Share News

డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుపై ఆసక్తి

ABN , Publish Date - May 15 , 2026 | 11:54 PM

డ్రాగన్‌ ఫ్రూట్‌ ఉద్యాన పంట లాభసాటిగా ఉండడంతో రైతులు సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో 12 మంది రైతులు 25 ఎకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట వేశారు.

డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుపై ఆసక్తి
నక్కపల్లి మండలం టీహెచ్‌ఎల్‌ లక్ష్మీపురంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ తోట

అధిక లాభాలు వస్తుండడంతో మొగ్గు చూపుతున్న రైతులు

జిల్లాలో 25 ఎకరాల్లో సాగు

ఎకరాకి రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఆదాయం

నర్సీపట్నం, మే 15 (ఆంధ్రజ్యోతి): డ్రాగన్‌ ఫ్రూట్‌ ఉద్యాన పంట లాభసాటిగా ఉండడంతో రైతులు సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో 12 మంది రైతులు 25 ఎకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట వేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరానికి ఎకరానికి 15 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు.

కొత్తగా డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట వేయడానికి ఎకరానికి రూ.6 లక్షలు పెట్టుబడి అవుతుంది. ప్రభుత్వం తొలి ఏడాది రూ.64,800లు, రెండో ఏడాది రూ.43,200 చొప్పున రాయితీ ఇస్తుంది. ఒకసారి పంట వేసిన మొక్కలకు సంరక్షణ తప్ప ఆ తరువాత 25 సంవత్సరాల పాటు పెట్టుబడి ఉండదు. ఎప్పటికప్పుడు ఉద్యాన అధికారుల సలహాలు, సూచనలు తీసుకొని సాగు చేసుకోవాలి. .

పంట సంరక్షణ ప్రధానం

ఎకరా విస్తీర్ణంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట వేయడానికి ముందుగా 500 సిమెంట్‌ కాంక్రీట్‌ స్తంభాలు పాతుకోవాలి. ఆ స్తంభాలన్నింటిని కలుపుకొని జియా వైరు కట్టాలి. ఎకరానికి 2,000 డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలు(కట్టింగ్స్‌) నాటుకోవాలి. మొక్కలకు నీటి సదుపాయం కోసం డ్రిప్‌ అమర్చుకోవాల్సి ఉంది. సాగుకి సిద్ధం చేసుకునే సరికి రైతుకి ఎకరానికి రూ.6 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రతీ ఏటా మే నుంచి అక్టోబరు వరకు డ్రాగన్‌ ఫ్రూట్స్‌ పంట దిగుబడికి వస్తుంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ప్రతీ ఎకరానికి 15 నుంచి 20 టన్నులు దిగుబడి వస్తుంది. వ్యాపారులు వ్యవసాయ క్షేత్రం వద్దకు వచ్చి కిలో రూ.90 నుంచి రూ.100 లకు కొనుగోలు చేస్తుంటారు. అన్ని ఖర్చులు పోను సంవత్సరానికి రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు లాభాలు ఆర్జించవచ్చునని రైతు అంటున్నారు.

రాష్ట్రంలోనే అత్యధిక దిగుబడి సాధించిన రైతు

ఎస్‌.రాయవరం మండలం రాజా వెంకటనగరానికి చెందిన దాట్ల సత్యనారాయణరాజు తన ఇద్దరు కుమారులు భరత్‌ కుమార్‌, ఫణీంద్రదత్తతో కలిసి డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేస్తున్నారు. నక్కపల్లి మండలం టీహెచ్‌ఎల్‌ లక్ష్మీపురంలో 3 ఎకరాలు, ఎస్‌.రాయవరం మండలం గుడివాడ, గొలుగొండ మండలం వడపర్తిలో ఒక ఎకరం చొప్పున డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేస్తున్నారు. ఆయన చిన్నకుమారుడు ఫణీంద్ర సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మానేసి వ్యసాయం చేస్తున్నారు. పెద్ద కుమారుడు భరత్‌ కుమార్‌ డిగ్రీ చదువుకొని వడపర్తిలో వ్యవసాయం చూసుకుంటున్నారు. రాష్ట్రంలో సరాసరి ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి ఉంటే... ఆయన అత్యధికంగా తొలి ఏడాది ఎకరాకి 15 టన్నులు దిగుబడి సాధించారు. రెండో సంవత్సరం నుంచి 25 టన్నుల దిగుబడి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

Updated Date - May 15 , 2026 | 11:54 PM