అగ్రికల్చర్ విద్యపై ఆసక్తి
ABN , Publish Date - Oct 12 , 2026 | 11:53 PM
స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి అనుబంధంగా నిర్వహిస్తున్న ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలకు ఆదరణ పెరుగుతోంది.
స్థానిక ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలకు ర్యాంకుల పంట
ఈ ఏడాది ఏజీ బీఎస్సీలో ఆరు సీట్లు కైవసం
అరుదైన పంటలపై విద్యార్థుల ప్రయోగాలు
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండడంతో పెరుగుతున్న ఆదరణ
చింతపల్లి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి అనుబంధంగా నిర్వహిస్తున్న ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలకు ఆదరణ పెరుగుతోంది. ఇక్కడి విద్యార్థులు అగ్రిసెట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారు. ఏజీ బీఎస్సీలో ఈ ఏడాది ఆరు సీట్లను విద్యార్థులు సాధించారు. రాష్ట్రంలోనే ఏకైక ప్రభుత్వ ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల కావడంతో ఈ కోర్సును అభ్యసించేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు 2011లో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేశారు. 2016లో ఈ కళాశాలను ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలగా మార్పు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల చింతపల్లిలో మాత్రమే ఉన్నది. ఈ కళాశాలలో 25 సీట్లు కేటాయించారు. కళాశాలలో చేరిన విద్యార్థులు రెండేళ్ల డిప్లొమా కోర్సును అభ్యసిస్తున్నారు. పదవ తరగతి అర్హత కలిగిన విద్యార్థినీ, విద్యార్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. పదవ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. కళాశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరు వసతి గృహాలు, క్యాంటీన్ అందుబాటులో ఉన్నాయి.
నాణ్యమైన విద్యాబోధన
కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుతున్నది. కళాశాలలో పాఠ్యాంశాలు బోధించేందుకు ఒక టీచింగ్ అసోసియేట్, ముగ్గురు టీచింగ్ అసిస్టెంట్లు ఉన్నారు. బోధన సిబ్బందితో పాటు శాస్త్రవేత్తలు సైతం అదనపు తరగతులను విద్యార్థులకు బోధిస్తున్నారు. కళాశాల ప్రాంతీయ పరిశోధన స్థానం ఆవరణలో ఉండడంతో శాస్త్రవేత్తలు చేపడుతున్న పరిశోధనలు, ప్రయోగాలను విద్యార్థులు స్వయంగా పరిశీలించి నేర్చుకునే వెసులుబాటు ఉంది. పరిశోధన స్థానంలో అరుదైన పంటలను శాస్త్రవేత్తలు సాగు చేస్తున్నారు. ఈ పంటలను స్వయంగా పరిశీలించి విద్యార్థులు నేర్చుకునే అవకాశం ఉంది. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న వ్యవసాయ పాఠ్యాంశాలను వెనువెంటనే ఫీల్డ్‌లో ప్రాక్టికల్ చేస్తున్నారు. విద్యార్థులు ఉదయం తరగతి గదిలోనూ, మధ్యాహ్నం ఫీల్డ్‌లో వ్యవసాయ విద్యను నేర్చుకుంటున్నారు. మూడో సెమిస్టర్‌లో విద్యార్థులే స్వయంగా శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పంటలను పండించాల్సి వుంది. దీంతో స్థానిక కళాశాలలో అగ్రికల్చర్ డిప్లొమా చేసిన విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు ప్రాక్టికల్ విద్య పూర్తిస్థాయిలో నేర్చుకోగలుగుతున్నారు.
అగ్రిసెట్‌లో ఉత్తమ ఫలితాలు
కళాశాలకు చెందిన విద్యార్థులు ప్రతి ఏడాది అగ్రిసెట్‌లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. కళాశాలలో ఐదేళ్లగా రాష్ట్రస్థాయి అగ్రి సెల్‌లో స్థానిక కళాశాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ప్రథమ ర్యాంక్ సాధిస్తున్నారు. 2016 నుంచి ప్రతి ఏడాది పదిలోపు ర్యాంకులను కళాశాలకు చెందిన విద్యార్థులు అధికంగా సొంతం చేసుకుంటున్నారు. ప్రతి ఏడాది ఐదు నుంచి ఆరుగురు విద్యార్థులు అగ్రిసెట్ ద్వారా ఏజీ బీఎస్సీ సీట్లు సాధిస్తున్నారు. ఈ ఏడాది ఆరుగురు విద్యార్థులు ఏజీ బీఎస్సీ సీట్లు సాధించారు.