Share News

చాలని బస్సులు.. తప్పని పాట్లు

ABN , Publish Date - May 12 , 2026 | 01:36 AM

రద్దీ సమయంలో సరిపడ ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

చాలని బస్సులు.. తప్పని పాట్లు

అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్సులో ఉదయం, సాయంత్రం రద్దీ

స్ర్తీ శక్తి పథకంతో పెరిగిన ప్రయాణికులు

అందుబాటులోకి రాని అదనపు బస్సులు

ప్రయాణికుల తీవ్ర ఇక్కట్లు

అనకాపల్లి టౌన్‌, మే 11 (ఆంధ్రజ్యోతి):

రద్దీ సమయంలో సరిపడ ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్సులో బస్సుల కోసం చాలా సేపు వేచివుండాల్సి వస్తున్నది. బస్సు వచ్చిందే తడవుగా.. ఒక్కసారిగా ఎగబడుతున్నారు. ముఖ్యంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు ఈ సమస్య అధికంగా వుంటున్నది.

అనకాపల్లి ఆర్టీసీ డిపోలో మొత్తం 90 బస్సులు వున్నాయి. వీటిలో రెండు ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులుకాగా మిగిలినవన్నీ పల్లెవెలుగు, ఆల్ర్టా పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు. అనకాపల్లి జిల్లా ఏర్పడకముందు విశాఖపట్నం ఉమ్మడి జిల్లాగా వున్నప్పుడు ఇతర మండలాల ప్రజలు జిల్లా కేంద్రంలో వివిధ పనుల నిమిత్తం నేరుగా అక్కడకు వెళ్లేవారు. నాలుగేళ్ల క్రితం జిల్లాల పునర్విభజన జరిగి, అనకాపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడిన తరువాత వారంతా ఇప్పుడు అనకాపల్లి వస్తున్నారు. దీంతో మండలాల నుంచి రాకపోకలు బాగా పెరిగాయి. అవకాశం వున్న మేరకు ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లోనే రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో బస్సులు కిటకిటలాడుతుంటాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు నుంచి స్ర్తీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. కానీ గత ఏడాది కాలంలో అనకాపల్లి డిపోకు కొత్త బస్సులు వచ్చిన దాఖలాలులేవు. అనకాపల్లి నుంచి విశాఖ నగరం, ఎలమంచిలి మినహా మిగిలిన విజయనగరం, సబ్బవరం, పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, దేవరాపల్లి, రాంబిల్లి తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు సరిపడ బస్సులు నడవడంలేదు. దీంతో ఆయా బస్సులన్నీ వంద శాతానికి మించి ఓఆర్‌తో నడుస్తున్నాయి. ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగించే ఉదయం, సాయంత్రం వేళల్లో సరిపడ బస్సులు లేకపోవడంతో ఆర్టీసీ కాంప్లెక్సుల్లో చాలా సేపు వేచివుండాల్సి వస్తున్నది. ప్లాట్‌ఫారంపైకి బస్సు రాకముందే ప్రయాణికులు ఎక్కడానికి ఎగబడుతున్నారు. ఈ క్రమంలో వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, చిన్నపిల్లల తల్లులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో చోడవరం బస్టాప్‌, నెహ్రూచౌక్‌ బస్టాపుల్లో పలువురు ప్రయాణికులు బస్సులు ఎక్కేవారు. కానీ స్ర్తీశక్తి పథకం అమల్లోకి వచ్చిన తరువాత బస్సులన్నీ కాంప్లెక్సులోనే నిండిపోతున్నాయి. దీంతో చోడవరం, నెహ్రూచౌక్‌ బస్టాపుల్లో ఎక్కేవారంతా ఇప్పుడు కాంప్లెక్సుకు వచ్చేస్తున్నారు

స్ర్తీ శక్తి పథకం రాకముందు పలువురు మహిళలు ఆటోలు, టాటా ఏస్‌, మ్యాక్సీ క్యాబ్‌ వంటి వాటిలో ప్రయాణించేవారు. ఉచిత పథకం అమల్లోక వచ్చిన తరువాత 90 శాతం మందికిపైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. కాగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపకపోవడాన్ని డీపీటీవో వి.ప్రవీణ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా... కొత్త బస్సుల కేటాయింపునకు ప్రతిపాదనలు పంపామని, త్వరలో అదనపు బస్సులు వస్తాయని చెప్పారు.

Updated Date - May 12 , 2026 | 01:36 AM