హోటళ్లలో కొనసాగిన తనిఖీలు
ABN , Publish Date - Sep 27 , 2026 | 01:02 AM
నగరంలోని హోటల్స్, రెస్టారెంట్స్‌లో ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అధికారుల తనిఖీలు రెండో రోజైన శనివారం కూడా కొనసాగాయి.
‘వాయుపుత్ర టిఫిన్స్ అండ్ మీల్స్’ రెస్టారెంట్‌లో 28 కిలోల నిల్వ ఆహారం గుర్తింపు
సెక్షన్ 55, 56, 58 ప్రకారం కేసు నమోదు
విశాఖపట్నం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని హోటల్స్, రెస్టారెంట్స్‌లో ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అధికారుల తనిఖీలు రెండో రోజైన శనివారం కూడా కొనసాగాయి. డ్రగ్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ విభాగం డైరెక్టర్ పి.అరుణ్‌బాబు ఆధ్వర్యంలో శుక్రవారం పలు హోటళ్లు, రెస్టారెంట్స్‌లో తనిఖీలు నిర్వహించిన అధికారులు భారీగా నిల్వ ఆహారాన్ని గుర్తించారు. ఆయన ఆదేశాల మేరకు శనివారం కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ ఎస్.కల్యాణ్‌చక్రవర్తి, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అప్పారావు, ఇతర అధికారులు ఎంవీపీ కాలనీ సెక్టార్ 8లోని ‘వాయుపుత్ర టిఫిన్స్ అండ్ మీల్స్’ రెస్టారెంట్‌లో 28 కిలోల నిల్వ ఆహారాన్ని గుర్తించారు. అందులో చికెన్ ఫ్రై, చికెన్ కర్రీతోపాటు పలు ఆహార పదార్థాలు ఉన్నాయి. ఆ రెస్టారెంట్‌పై సెక్షన్ 55, 56, 58 ప్రకారం కేసు నమోదు చేసినట్టు చెప్పారు. హోటల్/రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు వినియోగదారులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కిచెన్‌లోకి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని, బాగున్నట్టు భావిస్తేనే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. ఈ విషయంలో ఇబ్బందులు ఎదురైతే తమకు ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొంటున్నారు.