సర్ పూర్తికి ముమ్మర చర్యలు
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:10 AM
జిల్లాలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియను పూర్తి చేసేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. సర్‌పై కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి
క్షేత్రస్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారులు సైతం పర్యవేక్షణ
పాడేరు, జూలై 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియను పూర్తి చేసేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. సర్‌పై కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పటిష్టంగా చేపట్టాలనే లక్ష్యంతో అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. అలాగే 624 పోలింగ్ కేంద్రాల్లోని మొత్తం 4 లక్షల 99 వేల 752 మంది ఓటర్లకు సంబంధించి ప్రత్యేక సమగ్ర సవరణ చేపడుతున్నామన్నారు. అందుకు తనతో పాటు జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో, జిల్లా రెవెన్యూ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి, మండల ప్రత్యేకాధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, ఎంఈవోలు, తదితరులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గ్రామస్థాయిలో 624 మంది బూత్‌స్థాయి అధికారులు, వారికి సహాయంగా బూత్‌స్థాయి అసిస్టెంట్‌లను నియమించామన్నారు. గ్రామ సచివాలయాలు సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 24 గంటలు పని చేసేలా ఏర్పాట్లు చేశామని, ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, పూరించిన తర్వాత వాటిని సేకరించి, డిజిటలైజేషన్ వంటి ప్రక్రియలను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామన్నారు. ఓటర్లకు సైతం ముందుగానే దీనిపై అవగాహన కల్పించామని, సిబ్బందికి అవసరమైన శిక్షణలు అందించామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ మినహా అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందిని సైతం సర్ ప్రక్రియలో భాగస్వామ్యం చేశామన్నారు. అలాగే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సైతం ప్రత్యేక సమావేశాలను నిర్వహించి ఈ ప్రక్రియకు సహకరించాలని కోరామన్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ టి.నిషాంతి హెచ్చరించారు. ఇప్పటికే అలక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు చేపట్టామని, ఇకపై అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పనులు చేయాలన్నారు. ఏఐ ద్వారా తప్పుడు ఫొటోలతో ప్రచారం చేసిన ఒక జిల్లా స్థాయి అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేశామని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఒక బూత్ స్థాయి అధికారిపై శాఖాపరమైన చర్య, ఇద్దరు గ్రామ సచివాలయ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశామన్నారు. సర్ ప్రక్రియకు సంబంధించి ఎవరు ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా వారిపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
జిల్లాలో 62.54 శాతానికి చేరిన సర్
పాడేరు, జూలై 8(ఆంఽధ్రజ్యోతి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియ 62.54 శాతం పూర్తయింది. జిల్లాలో పదకొండు మండలాల్లో 4 లక్షల 99 వేల 752 మందికి గాను బుధవారం నాటికి 4 లక్షల 99 వేల 748 మందికి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, 3 లక్షల 12 వేల 566 మంది ఓటర్ల ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. దీంతో బుధవారం నాటికి జిల్లాలో 62.54 శాతం సర్ ప్రక్రియ జరిగినట్టు అధికారులు గుర్తించారు. జిల్లాలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని 244 గ్రామ పంచాయతీల పరిధిలో 4 లక్షల 99 వేల 752 మంది ఓటర్లున్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా ప్రక్రియను జూన్ 15 నుంచి యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. ముఖ్యంగా గత నాలుగు రోజులుగా ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసిన అధికారులు, గడువుకు ముందే మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో రేయింబవళ్లు చేస్తున్నారు.