Share News

జోనల్‌ కమిషనర్‌పై మళ్లీ విచారణ

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:44 AM

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోనల్‌ కమిషనర్‌గా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న కె.చక్రవర్తి.. కిందిస్థాయి ఉద్యోగులు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తీవ్రంగా స్పందించింది. ఈ ఆరోపణలపై గతంలో షోకాజ్‌ నోటీసు జారీచేసి వివరణ తీసుకున్నప్పటికీ, మరోసారి పూర్తిస్థాయి విచారణ జరిపి, పక్షం రోజుల్లో నివేదిక సమర్పించాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌కు మునిసిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ సుమారు పది రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది.

జోనల్‌ కమిషనర్‌పై మళ్లీ విచారణ
చక్రవర్తి, జీవీఎంసీ అనకాపల్లి జోనల్‌ కమిషనర్‌

జీవీఎంసీ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు

పక్షం రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు

కిందిస్థాయి ఉద్యోగులను వేధిస్తున్నట్టు ఆరోపణలు

అనకాపల్లి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అనకాపల్లి జోనల్‌ కమిషనర్‌గా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న కె.చక్రవర్తి.. కిందిస్థాయి ఉద్యోగులు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తీవ్రంగా స్పందించింది. ఈ ఆరోపణలపై గతంలో షోకాజ్‌ నోటీసు జారీచేసి వివరణ తీసుకున్నప్పటికీ, మరోసారి పూర్తిస్థాయి విచారణ జరిపి, పక్షం రోజుల్లో నివేదిక సమర్పించాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌కు మునిసిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ సుమారు పది రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది.

జీవీఎంసీ అనకాపల్లి జోనల్‌ కమిషనర్‌ చక్రవర్తిపై వచ్చిన వేధింపుల ఆరోపణలపై ఉద్యోగ సంఘాలు పలుమార్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశాయి. ఈ నేపథ్యంలో ఆయనపై విచారణ చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్‌ను ఈ ఏడాది జనవరిలోనే ప్రభుత్వం ఆదేశించింది. దీంతో విచారణ జరిపిన కమిషనర్‌.. ప్రాథమిక నివేదికను సమర్పించారు. పరిశీలించిన ఉన్నతాధికారులు ఈ నివేదిక అసమగ్రంగా వున్నట్టు భావించారు ఇటీవల ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నేతలు కూడా జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌పై మరిన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో చక్రవర్తికి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఆయన ఇచ్చిన లిఖితపూర్వక వివరణకు, జీవీఎంసీ కమిషనర్‌ తన అభిప్రాయాలను జత చేయకుండా ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది. దీంతో జోనల్‌ కమిషనర్‌పై ఫిర్యాదులు, షోకాజ్‌ నోటీసుకు ఆయన ఇచ్చిన వివరణలపై సమగ్ర విచారణ నిర్వహించి, పూర్తి నివేదికను సమర్పించాలని జీవీఎంసీ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఆయన సమర్పించే తుది నివేదిక ఆధారంగా జోనల్‌ కమిషనర్‌పై తగు చర్యలు తీసుకునే అవకాశాలు వున్నట్టు తెలిసింది.

Updated Date - Oct 10 , 2026 | 12:44 AM