Share News

ఇంటర్‌ ప్రశ్నాపత్రాలు రాక

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:06 AM

ఇంటర్మీడియట్‌ పరీక్షలకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ప్రశ్నాపత్రాలను పోలీస్‌ స్టేషన్‌లకు తరలించి భద్రపరిచారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో ఈ ఏడాది శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా అధికారులు కృషి చేశారు. గత ఏడాది ఉత్తీర్ణత శాతం తగ్గిపోవడంతో ఈ ఏడాది ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించి చదివిస్తున్నారు.

ఇంటర్‌ ప్రశ్నాపత్రాలు రాక
నర్సీపట్నం పోలీస్‌స్టేషన్‌లో భద్రపరచడానికి తీసుకొచ్చిన ఇంటర్‌ ప్రశ్నాపత్రాలు

ట్రంకు పెట్టెల్లో పోలీసు స్టేషన్లకు చేరిక

పరిశీలించిన అధికారులు, అధ్యాపకులు

పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

మొత్తం విద్యార్థులు 26,301 మంది

పరీక్షా కేంద్రాలు 34

నర్సీపట్నం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ పరీక్షలకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ప్రశ్నాపత్రాలను పోలీస్‌ స్టేషన్‌లకు తరలించి భద్రపరిచారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో ఈ ఏడాది శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా అధికారులు కృషి చేశారు. గత ఏడాది ఉత్తీర్ణత శాతం తగ్గిపోవడంతో ఈ ఏడాది ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించి చదివిస్తున్నారు. కాగా జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు కళాశాలల్లో మొదటి, రెండో సంవత్సరం ఇంటర్మీడియట్‌ విద్యార్థులు 26,301 మంది వున్నారు. ఇంటర్‌ పరీక్షల కోసం 54 కేంద్రాలను సిద్ధం చేశారు. అన్ని గదుల్లో సీసీ కెమెరాలు అమర్చుతున్నారు. చూసిరాతలకు అవకాశం లేకుండా జిల్లా కేంద్రంతోపాటు అమరావతి నుంచి ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు మానిటరింగ్‌ చేస్తుంటారు. ఫ్లైయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌లు రెండేసి చొప్పున నియమించారు. ముఖ్య పర్యవేక్షకులు 34 మంది, కస్టోడియన్లు 18 మంది, ఇన్విజిలేటర్లు 500 మంది చొప్పున విధులు నిర్వహిస్తారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని డీఐఈవో వినోద్‌బాబు తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేశారు. సెల్‌ ఫోన్లు, బ్లూటూత్‌లు, స్మార్ట్‌ వాచ్‌లను వెంట తీసుకురావద్దని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలుతోపాటు పోలీసు బందోబస్తు ఉంటుందని అన్నారు.

అనకాపల్లి పీఎస్‌కు చేరిన ప్రశ్నాపత్రాలు

అనకాపల్లి టౌన్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ పరీక్షా పత్రాలు గురువారం పట్టణ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నాయి. ట్రంకు పెట్టెల్లో వచ్చిన పరీక్షా పత్రాలను సంబంధిత అధికారులు, అధ్యాపకులు పరిశీలించిన అనంతరం స్టేషన్‌లో భద్రపరచడానికి పోలీసు అధికారులకు అప్పగించారు.

Updated Date - Feb 20 , 2026 | 01:06 AM