకి వస్తాయన్నారు. విశాఖపట్నం కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ మాట్లాడుతూ విశాఖలో అతి పెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌ ఏపీఐఐసీ ద్వారా నిర్మించబోతున్నామని, ఎలాంటి సదస్సులైనా అక్కడ నిర్వహించుకోవచ్చునన్నారు. భీమిలి బీచ్‌రోడ్డులో యూనిటీ మాల్‌లో కూడా మరో కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం అవుతుందన్నారు. శ్రవణ్‌ షిప్పింగ్‌ అధినేత జి.సాంబశివరావు మాట్లాడుతూ, మొదట భీమిలిలో పోర్టు వ్యాపారం జరిగేదని, దానిని విశాఖపట్నం మార్చిన తరువాత స్టీల్‌ ప్లాంటు, ఫార్మాసిటీ వంటి అనేక పరిశ్రమలు వచ్చాయన్నారు. ఇప్పుడు నౌకా నిర్మాణం కూడా ఊపందుకుందన్నారు. పర్యాటక రంగం పెరుగుతోందని, రాష్ట్రానికి ఒక్క విశాఖపట్నం రీజియన్‌ ద్వారానే 50 శాతం ఆదాయం వస్తోందన్నారు. ఫ్లూయింట్‌ గ్రిడ్‌ అధిపతి, సీఐఐ రాష్ట్ర అధ్యక్షుడు గన్నమనేని మురళీకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో తొలి సెమీ కండక్టర్‌ పరిశ్రమ తర్లువాడలో ఏర్పాటవుతుందన్నారు. వ్యాపారాన్ని క్లస్టర్ల వారీగా నిర్వహించడం వల్ల నిర్వహణ వ్యయం తగ్గుతుందన్నారు. ఏఐ ద్వారా ఉద్యోగాలు పోవని, ఆ ఉద్యోగాలకు ఎలివేషన్‌ వస్తుందని నిపుణులు చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో వివిధ వ్యాపారాల కోసం 23 క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటుచేసిందన్నారు. గంభీరం ఐఐఎం డైరక్టర్‌ చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో రూ.475 కోట్ల విలువైన ప్రాంగణం నిర్మించుకోగలిగామన్నారు. ఇప్పటివరకు 210 స్టార్టప్‌లకు ఇంకుబేషన్‌ సౌకర్యం కల్పించామన్నారు. ఐఏఎస్‌లకు కూడా తాము శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు శ్రీభరత్‌, కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్‌రాజు, లోకం మాధవి, నడుకుర్తి ఈశ్వరరావులు పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా 25 ఎంఎస్‌ఎంఈలతో ఏర్పాటు చేసిస ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంటుంది. పొందూరు ఖాదీ, మాడుగుల హల్వా, అనేక సాంకేతిక ప్రదర్శనలు సందర్శకులకు ఆసక్తి కలిగించాయి.

ఎగ్జిబిషన్‌లో 25 స్టాళ్లు

జిల్లాలోని ఆనందపురం మండలం గంభీరంలో గల ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లో బుధవారం సీఐఐ, ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులో వివిధ రంగాలకు చెందిన 25 సంస్థలు తమ స్టాల్స్‌ ఏర్పాటుచేశాయి. ఎగ్జిబిషన్‌లో జామి హైడ్రాలిక్‌ ప్రైవేటు లిమిటెడ్‌, జుహి మెటలార్జికల్‌ ల్యాబ్‌, డెంటలిజెంట్‌ డెంటల్‌ సొల్యూషన్స్‌, పీబీ మానుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ, సెమాపి ఇనుస్ర్టుమెంట్స్‌, అక్రివిస్‌ హెల్త్‌ కేర్‌, ఓషనాటిక్స్‌, పీలూన్‌ అగ్రి ఫ్రెష్‌, మనం మన్యం ప్రొడ్యూసర్స్‌ కంపెనీ, అవని ఆర్గానిక్స్‌, విన్‌విన్‌ స్పెషాలిటీ ఇన్సులేటర్స్‌ వంటి సంస్థలు తమ ఉత్పత్తులు, సాంకేతికత, సేవలను ప్రదర్శించాయి. అరకు కాఫీ, పొందూరు ఖాదీ, మాడుగుల హల్వా, ఏపీ వుడెన్‌ టాయ్స్‌ వంటి స్థానిక ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్‌ కూడా ఏర్పాటుచేశారు.

కేంద్ర మంత్రి సందర్శన

ఎగ్జిబిషన్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు సందర్శించారు. స్టాళ్లలో ప్రదర్శించిన ఉత్పత్తులు, ఆవిష్కరణల గురించి ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రులు టీజీ భరత్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌ ఉన్నారు. స్టాల్స్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.


