Share News

అనుసంధానం అసంపూర్ణం!

ABN , Publish Date - Aug 06 , 2026 | 01:24 AM

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి త్వరగా ప్రయాణికులను చేర్చాలనే ఆలోచనతో వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ, ఆర్‌ అండ్‌ బి చేపట్టిన రహదారులకు సరైన కనెక్టివిటీ లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మాస్టర్‌ప్లాన్‌ రహదారులకు దాదాపు రూ.175 కోట్లు వెచ్చించారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అవసరమైన కనెక్టివిటీ లేదని, వాటి వల్ల ప్రయోజనం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అనుసంధానం  అసంపూర్ణం!
బీచ్‌ రోడ్డుకు కనెక్షన్‌ లేని తాళ్లవలస - నేరెళ్లవలస మాస్టర్‌ప్లాన్‌ రహదారి

భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు

నిర్మించిన రహదారులపై పెదవివిరుపు

ఆ రోడ్లకు కనెక్టివిటీ ఏదీ?

అడవివరం-శొంఠ్యాం మార్గంలో వెళితే...

ఆనందపురం జంక్షన్‌ వరకూ సర్వీస్‌ రోడ్డులోనే ప్రయాణం

హైవేకు కలపాలని జిల్లా అధికారులు కోరినా

సహకరించని ఎన్‌హెచ్‌ఏఐ

బీచ్‌ రోడ్డుకు కనెక్షన్‌ లేని తాళ్లవలస-నేరెళ్లవలస మాస్టర్‌ప్లాన్‌ రహదారి

ఆనందపురం జంక్షన్‌లో అవే సమస్యలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి త్వరగా ప్రయాణికులను చేర్చాలనే ఆలోచనతో వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ, ఆర్‌ అండ్‌ బి చేపట్టిన రహదారులకు సరైన కనెక్టివిటీ లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మాస్టర్‌ప్లాన్‌ రహదారులకు దాదాపు రూ.175 కోట్లు వెచ్చించారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అవసరమైన కనెక్టివిటీ లేదని, వాటి వల్ల ప్రయోజనం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అడవివరం నుంచి శొంఠ్యాం వరకూ (8 కి.మీ.) ఆరు వరుసల రహదారి వేశారు. కాలభైరవ ఆలయం వద్ద అటవీ శాఖకు చెందిన అనుమతులు వస్తే అక్కడి పెండింగ్‌ పని కూడా పూర్తవుతుంది. ఈ మార్గంలో శొంఠ్యాం అండర్‌ పాస్‌ నుంచి అవతలకు వెళి అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారికి కనెక్ట్‌ అవుతారు. అది కేవలం సర్వీస్‌ రోడ్డు మాత్రమే. అక్కడ వెంటనే ఆ జాతీయ రహదారి ‘ప్రధాన మార్గం’లోకి వెళ్లడానికి ఎక్కడా అవకాశం లేదు. నేరుగా సర్వీసు రోడ్డులోనే సుమారు 12 కి.మీ. ప్రయాణించి ఆనందపురం జంక్షన్‌ వరకు వెళ్లాలి. దానివల్ల అక్కడ పూలమార్కెట్‌ ట్రాఫిక్‌లో చిక్కుకోవలసి వస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి శొంఠ్యాం అండర్‌ పాస్‌ పైవంతెన ఎక్కడైతే...ప్రధాన రహదారిపై ల్యాండింగ్‌ అవుతుందో అక్కడ సర్వీస్‌ రోడ్డు నుంచి హైవే పైకి రావడానికి కనెక్టివిటీ ఇవ్వాలని గతంలో కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీఎంఆర్‌డీఏ అధికారులు కోరారు. దీనికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు పరిశీలిద్దామని అన్నారే తప్ప ఏడాదిన్నర అయినా ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అనకాపల్లి-ఆనంపురం జాతీయ రహదారిపై ప్రధాన మార్గంలో వెళితే ఆ వేగం వేరు. అదే సర్వీసు రోడ్డులో వెళితే ఆ వేగం వేరు. పైగా సర్వీసు రోడ్డులో వెళ్లడం వల్ల ఆనందపురం జంక్షన్‌లో పూల మార్కెట్‌ తగులుతుంది. అదే ప్రధాన అడ్డంకి. అదే ప్రధాన మార్గంలో వెళితే ఆ జంక్షన్‌కు వెళ్లకుండా నేరుగా వెళ్లిపోవచ్చు. ఇది ఎంతో ఉపయోగకరమైనదైనా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పట్టనట్టు ఉంటున్నారు.

బీచ్‌ రోడ్డుకు కనెక్టివిటీ లేకుంటే ఎలా...?

వీఎంఆర్‌డీఏ చేపట్టిన ఏడు మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల్లో జాతీయ రహదారి-16లో తాళ్లవలస నుంచి నేరెళ్లవలస వరకు 3.9 కి.మీ. రహదారిని నాలుగు వరుసల్లో విస్తరించారు. దీనిని కొత్తవలస వరకు కలపాలనేది ప్రతిపాదన. అది ఇంకో 1.5 కి.మీ. దూరం ఉంటుంది. ఇప్పుడు నేరెళ్లవలస వరకు రోడ్డు వేసి ఆపేశారు. మిగిలిన భాగం పూర్తిచేయలేదు. ప్రస్తుతం బీచ్‌ రోడ్డు నుంచి ఆ మార్గంలో ఎన్‌హెచ్‌-16 పైకి (తాళ్లవలస వద్ద) చేరాలంటే...అసంపూర్తిగా వదిలేసిన 1.5 కి.మీ. మార్గానికి అడ్డదారుల్లో, సందులో వెళ్లాల్సి ఉంది. ఇదే విషయం వీఎంఆర్‌డీఏ అధికారుల వద్ద ప్రతిపాదిస్తే...కోస్టల్‌ కారిడార్‌లో భాగంగా నేరెళ్లవలస వరకు ఒక రోడ్డు కనెక్ట్‌ అవుతుందని, అందుకే అలా వదిలేశామని సమర్థించుకుంటున్నారు. ఇప్పుడు వేసినవన్నీ భోగాపురం కనెక్టివిటీ కోసమే. కోస్టల్‌ కారిడార్‌ నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందో..ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి. అది వచ్చేంత వరకు ఈ 1.5 కి.మీ. రోడ్డు వేయబోమని చెప్పడం ఎంత వరకు న్యాయమని ఆ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఎన్‌హెచ్‌-16ను కలిసే రహదారులకు నగరంలో ఎక్కడికక్కడ ఫ్రీలెఫ్ట్‌లు ఇవ్వాలని, జంక్షన్ల విస్తరణ పనులు చేపడతామని జీవీఎంసీ అధికారులు ప్రకటించారు. ఆ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నెల 17 నుంచే భోగాపురం విమానాశ్రయంలో ఆపరేషన్లు ప్రారంభం కానున్నాయి. రోజుకు కనీసం ఐదు నుంచి పది వేల వాహనాలు అదనంగా ఆ మార్గంలో ప్రయాణిస్తాయి. ట్రాఫిక్‌ పెరుగుతుంది. అందువల్ల ప్రతిపాదనల దశలో ఉన్న పనులను త్వరగా చేపట్టి, పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.

Updated Date - Aug 06 , 2026 | 01:24 AM