Share News

రాగి సాగుకు ఆసక్తి

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:43 AM

ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు రావడంతో రైతులు కూడా అందుకు అనుగుణంగా పంటల సాగును మారుస్తున్నారు. కొంతకాలం నుంచి ప్రజలు బియ్యం స్థానంలో చిరుధాన్యాల వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో రైతులు మెట్ట భూములతోపాటు బోరు, బావుల నీటి సదుపాయం వున్న భూముల్లో రాగి (చోడి) పంటను సాగు చేస్తున్నారు. నామమాత్రపు పెట్టుబడితో తక్కువ సమయంలో పంట చేతికి వస్తుండడంతో పలువురు రైతులు రాగి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఖరీఫ్‌తో పోలిస్తే రబీ సీజన్‌లో ఎక్కువ దిగుబడి వస్తున్నదని అంటున్నారు. దీంతో రబీ సీజన్‌లో వేసిన పంట ప్రస్తుతం కోత దశలో వుంది.

రాగి సాగుకు ఆసక్తి
సబ్బవరం మండలం నక్కవానిపాలెంలో గింజ కట్టే దశలో వున్న రాగి పంట

పెరుగుతున్న వినియోగంతో గిట్టుబాటు ధర

ఎకరాకు రూ.15 వేల వరకుపెట్టుబడి

8-10 క్వింటాళ్ల దిగుబడి

ఖర్చులు పోను రూ.30 వేల వరకు మిగులు

సబ్బవరం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు రావడంతో రైతులు కూడా అందుకు అనుగుణంగా పంటల సాగును మారుస్తున్నారు. కొంతకాలం నుంచి ప్రజలు బియ్యం స్థానంలో చిరుధాన్యాల వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో రైతులు మెట్ట భూములతోపాటు బోరు, బావుల నీటి సదుపాయం వున్న భూముల్లో రాగి (చోడి) పంటను సాగు చేస్తున్నారు. నామమాత్రపు పెట్టుబడితో తక్కువ సమయంలో పంట చేతికి వస్తుండడంతో పలువురు రైతులు రాగి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఖరీఫ్‌తో పోలిస్తే రబీ సీజన్‌లో ఎక్కువ దిగుబడి వస్తున్నదని అంటున్నారు. దీంతో రబీ సీజన్‌లో వేసిన పంట ప్రస్తుతం కోత దశలో వుంది.

చిరుధాన్యాల్లో ఒకటైన రాగిలో క్యాల్షియం అధికంగా ఉండడం, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండడం, పీచు పదార్ధం కావడంతపాటు బియ్యం, గోధుమ పిండితోపోలిస్తే ఎక్కువ పోషకాలు వుండడంతో ఇటీవల రాగుల వినియోగం గణనీయంగా పెరిగింది. పలు టిఫిన్‌ సెంటర్లు, హోటళ్లలో రాగి పిండితో ప్రత్యేకంగా చేసే రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి సంకటి వంటి ఆహార పదార్థాలను మెనూలో చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే సరుకుల్లో రాగులను చేర్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 2025-26లో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) క్వింటాకు రూ.4,886గా ప్రకటించింది. వ్యాపారులు రైతుల నుంచి వ్యాపారులు క్వింటా రూ.5 వేలకుపైగా ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇక రిటైల్‌ మార్కెట్‌లో కిలో రూ.60 నుంచి రూ.80 వరకు వ్యాపారులు అమ్ముతున్నారు. క్రమేపీ ధర పెరుగుతుండడంతో సబ్బవరం మండలంలోని అసకపల్లి, నక్కవానిపాలెం, గొల్లలపాలెం, అమృతపురం, సబ్బవరం, వంగలి, అంతకాపల్లి, గుల్లేపల్లి, గొర్లివానిపాలెం, పెదనాయుడుపాలెం తదితర గ్రామాల్లో పలువురు రైతులు రాగి పంటను సాగుచేస్తున్నారు. దీంతో ఏటేటా విస్తీర్ణం పెరుగుతున్నది. ఆరు తడి పంట కావడంతో కొద్దిపాటి నీటి సదుపాయం వున్న భూముల్లో ఈ పంటను పండిస్తున్నారు. దుక్కి దున్నడం, విత్తనాలు, కలుపుతీత, ఎరువులు, పురుగు మందులు, కోత, నూర్పిడి వంటి పనులన్నీ కలిపి ఎకరాకు గరిష్ఠంగా రూ.15 వేలు ఖర్చు అవుతుంది. విత్తిన 120 రోజుల్లో పంట చేతికి అందుతుంది. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. క్వింటా రూ.5 వేలచొప్పున విక్రయిస్తే.. రూ.40-50 వేల ఆదాయం వస్తుంది. ఖర్చులుపోను రూ.30 వేల వరకు మిగులుతాయి.

Updated Date - Mar 28 , 2026 | 12:43 AM