ప్రజల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

గడిచిన రెండేళ్లలో రూ.22.6 లక్షల కోట్ల విలువైన 714 ప్రాజెక్టులకు ప్రణాళికలు

175 ఎంఎస్‌ఎంఈ పార్కులు, క్లస్టర్‌ ఆధారిత పారిశ్రామిక కారిడార్లు,

సెక్టోరియల్‌ పార్కులను అభివృద్ధి చేస్తున్నాం

పరిశ్రమల మంత్రి టీజీ భరత్‌

విశాఖపట్నం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి):

ప్రజల జీవితాల్లో ఆర్థికాభివృద్ధి కనిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే పెట్టుబడిదారులకు చేయూత అందిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖల మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు. గంభీరంలోని ఐఐఎంలో బుధవారం జరిగిన ప్రాంతీయ పెట్టుబడుల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎంవోయూలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. 2024 జూన్‌ నుంచి ఇప్పటి వరకూ రూ.22.6 లక్షల కోట్ల విలువైన 714 ప్రాజెక్టులకు ప్రణాళికలను సిద్ధం చేసినట్టు వెల్లడించారు. వాటి ద్వారా 9.3 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఇప్పటికే ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన 257 ప్రాజెక్టులు గ్రౌండింగ్‌ స్థాయి కి చేరుకుంటున్నాయని, కొద్దినెలల్లో మరిన్ని ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయన్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఫోర్బ్స్‌ నివేదికల ప్రకారం భారతదేశంలో ప్రతిపాదిత పెట్టుబడుల్లో 25.3 శాతం ఏపీకే వచ్చాయన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నుంచి స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ వైపు అడుగులు వేయడం గురించి సీఎం మాట్లాడుతుంటారని, ఇది పెట్టుబడిదారులకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంద న్నారు. పెట్టుబడిదారులు, మంత్రులు, ఉన్నతాధికారులతో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామన్నారు. నక్కపల్లి వద్ద ఆర్సెల్లార్‌ మిట్టల్‌ స్టీల్‌ దాదాపు రూ.1.35 లక్షల కోట్ల వ్యయంతో 18 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 55 వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా భారీ ప్రాజెక్టు అభివృద్ధికి శ్రీకారం చుట్టిందన్నారు. గూగుల్‌ సంస్థ 15 బిలియన్‌ డాలర్లతో ఒక గిగావాట్‌ ఏఐ హబ్‌ను, రిలయన్స్‌ సంస్థ 17 బిలియన్‌ డాలర్లతో 1.5 గిగావాట్‌ ఏఐ క్లస్టర్‌ను నిర్మిస్తున్నాయని, 2030 నాటికి డేటా సెంటర్ల సామర్థ్యం 6.5 గిగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్టు మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. విశాఖపట్నం బలాలు, భవిష్యత్తును కలిగిన మొదటి గ్లోబల్‌ నగరంగా ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. నవంబరు 12, 13 తేదీల్లో 31వ సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ కోసం ప్రపంచం తిరిగి విశాఖకు రానుందన్నారు. సదస్సు కోసం మాత్రమే కాకుండా, ప్రాజెక్టుతో, ఆలోచనతో వచ్చి, తమ వేగాన్ని పరీక్షించాలన్నారు. రాబోయే 20 ఏళ్లపాటు భాగస్వాములుగా ఉండే వారి కోసం చూస్తున్నామని పిలుపునిచ్చారు. సదస్సులో కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఎంపీలు ఎం.శ్రీభరత్‌, కలిశెట్టి అప్పలనాయుడు, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు ఎన్‌.యువరాజ్‌, ఎస్‌ఎస్‌ రావత్‌, కాటంనేని భాస్కర్‌, సీఐఐ చైర్మన్‌ నరేంద్రకుమార్‌, సీఈవో షన్మోహన్‌, విశాఖ జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, పలువురు కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఉత్తరాంధ్రకు రూ.21,500 కోట్ల పెట్టుబడులు

విశాఖ ఎంపీ శ్రీభరత్‌

సమావేశంలో పాల్గొన్న విశాఖ ఎంపీ శ్రీభరత్‌ మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు ఈ ప్రాంతీయ సదస్సులో 31 ఎంఓయూల ద్వారా రూ.21,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. అదేవిధంగా 33 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామన్నారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రావడానికి ఈ సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం

విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు

సమావేశంలో పాల్గొన్న విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ, ఈ ప్రాంతీయ సదస్సు పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపిందన్నారు. ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, అధికారులు అంతా ఒక వేదికపైకి రావడం వల్ల సమన్వయం పెరిగిందన్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్నివిధాలుగా సహకారం అందిస్తున్నదన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ సెక్రటరీ యువరాజ్‌, సీఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రాంతీయ పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకున్న ఎంఓయూలు

