Share News

ఇంటర్‌ ప్రవేశాలు అంతంతే..

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:04 AM

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో పలు సంస్కరణలు అమలు చేస్తూ జూనియర్‌ కళాశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. ప్రవేశాలకు గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండగా సగానికిపైగా సీట్లు ఖాళీగా వున్నాయి. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ కోర్సుల్లో సీట్ల సాధన కోసం ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు/ కార్పొరేట్‌ కళాశాలల్లో చేర్పించడమే ఇందుకు కారణమని ఇంటర్మీడియట్‌ విద్యా శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇంటర్‌ ప్రవేశాలు అంతంతే..
కృష్ణాదేవిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సగానికిపైగా సీట్లు ఖాళీ

ఈ నెలాఖరుతో ముగియనున్న ప్రవేశాల గడువు

ఉన్నత చదువులను దృష్టిలో పెట్టుకొని ‘ప్రైవేటు’కు ప్రాధాన్యం ఇస్తున్న తల్లిదండ్రులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో పలు సంస్కరణలు అమలు చేస్తూ జూనియర్‌ కళాశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. ప్రవేశాలకు గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుండగా సగానికిపైగా సీట్లు ఖాళీగా వున్నాయి. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ కోర్సుల్లో సీట్ల సాధన కోసం ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు/ కార్పొరేట్‌ కళాశాలల్లో చేర్పించడమే ఇందుకు కారణమని ఇంటర్మీడియట్‌ విద్యా శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

విద్యా శాఖ మంత్రిగా నారా లోకేశ్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. ఇంకా ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ పంపిణీ చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఖాళీగా వున్న కాంట్రాక్టు అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయినాసరే పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థుల్లో చాలాతక్కువ మంది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేరుతున్నారు. జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు వున్నాయి. వీటిల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఓకేషనల్‌ కోర్సులు వున్నాయి. ఒక్కో కళాశాలల్లో రెండేళ్లకు కలిపి కనిష్ఠంగా 150 సీట్లు, గరిష్ఠంగా 500 వరకు సీట్లు వున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఫస్టియర్‌లో ప్రవేశాలకు ఈ నెలాఖరు వరకు గడువు వుంది. కానీ ఇంతవరకు సగం సీట్లు కూడా భర్తీ కాలేదు. అన్ని గ్రూపుల్లో కలిపి 1,700 మంది మాత్రమే చేరినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సదుపాయాలు, మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్య, నోట్‌పుస్తకాల పంపిణీ గురించి పట్టణాలు, గ్రామాల్లో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి చెప్పామని, అయినాసరే ఆశించినస్థాయిలో చేరికలు లేకపోవడం ఒకింత నిరాశ పరుస్తున్నదని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖాధికారి మద్దిలి వినోద్‌బాబు అన్నారు.

మచ్చుకు కొన్ని కళాశాలల్లో ప్రవేశాలు..

నర్సీపట్నం జూనియర్‌ కళాశాలలో 492 సీట్లకు 200 మంది, పరవాడ కళాశాలలో 172 సీట్లకుగాను 85 మంది, గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట కళాశాలలో 120 సీట్లకు 70 మంది, సబ్బవరం కళాశాలలో 446 సీట్లకు 252 మంది చేరారు. రాంబిల్లి మండలం లాలంకోడూరు కళాశాలలో 120 సీట్లకు 52 మంది, కె.కోటపాడు కళాశాలలో 176 సీట్లకు 55 మంది, మాకవరపాలెం కళాశాలలో 352 సీట్లకు 52 మంది, రావికమతం మండలం కొత్తకోట కళాశాలలో 150 సీట్లకు 31 మంది మాత్రమే చేరారు.

ఉన్నత విద్యకు ఇంటర్మీడియట్‌ కీలకం కావడంతో ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ కోర్సుల్లో చేర్చడానికి మంచి ర్యాంకుల సాధన కోసం కార్పొరేట్‌ కళాశాలల్లో చదివించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సొంతూరులో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఉన్నప్పటికీ.. ఎక్కడో దూరంలో పట్టణ ప్రాంతాల్లో వున్న కార్పొరేట్‌ కళాశాలల్లో చేర్పిస్తున్నారు. ఈ కారణంగానే ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jun 26 , 2026 | 12:05 AM