Share News

కాఫీ పండ్లకు అంతర్జాతీయ ధరలు

ABN , Publish Date - Nov 19 , 2026 | 12:36 AM

ఆదివాసీ రైతులు పండించిన కాఫీ పండ్లకు అంతర్జాతీయ ధరలు అందిస్తున్నామని గిరిజన సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి డి.మురళీధర్‌ రెడ్డి తెలిపారు.

కాఫీ పండ్లకు అంతర్జాతీయ ధరలు
ఎకో పల్పింగ్‌ యూనిట్‌లో కాఫీ గింజలను పరిశీలిస్తున్న మురళీధర్‌ రెడ్డి, పక్కన ఆదిత్యవర్మ

జి.మాడుగుల, జీకేవీధి ఎకో పల్పింగ్‌ యూనిట్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

గిరిజన సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి డి.మురళీధర్‌ రెడ్డి

స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణాలపై అసంతృప్తి

చింతపల్లి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ రైతులు పండించిన కాఫీ పండ్లకు అంతర్జాతీయ ధరలు అందిస్తున్నామని గిరిజన సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి డి.మురళీధర్‌ రెడ్డి తెలిపారు. బుధవారం చింతపల్లి మండలంలో పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మతో కలిసి ఆయన స్థానిక ఎకో పల్పింగ్‌ యూనిట్‌ను సందర్శించారు. గిరిజన రైతుల నుంచి కాఫీ పండ్ల సేకరణ, పల్పింగ్‌ను స్వయంగా పరిశీలించారు. వైటీసీలో వృత్తివిద్య కోర్సులో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. లంబసింగిలో నిర్మాణంలో ఉన్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మురళీధర్‌ రెడ్డి మాట్లాడుతూ గిరిజన రైతులు పండించిన కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అరకు కాఫీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. గిరిజన ప్రాంతంలో లక్ష ఎకరాల్లో కాఫీ సాగుకు కార్యాచరణ ప్రారంభించామని చెప్పారు. ఆదివాసీల ఆర్థిక ప్రగతికి కాఫీ ప్రధాన వాణిజ్యపంటగా మారిందన్నారు. గిరిజనులు పండించిన కాఫీ పండ్లు, గింజలు దళారీలకు విక్రయించి నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తుందన్నారు. కాఫీ పండ్లను మ్యాక్స్‌ ద్వారా సేకరించి పార్చిమెంట్‌ ఉత్పత్తి చేసి మార్కెటింగ్‌ చేస్తున్నామని చెప్పారు. మార్కెట్‌లో వచ్చిన ధరను రెండు విడతల్లో రైతులకు అందజేస్తున్నామన్నారు. గిరిజన సహకార సంస్థ పార్చిమెంట్‌, చెర్రీని కొనుగోలు చేస్తూ అంతర్జాతీయ ధరలను నేరుగా రైతులకు అందజేస్తుందన్నారు. అలాగే నిర్మాణంలో ఉన్న జి.మాడుగుల, జీకేవీధి ఎకో పల్పింగ్‌ యూనిట్‌ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణాలను గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్‌ అధికారులు వేగవంతం చేయాలన్నారు. లంబసింగి స్వాతంత్య్ర సమయరయోధుల మ్యూజియం పనులను పరిశీలించిన ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మ్యూజియం నిర్మాణాలు సహజంగా లేవన్నారు. మ్యూజియం పనులు నిర్ణీత సమయానికి పూర్తి చేయాలన్నారు. మ్యూజియం నిర్మాణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయని, అదనపు నిధులు సైతం విడుదల చేశాయన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. మరోసారి మ్యూజియాన్ని సందర్శిస్తానని, అప్పటికి నిర్దేశించిన మార్పులు కనిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, కాఫీ ఏడీ అయంతి, టీడబ్ల్యూ ఈఈ వేణుగోపాల్‌రావు, డీఈఈ వి.వంశీకృష్ణ, ఏఈఈలు రఘునాథరావు నాయుడు, యాదకిశోర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2026 | 12:36 AM