------------------------------------------------------------------------------------------

నం. సంస్థ పేరు ప్రాంతం పెట్టుబడి కోట్లలో ఉపాధి అవకాశాలు

------------------------------------------------------------------------------------------

1.హిమాద్రీ స్పెషాలిటీ కెమికల్స్‌ అనకాపల్లి రూ.5,000 కోట్లు 11,000

2. గ్రాన్యుల్స్‌ ఇండియా లిమిటెడ్‌ అనకాపల్లి రూ.4,000 కోట్లు 2,600

3. రెన్యూ ఫొటోవోల్టాక్స్‌ ప్రై.లి. అనకాపల్లి రూ.1,500 కోట్లు 1,300

4. స్ర్పే ఇంజనీరింగ్‌ డివైజెస్‌ లి. అనకాపల్లి రూ.400 కోట్లు 1,000

5. వీ ఇమేజింగ్‌ సొల్యూషన్స్‌ అనకాపల్లి రూ.150 కోట్లు 60

6. సుందర్‌ స్టీల్‌ ఇండస్ట్రీస్‌ అనకాపల్లి రూ.75 కోట్లు 750

7. ప్రగతి డెయిరీ శ్రీకాకుళం రూ.100 కోట్లు 600

8. పాంచజన్య ఫుడ్‌ ప్రొడక్ట్సు శ్రీకాకుళం రూ.20 కోట్లు 150

9. అలకారం ఇంటర్నేషనల్‌ ట్రేడింగ్‌ విశాఖపట్నం రూ.650 కోట్లు 5,000

10. ఎంటీఎక్స్‌ ఇన్‌ఫ్రా విశాఖపట్నం రూ.300 కోట్లు 3,500

11. గుప్తా ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ కనస్ట్రక్షన్స్‌ విశాఖపట్నం రూ.276 కోట్లు 2,050

12. సీఎంఆర్‌ టెక్స్‌టైల్స్‌ అండ్‌ జ్యువెలర్స్‌ విశాఖపట్నం రూ.216 కోట్లు 900

13. విన్‌ రైస్‌ రిట్రీట్స్‌ విశాఖపట్నం రూ.140 కోట్లు 450

14. ఎస్‌జీ కార్పొరేట్స్‌, మెఘా ప్రాసెసింగ్‌ విశాఖపట్నం రూ.100 కోట్లు 715

15. స్వీట్‌ ఇండియా విశాఖపట్నం రూ.75 కోట్లు 275

16. కియాన్‌ బ్లెండర్స్‌ విజయనగరం రూ.400 కోట్లు 3,000

17. ఏఎస్‌జీ ఇన్‌ఫ్రా అండ్‌ డెవలపర్స్‌ విజయనగరం రూ.125 కోట్లు 450

18. ది వేలీ గ్రీన్‌ కన్వెన్షన్‌ విజయనగరం రూ.120 కోట్లు 200

19. ఎస్‌ఎంఎస్‌ కొలాబ్‌ విజయనగరం రూ.1,072 కోట్లు 1,275

20. సబురి ఇంజినీర్డ్‌ వుడ్‌ ప్యానల్స్‌ విజయనగరం రూ.490 కోట్లు 1,400

21. గిన్ని రిఫ్రాక్టరీస్‌ విజయనగరం రూ.31 కోట్లు 310

22. భారత్‌ టెంట్స్‌ విజయనగరం రూ. 30 కోట్లు 150

23. ఓఎఫ్‌బీ టెక్‌ లిమిటెడ్‌ అనంతపురం రూ.200 కోట్లు 4,000

24. ఒరియానా పవర్‌ లిమిటెడ్‌ కర్నూలు రూ.,4500 కోట్లు 2,500

25. సాచేటి హాస్పిటాలిటీ నంద్యాల రూ.105 కోట్లు 1,000

26. ఎస్‌కేఐకార్ప్‌ మార్కెటింగ్‌ అన్నమయ్య రూ.129 కోట్లు 3,826

27. బూ యంగ్‌ ఎస్‌కేఐకార్ప్‌ అన్నమయ్య రూ.104 కోట్లు 2,532

28. కాఫ్‌ ఇండియా ప్రై.లి. తిరుపతి రూ.600 కోట్లు 152

29. టిన్న రబ్బర్‌ అండ్‌ ఇన్‌ఫ్రా తిరుపతి రూ.250 కోట్లు 4,700

30. బ్రిటానియా ఇండస్ట్రీస్‌ చిత్తూరు రూ.225 కోట్లు 800

31. వెన్సారా హాస్పిటాలిటీ అనంతపురం రూ.115 కోట్లు 300

మొత్తం రూ.21,498 కోట్లు 56,945

Updated Date - Oct 08 , 2026 | 12:57 AM