Share News

ఉపమాక ఆలయంలో చోరీపై దర్యాప్తు ముమ్మరం

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:52 AM

ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన చోరీ కేసును ఛేదించేందుకు పోలీస్‌ యంత్రాంగం దర్యాప్తు వేగవంతం చేసింది. ఆలయంలో దొంగతనం జరిగి రెండు రోజులు కావస్తున్నప్పటికీ బలమైన క్లూ లభించలేదు. మరో వైపు హోం మంత్రి అనిత కూడా ఈ విషయమై ఆరా తీస్తున్నారు. ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకోవడానికి ఎస్పీ తుహిన్‌ సిన్హా ఐటీతోపాటు ఆరు బృందాలను నియమించారు.

ఉపమాక ఆలయంలో చోరీపై దర్యాప్తు ముమ్మరం
ఉపమాక ఆలయంలో సీఐ, ఎస్‌ఐలతో చర్చిస్తున్న డీఎస్పీ పి.శ్రీనివాసరావు

ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు

ఆలయంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీల పరిశీలన

విధుల నుంచి ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది తొలగింపు

నక్కపల్లి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన చోరీ కేసును ఛేదించేందుకు పోలీస్‌ యంత్రాంగం దర్యాప్తు వేగవంతం చేసింది. ఆలయంలో దొంగతనం జరిగి రెండు రోజులు కావస్తున్నప్పటికీ బలమైన క్లూ లభించలేదు. మరో వైపు హోం మంత్రి అనిత కూడా ఈ విషయమై ఆరా తీస్తున్నారు. ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకోవడానికి ఎస్పీ తుహిన్‌ సిన్హా ఐటీతోపాటు ఆరు బృందాలను నియమించారు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐలు జె.మురళీ, రామకృష్ణ, క్రైం విభాగం టీమ్‌, ఎస్‌ఐలు సన్నిబాబు, విజయ్‌, అంజుమా తదితరుల నేతృత్వంలో ఈ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఆలయ పరిసరాల్లో వున్న మొబైల్‌ టవర్ల పరిధిలో కొత్తగా నమోదైన ఫోన్‌ నంబర్లను గుర్తించే పనిలో ఐటీ బృందం నిమగ్నమై వుంది. దొంగతనం చేయడానికి ముందు ఆలయంలో, పరిసరాల్లో రెక్కీ నిర్వహించి వుంటారనే ఉద్దేశంతో మూడు రోజుల ముందు ఆలయంలో, పరిసరాల్లో, నక్కపల్లి నుంచి ఆలయానికి వచ్చే మార్గంలో వివిధచోట్ల వున్న సీసీ కెమెరాల ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. చోరీకి పాల్పడిన ఇద్దరిలో ఒక వ్యక్తి సన్నగా వుండి, కాళ్లకు తెలుపు రంగు చెప్పులు వేసుకోవడంతో అటువంటి వ్యక్తులు ముందుగా ఆలయంలోకి వచ్చి వుంటారా? అనే కోణంలో సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరోవైపు చోరీకి పాల్పడిన తరువాత వెండి, బంగారు వస్తువుల మూటను ఆలయం వెనుక వున్న తోటలో ఎందుకు వదిలేశారు? అన్నదానిపైనా ఆరా తీస్తున్నారు. హుండీల్లోని సొమ్మునంతా తీసుకెళ్లకుండా దాదాపు రూ.28 వేల నగదు, నాణేలను వాటిల్లోనే వదిలేశారు. కాగా నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు గురువారం మధ్యాహ్నం ఉపమాక వచ్చారు. ఆలయాన్ని పరిశీలించి సీఐలు జె.మురళీ, ఎల్‌.రామకృష్ణ, ఎస్‌ఐలతో మాట్లాడారు.

సెక్యూరిటీ సిబ్బంది విధుల నుంచి తొలగింపు

ఉపమాక ఆలయంలో దొంగతనం జరిగిన రోజు రాత్రి సెక్యూరిటీ విధులు నిర్వహించిన ఇద్దరిని ఉద్యోగాల నుంచి తొలగించినట్టు టీటీడీ అనుబంధ దేవాలయాల సూపరింటెండెంట్‌ వెంకట రమణ గురువారం వెల్లడించారు. చెప్పారు. శ్రీలక్ష్మీ శ్రీనివాసా మ్యాన్‌ పవర్‌ కార్పొరేషన్‌ సంస్థ ఎం.చంద్రరావు, ఎన్‌.లక్ష్మణరావు అనే ఉద్యోగులను కాంట్రాక్టు పద్ధతిలో ఉపమాక ఆలయంలో సెక్యూరిటీ సిబ్బందిగా నియమించింది.

ఉపమాక క్షేత్రంపై టీటీడీ చిన్నచూపు

బంగారం, వెండి కానుకలను భద్రపర్చడంలో తీవ్రనిర్లక్ష్యం

జిల్లాలో అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఉపమాక వెంకన్న ఆలయంపై టీటీడీ అధికారులు చిన్నచూపు చూస్తున్నారనే భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తులు సమర్పించే వెండి, బంగారం వంటి కానుకలకు సరైన భద్రత కల్పించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా హుండీలు తెరిచినప్పుడు వాటిలో భక్తులు సమర్పించిన వెండి, బంగారం వస్తువులను ఆలయ గర్భగుడిలో వున్న హుండీల్లో భద్రపర్చాలి. కానీ గర్భగుడి వెలుపల తగిన రక్షణ లేని హుండీల్లో వుంచడంపై భక్తులు మండిపడుతున్నారు. టీటీడీకి అప్రతిష్ఠ తెచ్చే విధంగా అధికారుల తీరు వుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భక్తులు సమర్పించిన ఆభరణాలు ఏ హుండీలో వున్నాయని ఆలయ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న టీటీడీ ఇన్‌స్పెక్టర్‌ను బుధవారం పోలీసులు ప్రశ్నించగా, ఏ హుండీయో తెలియదని చెప్పడనం గమనార్హం. భవిష్యత్తులో ఉపమాక ఆలయంలో మరోసారి చోరీ జరగకుండా భద్రత, రక్షణ చర్యలను పటిష్ఠం చేయాలని భక్తులు కోరుతున్నారు.

Updated Date - Jun 05 , 2026 | 12:52 AM