Share News

రైతన్నకు బీమాతో ధీమా

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:19 AM

ప్రకృతి విపత్తులతో పంటలను నష్టపోయే అన్నదాతలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం పీఎం పసల్‌ బీమా యోజనను మరో ఏడాది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో అమలు చేసిన పంటల బీమాను 2026-27 ఆర్థిక సంవత్సరంలోనూ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

రైతన్నకు బీమాతో ధీమా
మన్యంలో వరి పంట

- మరో ఏడాది పీఎం పసల్‌ బీమా యోజన గడువు పొడిగింపు

- ఏజెన్సీలో వరి, రాగులు, మొక్కజొన్న, రాజ్‌మా, పసుపు పంటకు బీమా సదుపాయం

- గిరి రైతులకు పంటల బీమాపై సంపూర్ణ అవగాహన కల్పిస్తేనే ప్రయోజనం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ప్రకృతి విపత్తులతో పంటలను నష్టపోయే అన్నదాతలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం పీఎం పసల్‌ బీమా యోజనను మరో ఏడాది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో అమలు చేసిన పంటల బీమాను 2026-27 ఆర్థిక సంవత్సరంలోనూ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసినప్పటికీ ప్రకృతి వైపరీత్యాల కారణంగా చేతికందని పరిస్థితులు ఏర్పడితే, పంటల బీమా పథకం వారికి ఆసరాగా నిలుస్తుంది. ముఖ్యంగా ఎప్పుడు ఎటువంటి వాతావరణం నెలకొంటుందో తెలియని గిరిజన ప్రాంతంలోని ప్రధాన పంటలకు బీమా సదుపాయం కల్పించడంతో రైతులకు చాలా వరకు ప్రయోజనం చేకూరుతుందని వ్యవసాయాధికారులు అంటున్నారు. అలాగే జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో వరి, రాగులు, మొక్కజొన్న, పసుపు పంటలకు, రబీ సీజన్‌లో పండే వరి, రాజ్‌మా పంటలకు పీఎం పసల్‌ బీమా చేసుకునే అవకాశం కల్పించారు. ఏజెన్సీలో ఖరీఫ్‌ సీజన్‌లో వరి 38 వేల హెక్టార్లు సాగవుతుండగా, రాగులు 15 వేల హెక్టార్లు, మొక్కజొన్న 3,273 హెక్టార్లు, పసుపు 25 వేల హెక్టార్లు సాగు చేస్తున్నారు. రబీ సీజన్‌లో వరి 10 వేల హెక్టార్లు, రాజ్‌మా 20 వేల హెక్టార్లలో పండిస్తున్నారు. అయితే వరి, రాగుల పంటలను గిరిజనులు తమ ఆహార అవసరాలకు మాత్రమే సాగు చేస్తుండగా, పసుపు, రాజ్‌మా, మొక్కజొన్న పంటలను వాణిజ్యపరంగా పండిస్తూ ఆదాయం పొందుతున్నారు. కాగా గిరిజనులకు సంపూర్ణ ఆదాయాన్ని తెచ్చిపెట్టే పసుపు, రాజ్‌మా పంటలకు పీఎం పసల్‌ బీమా పథకాన్ని వర్తింపజేయడం వల్ల ఎంతో ప్రయోజనం కలగనుంది. గిరిజనులు తమ అవసరాలకు పసుపు, రాజ్‌మా పంటలపైనే ఆధారపడతారు. అనుకోని విధంగా ఏదైనా విపత్తులతో ఈ రెండు(పసుపు, రాజ్‌మా) పంటలు నాశనమైతే గిరిజనులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు. ఈ క్రమంలో పసల్‌ బీమా పథకాన్ని అమలు చేయడం ద్వారా ఆయా పంటలపై ఆధారపడే రైతులకు ఆసరా ఉంటుందని వ్యవసాయాధికారులు తెలిపారు.

గిరి రైతులకు అవగాహన కల్పించాలి

ఏజెన్సీలో సుమారుగా 80 శాతం మంది గిరిజనులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ వారికి పంటల బీమాపై అవగాహన లేకపోవడంతో నష్టపోతున్నారు. అలాగే కొద్ది మంది రైతులు తమ పంటలకు బీమా చేసినప్పటికీ, పంట నష్టం జరిగితే పరిహారం పొందే విధానం తెలియక లబ్ధి పొందలేకపోతున్నారు. ఈ క్రమంలో గిరి రైతులకు పంటల బీమాపై సంపూర్ణ అవగాహన కల్పించి, వారి పంటలకు ఆర్థిక రక్షణ కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులపై ఉంది. వాస్తవానికి ఏజెన్సీలో అధిక విస్తీర్ణంలో పంటలు సాగుచేస్తున్నప్పటికీ, రైతులకు పీఎం పసల్‌ బీమా పథకంపై సరైన అవగాహన లేని కారణంగా బీమా పథకం లబ్ధి పొందలేకపోతున్నారు. ఈ విషయంతో అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ, చొరవతోనే గిరిజన రైతులకు మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jul 08 , 2026 | 12:19 AM