సవ్యంగా సాగని ఏకీకృత సర్వే
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:52 AM
కుటుంబ వివరాల సేకరణ కోసం చేపడుతున్న ఏకీకృత (యూనిఫైడ్) సర్వే పక్కాగా సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పూర్తివివరాలు చెప్పడానికి ప్రజలు విముఖం
సంక్షేమ పథకాలు వర్తించవేమోననే ఆందోళనే కారణం
సర్వే కోసం ఇళ్లకు వెళ్లకుండా సచివాలయాలకు కుటుంబ సభ్యులను పిలిపించుకుంటున్న కొంతమంది సిబ్బంది
కొన్నిచోట్ల గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లలోకి సిబ్బందిని అనుమతించని పరిస్థితి
సర్వేలో 20వ స్థానంలో విశాఖ జిల్లా
విశాఖపట్నం/అక్కయ్యపాలెం/జ్ఞానాపురం,ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి):
కుటుంబ వివరాల సేకరణ కోసం చేపడుతున్న ఏకీకృత (యూనిఫైడ్) సర్వే పక్కాగా సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్వేలో అడుగుతున్న ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడానికి చాలామంది విముఖత చూపుతున్నారు. మొత్తం వివరాలు చెబితే...ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగిపోతాయోనన్న సందేహంతో అరకొర సమాచారం ఇస్తున్నారు. ఇక నగరంలో అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, అధిక ఆదాయం ఉన్న ప్రాంతాల్లో సర్వేకు అక్కడ నివాసితులు ఆసక్తి చూపడం లేదు. ఇదే సమయంలో కొన్నిచోట్ల సచివాలయాల సిబ్బంది ఇళ్లకు వెళ్లకుండా ప్రజలను సచివాలయాలకు రప్పించుకుంటూ సర్వే పూర్తిచేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రతి కుటుంబం వివరాల కోసం ఏకీకృత సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సర్వే బాధ్యతను గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బందికి అప్పగించింది. విశాఖ జిల్లాలో 607 గ్రామ/వార్డు సచివాలయాలు ఉండగా వాటిల్లో 4,532 మంది పోస్టులకుగాను 4,249 మంది పనిచేస్తున్నారు. జిల్లాలో 7,13,060 కుటుంబాలు ఉన్నాయి. సర్వేలో భాగంగా ప్రతి కుటుంబం నుంచి పూర్తివివరాలు సేకరించాలి. ప్రతి ఒక్కరి నుంచి 25 అంశాలపై వివరాలు తీసుకోవాలి. పేరు, స్థానికులా?, కాదా?, వృత్తి, ఆదాయం, సామాజిక స్థితిగతులు, సంక్షేమ పథకాలు అందుతున్నాయా?, పింఛన్, బియ్యం కార్డు, ఇతర పథకాలు, సొంత ఇల్లు, మౌలిక వసతులు, జీవన విఽధానం, ఇంట్లో వినియోగించే వస్తువులు...ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు, టీవీ, ఏసీ, ఇతర గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్లు వివరాలు నమోదుచేయాలి. ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా...అందరి నుంచి ఈ వివరాలు నమోదుచేయాలి. ఇంకా కుటుంబం మొత్తానికి కలిపి మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు తీసుకోవాలి. ప్రతి కుటుంబం తమ సచివాలయానికి అనుసంధానం కావాలి. దీనినే మ్యాపింగ్ అంటారు. మ్యాపింగ్ జరిగితేనే అన్నిరకాల సర్టిఫికెట్లు, చివరకు భూములు రిజస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుంది.
అయితే సర్వేలో మొత్తం వివరాలు చెబితే సంక్షేమ పథకాలు ఎక్కడ నిలిచిపోతాయేమోనన్న కారణంతో చాలామంది వాస్తవాలు చెప్పడం లేదు. పింఛన్, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు రద్దు అవుతాయేమోననే భయంతో తప్పుడు సమాచారం అందిస్తున్నారు. అధిక ఆదాయం కలిగిన కుటుంబాలు నుంచి సమాచారం రావడం లేదు. సచివాలయానికి ఆ ప్రాంతంలో నివసించే కుటుంబాలను మ్యాపింగ్ చేయడం తప్పనిసరి అని చెప్పినా వినడం లేదని సిబ్బంది వాపోతున్నారు. పాండురంగాపురం, కిర్లంపూడి లేఅవుట్, సీతమ్మధారలోని కొన్ని ప్రాంతాల్లో సర్వేకు కొందరు సహకరిస్తున్నా, మరికొందరు పూర్తివివరాలు ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇదిలావుండగా నగరంలోని కొన్ని సచివాలయాల సిబ్బంది ఇళ్లకు వెళ్లి సర్వే చేస్తుండగా, మరికొన్ని సచివాలయాల సిబ్బంది ఆయా కుటుంబ సభ్యులకు ఫోన్‌లు చేసి తమ కార్యాలయానికి రప్పించుకుంటున్నారు. ఎవరినీ సచివాలయాలకు పిలిపించుకోవద్దని, సిబ్బంది తప్పనిసరిగా ఇళ్లకు వెళ్లి సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చామని జిల్లా గ్రామ/వార్డు సచివాలయాల అధికారి ఉషారాణి స్పష్టంచేశారు. ప్రజలు కూడా సర్వే నిమిత్తం వచ్చే సచివాలయాల సిబ్బందికి సహకరించాలన్నారు. సచివాలయంతో కుటుంబం మ్యాపింగ్ కాకపోతే సర్టిఫికెట్లు మంజూరు, ప్రభుత్వం నుంచి అందే సేవలకు ఇబ్బంది ఉంటుందన్నారు. కాగా గురువారం నాటికి జిల్లాలో 7,13,060 కుటుంబాలకుగాను 4,42,618 (62.07 శాతం) కుటుంబాల సర్వే పూర్తిచేశారు. గ్రామీణ ప్రాంతంతో పోల్చితే నగరంలో కొంత వెనుకబడి ఉన్నందున రాష్ట్రంలో విశాఖ జిల్లా 20వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో సర్వేను వేగవంతం చేయాలని సచివాలయాల సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.