Share News

స్థానిక ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:42 AM

గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, ఎంసీటీసీ/ జడ్పీటీసీలకు ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. అన్ని ఎన్నికలను బ్యాలట్‌ పద్ధతిలో నిర్వహించాలని ఆదేశించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ జిల్లాలో ఎన్నికల అధికారులతో సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

స్థానిక ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు
అనకాపల్లిలోని జడ్పీ కార్యాలయంలో ఎన్నికల సామగ్రి

జిల్లాకు చేరిన సామగ్రి

మండలాలు, మునిసిపల్‌ కేంద్రాలకు తరలింపు

బ్యాలట్‌ బాక్సులు సిద్ధం చేస్తున్న సిబ్బంది

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించే పనిలో పోలీసు శాఖ

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, ఎంసీటీసీ/ జడ్పీటీసీలకు ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. అన్ని ఎన్నికలను బ్యాలట్‌ పద్ధతిలో నిర్వహించాలని ఆదేశించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ జిల్లాలో ఎన్నికల అధికారులతో సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలట్‌ బాక్సులు, ఇతర సామగ్రి, వస్తువులను సమకూరుస్తున్నారు. అన్ని మండల పరిషత్‌ కార్యాలయాల్లో బ్యాలట్‌ బాక్సులను శుభ్రం చేయిస్తున్నారు.

జిల్లాలో 646 గ్రామ పంచాయతీలు, 449 ఎంపీటీసీ స్థానాలు, 24 జడ్పీటీసీ స్థానాలు, రెండు మునిసిపాలిటీలు, జీవీఎంసీలో భాగమైన అనకాపల్లి జోన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. నర్సీపట్నం మునిసిపాలిటీలో 40 వార్డులు ఉండగా 76 పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేశారు. ఎలమంచిలి మునిసిపాలిటీలో 32 వార్డులు వుండగా, 61 పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేశారు. జీవీఎంసీ అనకాపల్లి జోన్‌ పరిధిలో ఆరు వార్డులు (107 నుంచి 112 వరకు) ఉన్నాయి. జిల్లా మొత్తం మీద 6,333 పోలింగ్‌ కేంద్రాలు వుండగా.. వీటిలో సాధారణ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల జాబితాను పోలీసు అధికారులు సిద్ధం చేస్తున్నారు. గత పర్యాయం నిర్వహించిన ఎన్నికల్లో అమలు చేసిన రిజర్వేషన్ల వివరాలకు సంబంధించిన జాబితాలను బయటకు తీసి, విశ్లేషిస్తున్నారు.

జిల్లాకు చేరుకున్న ఎన్నిక సామగ్రి

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్‌ సామగ్రి జిల్లాకు చేరుకుంటున్నది. జడ్పీ డిప్యూటీ సీఈఓ సందీప్‌ నేతృత్వంలో ఎన్నికల సామగ్రిని జిల్లా కార్యాలయానికి రప్పించి, గోదాముల్లో భద్రపరిచారు. ఇక్కడి నుంచి మండల, మునిసిపల్‌ కేంద్రాలకు తరలిస్తారు. వాటిని స్ర్టాంగ్‌ రూమ్‌లు, రిసెప్షన్‌ సెంటర్లకు తరలించడానికి జాబితాలను సిద్ధం చేస్తున్నారు. బ్యాలట్‌ బాక్సులు, సిరా, బ్యాలట్‌ నమూనా పత్రాలు, సీలింగ్‌ వ్యాక్స్‌, స్టాంప్‌ ప్యాడ్లు, నామినేషన్‌ ఫారాలు, డిక్లరేషన్‌ ఫారాలను మండలాలు, మునిసిపల్‌ కేంద్రాలకు పంపుతున్నారు.

సిబ్బందికి కిట్లు

ప్రతి పోలింగ్‌ కేంద్రానికి కేటాయించే పీవో (పోలింగ్‌ ఆఫీసర్‌), ఏపీఓ, ఓటింగ్‌ సిబ్బందికి అవసరమైన ప్రత్యేక స్టేషనరీ కిట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. దీంతోపాటు ఎన్నికల విధుల కోసం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల డేటాను సేకరించి తుది జాబితాలు తయారు చేశారు. వారికి త్వరలోనే మొదటి విడత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో అదనపు బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే నాటికి ఎన్నికల నిర్వహణ సంబంధించి అన్ని రకాల సామగ్రి నూరు శాతం అందుబాటులో ఉండేలా జడ్పీ, మునిసిపల్‌, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు.

Updated Date - Oct 10 , 2026 | 12:42 AM