నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Feb 22 , 2026 | 11:16 PM
ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో సోమవారం ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి ఎస్.భీమశంకరరావు తెలిపారు.
ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరుకానున్న 7,346 మంది విద్యార్థులు
పకడ్బందీగా నిర్వహణకు చర్యలు
జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి ఎస్.భీమశంకరరావు
పాడేరురూరల్, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో సోమవారం ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి ఎస్.భీమశంకరరావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలకు ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో 26 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో అల్లూరి జిల్లాలో 16, పోలవరం జిల్లాలో 10 ఉన్నాయన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు జిల్లా, రాష్ట్ర కేంద్రాల్లో కంట్రోల్ రూంల నుంచి పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించేందుకు వీలుగా లైవ్ స్ర్కీనింగ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. సోమవారం ప్రారంభంకానున్న ప్రథమ సంవత్సర పరీక్షలకు ఉమ్మడి జిల్లా నుంచి 7,346 మంది, 24 నుంచి ప్రారంభం కానున్న ద్వితీయ సంవత్సర పరీక్షలకు 6,747 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరు కానున్నారన్నారు.