Share News

జోరుగా మంతనాలు!

ABN , Publish Date - Oct 24 , 2026 | 11:39 PM

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో శనివారం మంతనాలకు తెర తీశారు.

జోరుగా మంతనాలు!

సీట్ల పంపకాలపై నేతల సమాలోచనలు

కూటమిలో మూడు పార్టీలు, వైసీపీలో వర్గాల బెడద

నేడు కొలిక్కి రానున్న సీట్ల సర్దుబాటు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో శనివారం మంతనాలకు తెర తీశారు. కూటమిలోని మూడు పార్టీల నేతలు, వైసీపీలోని వర్గాలుగా ఉన్న నేతలు సీట్ల సర్దుబాటుపై సమాచాలోచనలు చేస్తున్నారు. ప్రధానంగా కూటమిలో సీట్ల లెక్కలు తేలకపోవడంతోపాటు మూడు పార్టీల మధ్య సఖ్యత లేకపోవడంతో ఎవరికి వారు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే స్థానికంగా ఉన్న బలాలు, బలహీనతలను గుర్తించకుండా పలు చోట్ల నామినేన్లు దాఖలు కావడంతో కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు వాటిపై చర్చిస్తున్నారు. ఈక్రమంలోనూ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలతోపాటు ఎంపీపీ పదవులపైనా సమాలోచనలు చేస్తున్నారు. పార్టీకి రెబల్స్‌గా బరిలోకి దిగకుండా జాగ్రత్తలు పడాలని భావిస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సీట్ల పంపకం జరగాలని, లేకుంటే ప్రత్యర్థి పార్టీకి మేలు జరుగుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా వైసీపీలోనూ వర్గాలు ఉండడంతో సీట్ల పంపకం, సర్దుబాటు తలనొప్పిగా మారింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సైతం ఆ పార్టీలో ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. ఉదాహరణకు ముంచంగిపుట్టు జడ్పీటీసీ స్థానానికి వైసీపీ నుంచి జల్లిపల్లి సుభద్ర, అరబీరు జగబందు, వెచ్చంగి సుభాశ్‌చంద్ర, గంపరాయి రామ్మూర్తి నామినేషన్‌ దాఖలు చేశారు. ఇలా అనేక మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో బీఫారం పొందకుండా రెబల్‌గా బరిలోకి దిగుదామనే వారిని బుజ్జగించే పనిలో వైసీపీ నేతలున్నారు. అయితే ఆదివారం నాటికి మొత్తం వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని అందరూ భావిస్తున్నారు.

స్వంత్రులపైనా ప్రధాన పార్టీలు గురి

కూటమి, వైసీపీ నేతలు స్వతంత్రులుగా ఉన్న వారిపైనా గురి పెడుతున్నారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి కొత్తగా రావడంతో ప్రతి జడ్పీటీసీ స్థానం ఎంతో ముఖ్యమని వారు భావిస్తున్నారు. ఈక్రమంలో బలంగా ఉంటూ స్వతంత్రులుగా బరిలోకి దిగేవారిని గుర్తించే పనిలో పడ్డారు. పలు మండలాల్లో పార్టీల మధ్య చీలికలు, రెబల్స్‌ బెడద నేపథ్యంలో అనుహ్యంగా స్వతంత్ర అభ్యర్థిని విజయం వరించే అవకాశాలుంటాయి. అటువంటి పరిస్థితులను సైతం పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని కూటమి, వైసీపీ నేతలు భావిస్తున్నారు.

Updated Date - Oct 24 , 2026 | 11:39 PM