Share News

విద్యార్థులతో మమేకం

ABN , Publish Date - Aug 23 , 2026 | 01:13 AM

చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్‌ పాల్గొన్న కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు.

విద్యార్థులతో మమేకం

చంద్రపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వినూత్నంగా మంత్రి నారా లోకేశ్‌ కార్యక్రమం

పాఠశాలలో ‘దివీస్‌ లాబొరేటరీస్‌’ రూ.6.48 కోట్లతో అభివృద్ధి చేసిన క్రీడా కోర్టులు, ఆర్వో ప్లాంటు ప్రారంభం

అనంతరం విద్యార్థులతో ముఖాముఖి, వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం

మధురవాడ, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి):

చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్‌ పాల్గొన్న కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. పాఠశాలలో ‘దివీస్‌ లాబొరేటరీస్‌’ రూ.6.48 కోట్లతో అభివృద్ధి చేసిన క్రీడా మైదానం, క్రీడా కోర్టులను, ఆర్వో ప్లాంటును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడేందుకు వేదిక ఏర్పాటుచేశారు. అయితే సభకు బదులు విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటుచేస్తే మంచి సందేశం వెళుతుందని లోకేశ్‌ బృందం భావించింది. ఇందుకు 20 మంది విద్యార్థుల పేర్లను విద్యా శాఖ పంపగా వారిలో నలుగురిని ఎంపిక చేశారు. వేదికపై మంత్రి లోకేశ్‌, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, దివీస్‌ లాబొరేటరీస్‌ డైరెక్టర్‌ నీలిమ దివి, నలుగురు విద్యార్థులకు మొత్తం ఏడు కుర్చీలు వేశారు. మధ్యలో ముగ్గురు అతిథులు ఆశీసులు కాగా ఇరువైపులా చెరో ఇద్దరు విద్యార్థులు కూర్చున్నారు. ప్రారంభ కార్యక్రమాలు పూర్తయిన తరువాత మంత్రి వెంట ఎమ్మెల్యేలు, అధికారులు వేదికపైకి వచ్చే ప్రయత్నం చేసినప్పుడు కేవలం ముగ్గురు అతిథులు, నలుగురు విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉందని చెప్పడంతో వారంతా దిగి కింద కూర్చున్నారు. పాఠశాల హెచ్‌ఎం వెంకటరావు స్వాగతం పలికిన తరువాత ప్రశ్నల కార్యక్రమం ప్రారంభమైంది. విద్యార్థులు ప్రశ్నలు వేసేందుకు వీలుగా వేదికపై కుర్చీలను అర్ధచంద్రాకారంగా ఉండేలా మంత్రి స్వయంగా మార్పు చేయించారు. ప్రశ్నలు వేసేటప్పుడు అన్నా...అని సంబోధించాలని సూచించారు. విద్యార్థుల ప్రశ్నలకు అతిథులు స్ఫూర్తినిచ్చేలా సమాధానాలు ఇస్తూ వారిని ప్రోత్సహించారు. ఎక్కడా రాజకీయ విమర్శలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సుదీర్ఘ ప్రసంగాలకు భిన్నంగా నిర్వహించిన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. దివీస్‌ కార్యక్రమాలకు సంబంధించి తొలుత ప్రారంభోత్సవ శిలాఫలకం ఆవిష్కరించారు. ఆవరణలో మూడుచోట్ల ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంట్లను లోకేశ్‌, ఎమ్మెల్యే గంటా, నీలిమ దివి ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు.

కలలు కనండి

పాఠశాల నోటీస్‌ బోర్డులో తొలుత నీలిమ దివి సంతకం చేశారు. ఆ తరువాత మంత్రి లోకేశ్‌ ‘కలలు కనండి..పెద్ద కలలు కనండి...ఆ కలను సాకారం చేసుకునేందుకు కృషిచేయండి..మీ కలను నిజం చేసుకునే శక్తి, పట్టుదల మీలో ఉన్నాయి.’ అంటూ రాశారు.


టీడీపీ కార్యాలయంలో మంత్రి లోకేశ్‌ ప్రజాదర్బార్‌

విశాఖపట్నం/మహారాణిపేట/మాధవధార, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్‌ శనివారం ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఆయనను కలిసేందుకు పెద్దఎత్తున ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి, వారితో ఫొటోలు దిగారు. వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చోడే వెంకట పట్టాభి, లొడగల కృష్ణ ఉన్నారు. కార్యదర్శి లొడగల కృష్ణ జన్మదినం సందర్భంగా లోకేశ్‌ ఆయనతో కేకు కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.

డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల నియామక ఉత్తర్వులు జారీ చేయండి

ఏపీపీఎస్‌సీ విడుదల చేసిన డిగ్రీ లెక్చరర్‌ ఫలితాల్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు వీలైనంత త్వరగా నియామక ఉత్తర్వులు ఇవ్వాలని మంత్రి లోకేశ్‌ను పలువురు అభ్యర్థులు కోరారు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే నియామక ఉత్తర్వుల జారీకి ఇబ్బందులు ఎదురవుతాయని, అందువల్ల వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని వినతిపత్రంలో కోరారు. అలాగే, డీఎల్‌ స్పోర్ట్స్‌ కోటాకు సంబంధించి పెండింగ్‌ ప్రక్రియను పూర్తిచేయాలని విన్నవించారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్టు అభ్యర్థులు తెలిపారు.

Updated Date - Aug 23 , 2026 | 01:13 AM