నత్తనడకన అంతర్రాష్ట్ర రహదారి పనులు
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:24 PM
జీకేవీధి నుంచి సీలేరు మీదుగా చేపడుతున్న పాలగెడ్డ అంతర్రాష్ట్ర రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి.
జీకే వీధి- పాలగెడ్డ మార్గంలో మెటల్ వేసి రోలింగ్ చేయని వైనం
వాహనదారుల ఇబ్బందులు
పట్టించుకోని అధికారులు
సీలేరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి నుంచి సీలేరు మీదుగా చేపడుతున్న పాలగెడ్డ అంతర్రాష్ట్ర రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. జీకేవీధి నుంచి సీలేరు మీదుగా పాలగెడ్డ అంతర్రాష్ట్ర రహదారి మీదుగా నిత్యం ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి గత ఏడాది భారీ తుఫాన్ ప్రభావంతో జీకేవీధి నుంచి సీలేరు మధ్యలో రహదారిపై ఎక్కడికక్కడ కొండచరియలు జారిపడి గోతులమయమైంది. ఈ రహదారిలో ప్రయాణించే ఆర్టీసీ బస్సులు, లారీలు, కార్లు, ఇతర వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం రూ.8.7 కోట్లు గత ఏడాది కేటాయించినప్పటికీ ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా టెండర్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగింది. ఆ తరువాత పనులు ప్రారంభించినా నత్తనడకన సాగుతున్నాయి. ఆర్వీనగర్ నుంచి నూతిబంద వరకు ఒక రీచ్‌గా, రెయిన్‌గేజ్ నుంచి ధారాలమ్మ ఆలయం వరకు రెండో రీచ్‌గా, మూడవ రీచ్‌గా సీలేరు నుంచి పాలగెడ్డ వరకు 13 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. అయితే గత నాలుగు నెలల క్రితమే రీచ్ వన్‌లో పనులను ప్రారంభించినప్పటికీ మధ్యలోనే నిలిపివేశారు. డిసెంబరు నెలాఖరు నుంచి మళ్లీ పనులను ప్రారంభించినప్పటికీ వేగవంతంగా నిర్వహించడం లేదని, లంకపాకల నుంచి జీకేవీధి మధ్యలో ఎక్కడికక్కడ మెటల్ వేసి రోలర్‌తో రోలింగ్ చేయకుండా వదిలేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులు స్పందించి ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.