Share News

చిలగడ దుంప సాగుపై ఆసక్తి

ABN , Publish Date - Jul 21 , 2026 | 12:00 AM

మన్యంలో చిలగడ దుంప సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. కేవలం మూడు నెలల్లో పంట చేతికి అంది అధిక ఆదాయం లభిస్తుండడంతో సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

చిలగడ దుంప సాగుపై ఆసక్తి
కడుగుల గ్రామంలో చిలగడ దుంపల సాగుకు నాట్లు వేస్తున్న ఆదివాసీ రైతులు

మూడు నెలల్లో పంట చేతికి అందుతుండడంతో ముమ్మరంగా నాట్లు

గత ఏడాది యాభై కిలోల బస్తా రూ.1,200 వరకు పలికిన ధర

మన్యంలో పెరుగుతున్న సాగు విస్తీర్ణం

మేలిజాతి వంగడాలను అందించాలని ఆదివాసీ రైతుల వేడుకోలు

చింతపల్లి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): మన్యంలో చిలగడ దుంప సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. కేవలం మూడు నెలల్లో పంట చేతికి అంది అధిక ఆదాయం లభిస్తుండడంతో సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గిరిజన రైతులు ప్రస్తుతం ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు. దేశవాళీ రకాలను నాటుకుంటున్నారు. ప్రభుత్వం అధిక దిగుబడులనిచ్చే మేలిజాతి వంగడాలను అందించాలని రైతులు కోరుతున్నారు.

పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఆదివాసీ రైతులు 20 ఏళ్లుగా చిలగడ దుంప సాగు చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం వరకు కేవలం 500- 600 ఎకరాల్లో రైతులు సాగు చేసేవారు. ఐదేళ్లుగా వాణిజ్య సరళిలో చిలగడ దుంప సాగు చేపడుతున్నారు. గత ఏడాది గిరిజన రైతులు జిల్లాలో 2,500 ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది వ్యవసాయ, ఉద్యానశాఖ సహకారంతో 3,900 ఎకరాల్లో నాట్లు వేస్తున్నారు. రైతులు చిలగడ దుంపను సంప్రదాయేతర పంటగా పండిస్తున్నారు. ప్రతి ఏటా జూలైలో పంట పొలాలను సిద్ధం చేసుకుని బెడ్స్‌పై నాట్లు వేస్తున్నారు. ఈ పంట కాలం మూడు నెలలు. నవంబరు, డిసెంబరులో దిగుబడులు వస్తాయి. బాగా పండితే ఎకరానికి ఐదు నుంచి ఆరు క్వింటాళ్ల దిగుబడులు వస్తాయి.

చిలగడ దుంపకు గరిష్ఠ ధర

రెండేళ్లుగా గిరిజన రైతులు పండించిన చిలగడ దుంపకు మార్కెట్‌లో మంచి ధర లభిస్తున్నది. గతంలో యాభై కిలోల బస్తాను ప్రైవేటు వర్తకులు రూ.500- 600 ధరకు కొనుగోలు చేసేవారు. గత ఏడాది గిరిజన రైతులు పండించిన చిలగడ దుంపలకు మార్కెట్‌ ప్రారంభంలో యాభై కిలోల బస్తాకు రూ.1,200 ధర లభించింది. చిలగడ దుంప సాగుకు పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. రైతులు నారు సిద్ధం చేసుకుని బెడ్స్‌లో నాట్లు వేసుకుని ఒకటీ, రెండు సార్లు కలుపు తీసుకుంటుంటే సరిపోతుంది. కాగా భూసారం ఆధారంగా సేంద్రియ పద్ధతిలో పండిస్తుండడంతో మంచి ధర లభిస్తుంది. రెండేళ్లుగా ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు నాట్లు వేసిన నాటి నుంచి పంట కోసే వరకు రైతులకు సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నారు.

మేలిజాతి వంగడాల కోసం ఎదురుచూపులు

గిరిజన రైతులు చిలగడ దుంప మేలిజాతి వంగడాల కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. చిలగడ దుంపపై చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో నేటి వరకు ఎటువంటి పరిశోధనలు జరగలేదు. రెండేళ్ల క్రితం హరిపురం బీసీటీ కేవీకే శాస్త్రవేత్తలు కొంత మంది గిరిజన రైతులకు ఆర్‌ఎన్‌ఎస్‌పీ-1 రకం చిలగడ దుంప వంగడాలను అందజేశారు. ఈ రకం 80 రోజుల్లోనే పంట చేతికొచ్చింది. పోషక విలువలు అధికంగా ఉండడంతో మార్కెట్‌లో అధిక ధర లభించింది. ఈ రకం వంగడాలను సాగు చేసుకున్న రైతులు ఎకరానికి 10-12 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. అయితే ప్రస్తుతం కేవీకే శాస్త్రవేత్తలు ఈ రకం వంగడాలను రైతులకు పంపిణీ చేయడం లేదు. అలాగే ఉద్యానశాఖ సైతం ఎటువంటి నూతన వంగడాలను అందించడం లేదు. దీంతో ఆదివాసీ రైతులు ఒడిశా ప్రాంతంలో లభించే దేశవాళీ రకాలను తీసుకొచ్చి నాట్లు వేసుకుంటున్నారు. దీని వల్ల అధిక దిగుబడులు పొందలేకపోతున్నారు.

Updated Date - Jul 21 , 2026 | 12:00 AM