పాడి పశువులకూ బీమా రాయితీ
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:36 AM
పాడి పశువులకు బీమా రాయితీ పథకం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. తొలుత మేకలు, గొర్రెలకు మాత్రమే బీమా పథకంలో ప్రభుత్వం 85 శాతం రాయితీ కల్పించింది. పాడి పశువులకు బీమా రాయితీ కల్పించ లేదు.
జిల్లాకు రూ.13 లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం
గతంలో మేకలు, గొర్రెలకు మాత్రమే బీమా సబ్సిడీ
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఆవులు, గేదెలకు కూడా..
నర్సీపట్నం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పాడి పశువులకు బీమా రాయితీ పథకం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. తొలుత మేకలు, గొర్రెలకు మాత్రమే బీమా పథకంలో ప్రభుత్వం 85 శాతం రాయితీ కల్పించింది. పాడి పశువులకు బీమా రాయితీ కల్పించ లేదు. ఈ సమస్యపై ఈ నెల 6న ‘పాక్షికంగా పశు బీమా’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన ప్రభుత్వం జిల్లాలో పశు బీమా పథకం అమలుకు రూ.13 లక్షలు మంజూరు చేసింది. మొదట్లో మేకలు, గొర్రెలకు రూ.5లక్షలు మంజూరు చేసింది. తాజాగా విడుదలైన నిధులతో కలుపుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా రూ.18 లక్షలు మంజూరు చేసింది. పాడి పశువులతో పాటు మిగిలి పోయిన మేకలు, గొర్రెలకు కూడా బీమా చేయించవచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.8లక్షలు మాత్రమే పశు బీమా పథకానికి నిధులు మంజూరయ్యాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది అదనంగా రూ.10 లక్షలు విడుదల చేసింది.
పశువులకు బీమా ఎలా చేసుకోవాలంటే..
రూ.30 వేలు విలువ చేసే పాడి పశువులకు బీమా ప్రీమియం రూ.1920 కాగా, రైతు రూ.288 చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన రూ.1,632లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. అలాగే రూ.15 వేలు విలువ చేసే దేశవాళీ పశువుకి రూ.960 ప్రీమియం కాగా, పశు పోషకుడు రూ.144 చెల్లిస్తే, మిగిలిన రూ.816 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. అనుకోని విపత్తులు, వ్యాధుల కారణంగా పశువులు మరణిస్తే బీమా పథకం రైతును ఆదుకుంటుంది. రైతు చేయాల్సిందల్లా... పశువు మరణిస్తే సంబంధిత పశు వైద్యాధికారికి ముందుగా సమాచారం ఇవ్వాలి. పశువు మృతదేహాన్ని తరలించకూడదు. బీమా నిబంధనల ప్రకారం పశువుల డాక్టరు పరిశీలించి, పోస్టుమార్టం చేసి మరణ దృవీకరణ పత్రం, అవసరమైన ఇతర పత్రాలు రైతుకు అందజేస్తారు. రైతు బీమా క్లయిమ్ చేసుకునే సమయంలో బీమా పాలసీ వివరాలు, పశువు గుర్తింపు (ట్యాగ్ ) వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు అందజేయాలి. గతంలో ఎప్పుడు లేని విధంగా జిల్లాకు ఎక్కువ నిధులు వచ్చాయని, అర్హత కలిగిన రైతులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి స్వామి కోరారు.