నకిలీ నియామకాలపై విచారణ షురూ
ABN , Publish Date - Aug 05 , 2026 | 01:00 AM
ప్రభుత్వ పాఠశాలలు, వ్యవసాయశాఖలో ఉద్యోగాల పేరిట రూ.లక్షలు తీసుకుని నకిలీ నియామక పత్రాలతో నియమించిన ప్రైవేటు వ్యక్తులపై చర్యలకు పోలీసు అధికారులు ఉపక్రమించారు. అక్రమ నియామకాల దందా వెనుక పాత్రధారులు, సూత్రధారులపై జీకే వీధి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ నియామక పత్రాల వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘నకిలీలలపై చర్యలేవి’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ నిషాంతి, ఎస్పీ అమిత్‌బర్దార్ స్పందించారు. దీనిపై దర్యాప్తు చేయాలని చింతపల్లి డీఎస్పీ సీహెచ్ తిరుపతిరావును ఆదేశించారు. ఈ నేపథ్యంలో జీకే వీధి పోలీసులు విచారణ చేపడుతున్నారు.
- గిరిజన నిరుద్యోగులను బురిడీ కొట్టించిన పాత్రధారులు, సూత్రధారులపై ఆరా
- ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందించిన కలెక్టర్, ఎస్పీ
- డీఎస్పీ ఆదేశాలతో జీకే వీధి పోలీసుల దర్యాప్తు
చింతపల్లి/గూడెంకొత్తవీధి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, వ్యవసాయశాఖలో ఉద్యోగాల పేరిట రూ.లక్షలు తీసుకుని నకిలీ నియామక పత్రాలతో నియమించిన ప్రైవేటు వ్యక్తులపై చర్యలకు పోలీసు అధికారులు ఉపక్రమించారు. అక్రమ నియామకాల దందా వెనుక పాత్రధారులు, సూత్రధారులపై జీకే వీధి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ నియామక పత్రాల వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’లో ‘నకిలీలలపై చర్యలేవి’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనానికి కలెక్టర్ నిషాంతి, ఎస్పీ అమిత్‌బర్దార్ స్పందించారు. దీనిపై దర్యాప్తు చేయాలని చింతపల్లి డీఎస్పీ సీహెచ్ తిరుపతిరావును ఆదేశించారు. ఈ నేపథ్యంలో జీకే వీధి పోలీసులు విచారణ చేపడుతున్నారు.
గూడెంకొత్తవీధి మండలంలో పలు ప్రభుత్వ, గిరిజన సంక్షేమశాఖ, మండల పరిషత్, ఆశ్రమ పాఠశాలల్లో సమగ్ర శిక్ష, భారత్ సేవక్ సమాజ్ పేరిట వలంటీర్లు, టీచర్లు, అటెండర్లు, హెల్త్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, క్లర్కు, వాచ్‌మన్‌లుగా నియమిస్తూ విశాఖపట్నానికి చెందిన సత్య విజయ్‌కుమార్ నకిలీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గిరిజన నిరుద్యోగుల నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు తీసుకుని నకిలీ నియామక పత్రాలు ఇచ్చిన విషయమై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలను ప్రచురించింది. ఆరు నెలలుగా పాఠశాలల్లో పని చేసినా జీతాలు రాకపోవడం, సత్య విజయ్‌కుమార్ జారీ చేసిన ఉత్తర్వులు నకిలీవని అధికారులు ప్రకటించడంతో గిరిజన నిరుద్యోగ యువత మోసపోయామని గుర్తించారు. దీంతో నియామక పత్రాలు ఇచ్చిన సత్య విజయ్‌కుమార్‌ను బాధితులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పడం, ఫోన్‌కు స్పందించకపోవడంతో ‘ఆంధ్రజ్యోతి’ని ఆశ్రయించారు.
బాధితుల నుంచి వివరాలు సేకరించిన డీఎస్పీ
కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు చింతపల్లి డీఎస్పీ సీహెచ్ తిరుపతిరావు మంగళవారం గూడెంకొత్తవీధి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. బాధిత గిరిజన నిరుద్యోగులతో మాట్లాడారు. సత్య విజయ్‌కుమార్ ఏ విధంగా పరిచయమయ్యాడు?, ఎక్కడకు వెళ్లి నగదు చెల్లించారు?, ఉత్తర్వులు ఏ విధంగా అందజేశారని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు కలెక్టర్, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వస్తాయని, మధ్యవర్తులతో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరగవని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరు చెప్పినా నమ్మవద్దని, మధ్యవర్తులకు నగదు ఎవరూ చెల్లించవద్దని ఆయన తెలిపారు. కాగా సత్య విజయ్‌కుమార్ నుంచి తాము చెల్లించిన నగదును ఇప్పించాలని బాధిత గిరిజన నిరుద్యోగులు డీఎస్పీని అభ్యర్థించారు. దీంతో బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక సీఐ సుధాకర్‌ను డీఎస్పీ ఆదేశించారు.
ప్రధానోపాధ్యాయులు ఎలా అనుమతించారు?
జిల్లా విద్యాశాఖ, గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్, ఐటీడీఏ పీవోకు సంబంధం లేని ప్రైవేటు వ్యక్తి జారీ చేసిన నకిలీ ఉత్తర్వులను ఆశ్రమ, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎలా అనుమతించారనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. సాధారణంగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వశాఖలో ఉద్యోగిగా నియమించేందుకు కలెక్టర్, సంబంధితశాఖ జిల్లా స్థాయి అధికారి ఉత్తర్వులు ఉండాలి. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రైవేటు వ్యక్తి జారీ చేసిన నకిలీ ఉత్తర్వులను స్వీకరించి జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వకుండా నెలల తరబడి పాఠశాలల్లో ఏ విధంగా పనులు చేయించారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ వ్యవహారంలో ఉద్యోగుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
మధ్యవర్తులపై ఆరా
నకిలీ నియామకాల దందాలో సత్య విజయ్‌కుమార్‌కు సహకరించిన స్థానిక మధ్యవర్తులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల కోడ్, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల వివరాలను సత్య విజయ్‌కుమార్‌కి ఎవరు చేరవేసి ఉంటారు?, గిరిజన నిరుద్యోగ యువతను అతనికి పరిచయం చేసింది ఎవరు?, మధ్యవర్తుల పాత్ర ఎంత వరకు ఉంది?, నగదు చెల్లింపుల్లో మధ్యవర్తులు ఎంత కమీషన్ తీసుకున్నారు? అనే విషయాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.