Share News

నేటి నుంచి ఇంటర్‌ తరగతులు

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:11 AM

వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు శనివారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొదటి రోజు నుంచే సాఫీగా తరగతులు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్‌ విద్యా శాఖాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయడానికి ఆయా సబ్జెక్టులకు సంబంధించి మొదటి సంవత్సరం 22,289 పాఠ్యపుస్తకాలు, రెండో సంవత్సరం 16,651 పాఠ్యపుస్తకాలు ఇప్పటికే ఆయా కళాశాలలకు చేరాయి. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి కొన్ని పుస్తకాలు రావాల్సి వుంది.

నేటి నుంచి ఇంటర్‌ తరగతులు
జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయం నుంచి కళాశాలలకు పంపుతున్న పాఠ్య పుస్తకాలు

పునఃప్రారంభం కానున్న జూనియర్‌ కళాశాలలు

తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

మొదటి రోజే ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు శనివారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొదటి రోజు నుంచే సాఫీగా తరగతులు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్‌ విద్యా శాఖాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయడానికి ఆయా సబ్జెక్టులకు సంబంధించి మొదటి సంవత్సరం 22,289 పాఠ్యపుస్తకాలు, రెండో సంవత్సరం 16,651 పాఠ్యపుస్తకాలు ఇప్పటికే ఆయా కళాశాలలకు చేరాయి. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి కొన్ని పుస్తకాలు రావాల్సి వుంది.

జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ఐదు ఏపీ మోడల్‌ స్కూళ్లు, ఏడు హైస్కూల్‌ ప్లస్‌లు, 20 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్‌ బోధన జరుగుతున్నది. జూనియర్‌ కళాశాలల్లో రెండు సంవత్సరాలకు కలిపి ఎనిమిది వేల వరకు సీట్లు వున్నాయి. ఈ ఏడాది ప్రథమ సంవత్సరలో 4,200 మందికి ప్రవేశాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఉన్నత పాఠశాలలు వున్న గ్రామాల్లో అధికారులు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పర్యటించి, ఇటీవల పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు ఇళ్లకు వెళ్లి పిల్లలను ప్రభుత్వ జూనియర్‌ కళాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, వసతిసదుపాయాల గురించి వివరిస్తున్నారు. దీంతో పలువురు విద్యార్థులు ఇప్పటికే అడ్మిషన్లు తీసుకున్నారు. ఇప్పటకే వివిధ కళాశాలల్లో 750 మంది చేరారని, ఈ నెలాఖరు వరకు గడువు వుండడంతో సీట్లు భర్తీ అవుతాయని అధికారులు చెబుతున్నారు.

తొలి రోజే పాఠ్య పుస్తకాలు పంపిణీ

ఇంటర్మీడియట్‌లో ఆయా సబ్జెక్టులకు సంబంధించి పాఠ్య పుస్తకాలు ఇప్పటికే అన్ని కళాశాలలకు చేరాయి. తరగతులు ప్రారంభమైన రోజే.. అంటే శనివారం నుంచే పుస్తకాలను విద్యార్థులకు చేస్తారు. ఇప్పటి వరకు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పాఠ్యపుస్తకాలు 22,289, ద్వితీయ సంవత్సరం పాఠ్యపుస్తకాలు 16,651 వచ్చాయి. ద్వితీయ సంవత్సరం తెలుగు మీడియం పాఠ్యపుస్తకాలు, ఒకేషనల్‌ కోర్సుల్లో కొన్ని సబ్జెక్టుల పుస్తకాలు రావాల్సి వుంది. కొద్ది రోజుల్లో నోట్‌పుస్తకాలు కూడా అందజేస్తారు.

తరగతుల నిర్వహణకు సర్వం సిద్ధం

మద్దిలి వినోద్‌బాబు, డీఐఈవో

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు శనివారం పునఃప్రారంభం అవుతాయి. మొదటి రోజు నుంచే తరగతుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాం. అన్ని కళాశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం అమలవుతున్నది. ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు అందజేస్తున్నాం. ఈ ఏడాది ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ‘సంకల్ప’ పేరుతో ఐఐటీ-జేఈఈ, నీట్‌, ఏపీ ఈఏసెట్‌లకు బిట్‌ బ్యాంకు మెటీరియల్‌ను సెప్టెంబరులో ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది. కళాశాలల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు చేపట్టాం.

Updated Date - Jun 06 , 2026 | 12:11 AM