Share News

ఏకలవ్యలో ఇంటర్‌ బోధన నిల్‌

ABN , Publish Date - Jul 31 , 2026 | 10:36 PM

అధ్యాపకులు లేకపోవడంతో కొయ్యూరు(బాలారం) ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో 60 రోజులుగా ఇంటర్మీడియట్‌ తరగతులు జరగడం లేదు. దీంతో కొత్తగా ఇంటర్‌లో ప్రవేశం పొందిన 90 మంది విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది.

ఏకలవ్యలో ఇంటర్‌ బోధన నిల్‌
కొయ్యూరు ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల

అధ్యాపకులు లేకుండా విద్యార్థులకు ప్రవేశాలు

60 రోజులుగా జరగని బోధన

90 మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం

ఆందోళనలో తల్లిదండ్రులు

కొయ్యూరు, జూలై 31 (ఆంధ్రజ్యోతి): కొయ్యూరు (బాలారం) ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం తరగతులు ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకుగాను మార్చి నెలలో సీబీఎస్‌ఈ సిలబస్‌లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో 60 మంది విద్యార్థులు చొప్పున ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. అయితే అన్ని గ్రూపులకు కలిపి 90 మంది విద్యార్థులు చేరారు. ఇంతవరకు బాగానే ఉన్నా అధ్యాపకులు లేకపోవడంతో 60 రోజులుగా బోధన జరగడం లేదు. గత నెలలో అతిథి అధ్యాపకుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటికీ ఆ ప్రక్రియ ఇంతవరకు పూర్తి చేయలేదు. ఫలితంగా విద్యార్థులకు నేటివరకు బోధన ప్రారంభం కాలేదు. ఈ విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలకు చైర్మన్‌గా వ్యవహరించే కలెక్టర్‌ వీటిపై దృష్టి సారించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నిర్వహణపై పరిశీలన జరిపేందుకు లోపలికి వెళ్లేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తల్లిదండ్రులకు అనుమతించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్‌ బోధనకు వీలుగా అధ్యాపకులను వెంటనే నియమించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

మరోసారి అధికారుల దృష్టికి తీసుకువెళతాను

ఏటీడబ్ల్యూవో క్రాంతికుమార్‌

కొయ్యూరు ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఇంటర్‌ విద్యార్థులకు బోధన ప్రక్రియ ప్రారంభం కాలేదనే విషయం ఇటీవల పాఠశాల సందర్శించినపుడు తన దృష్టికి వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాను. ఇదే విషయాన్ని మరో సారి వారి దృష్టికి తీసుకువెళతాను. వెంటనే అతిథి అధ్యాపకులను నియమించేలా ప్రయత్నిస్తాను.

Updated Date - Jul 31 , 2026 | 10:36 PM